Telugu Global
Cinema & Entertainment

'వేట్టయన్‌' లో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కోరిన రజనీకాంత్‌

భారీ అంచనాల మధ్య దసరా కానుకగా అక్టోబర్‌ 10న విడుదల కానున్న రజనీకాంత్‌ 170వ సినిమా

వేట్టయన్‌ లో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కోరిన రజనీకాంత్‌
X

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా టి.జె.జ్ఞానవేల్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన మూవీ 'వేట్టయన్‌' భారీ అంచనాల మధ్య దసరా కానుకగా అక్టోబర్‌ 10న విడుదల కానున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కథ గురించి రజనీ ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. జ్ఞానవేల్‌ మొ దట చెప్పిన కథకు రజనీ మార్పులు సూచించారట. దానిలో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ యాడ్‌ చేయమని కోరారట. కుమార్తె సౌందర్య సిఫార్సు మేరకు రజనీకాంత్‌ వేట్టయాన్‌ కథ విన్నట్లు చెప్పారు.

జ్ఞానవేల్‌ డైరెక్షన్‌లో వచ్చిన 'జైభీమ్‌' మూవీ నాకెంతో నచ్చింది. కానీ గతంలో ఆయనతో ఎప్పుడూ మాట్లాడే అవకాశం రాలేదు. వేట్టయాన్‌ కథ వినమని నా కూతురు సౌందర్య నాకు చెప్పడంతో విన్నాను. బాగున్నదని అనిపించింది. అయితే ఈ సినిమా తెరకెక్కించాలంటే చాలా డబ్బు ఖర్చవుతుంది. అందుకే కథలో కొన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ యాడ్‌ చేయాలని కోరాను. 10 రోజుల టైం అడిగాడు. 'కమర్షియల్‌ సినిమాగా మారుస్తాను. కానీ నెల్సన్‌ దిలీప్‌కుమార్‌, లోకేశ్‌ కనగరాజ్‌ల సినిమాగా మార్చలేను. నా శైలిలో ఆడియన్స్‌కు నచ్చేలా ఈ కథను మారుస్తాను' అని జ్ఞానవేల్‌ చెప్పాడు. నాకు అదే కావాలి. లేదంటే లోకేశ్‌: దిలీప్‌ల దగ్గరికే వెళ్లేవాడిని కదా అన్నాను. పది రోజుల తర్వాత కథలో మార్పులు చేసి తీసుకొచ్చాడు. అది చూసి తాను ఆశ్చర్యపోయినట్లు రజనీ తెలిపారు. ఈ సినిమాకు అనిరుధ్‌ మాత్రమే మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఉండాలని జ్ఞానవేల్‌ పట్టుపట్టినట్లు సూపర్‌స్టార్‌ గుర్తుచేసుకున్నారు.

తమిళనాడులో గతంలో జరిగిన ఓ బూటకపు ఎన్‌కౌంటర్‌ నేపథ్యంతో డైరెక్టర్‌ జ్ఞానవేల్‌ ఈ మూవీని తెరకెక్కించారు. ఇది రజనీకాంత్‌కు 170వ సినిమా. ఇందులో ఆయన రిటైర్డ్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. అమితాబ్‌ బచ్చన్‌, ఫహాద్‌ ఫాజిల్‌, రానా, రితికాసింగ్‌, మంజు వారియర్‌, దుషారా విజయన్‌ కీలకపాత్రలు పోషించారు. తెలుగులోనూ అదే పేరుతో విడుదల కానున్నది.

First Published:  8 Oct 2024 5:15 AM GMT
Next Story