Telugu Global
Cinema & Entertainment

సౌత్ లో స్పీడు పెంచుతున్న పీవీఆర్- ఐనాక్స్!

పీవీఆర్- ఐనాక్స్ లిమిటెడ్ ఇక సౌతిండియాలో మల్టీప్లెక్సుల విస్తరణ ప్రణాళిక చేపట్టింది.

సౌత్ లో స్పీడు పెంచుతున్న పీవీఆర్- ఐనాక్స్!
X

పీవీఆర్- ఐనాక్స్ లిమిటెడ్ ఇక సౌతిండియాలో మల్టీప్లెక్సుల విస్తరణ ప్రణాళిక చేపట్టింది. సౌతిండియాలో సినిమా ప్రేక్షకులు అత్యధికంగా వుండడం వల్ల దృష్టి ఇటువైపు సారించింది. తమిళనాడులోని కడలూరులో కొత్త 3-స్క్రీన్ మల్టీప్లెక్స్ ని ప్రారంభిస్తూ సౌత్ మార్కెట్‌లో విస్తరణకి శ్రీకారం చుట్టింది. తమిళనాడులో 23 ప్రాపర్టీలలో 139 స్క్రీన్‌లతో తన స్థాపనని పటిష్టం చేసుకుంటుందని కంపెనీ తెలిపింది. మొత్తం 98 ప్రాపర్టీల్లో 549 స్క్రీన్‌లతో ఈ విస్తరణ వుంటుంది.

కొత్త స్క్రీన్ ఓపెనింగ్‌లలో ఎక్కువ భాగం (40-45%) దక్షిణ భారతదేశంలో వుండబోతోంది. ప్రస్తుతం శ్రీలంకని కలుపుకుని భారతదేశంలో 114 నగరాల్లో 359 ప్రాపర్టీల్లో 1712 స్క్రీన్‌లని కలిగి వున్న అతిపెద్ద ఫిల్మ్ ఎగ్జిబిషన్ కంపెనీగా వుంది పీవీఆర్- ఐనాక్స్. గత ఆదివారం బెంగళూరులోని మైసూరు రోడ్‌లో గల గ్లోబల్ మాల్‌లో కొత్త 7-స్క్రీన్ మల్టీప్లెక్స్ ప్రారంభించింది కంపెనీ. ఇప్పటికీ ఐటీ సిటీ బెంగుళూరులో వున్న 1,189-సీటర్ మల్టీప్లెక్స్ కెపాసిటీని 24 ప్రాపర్టీల్లో 146 స్క్రీన్స్ కి పెంచింది. ఆర్ధిక సంవత్సరం 2023 లో కంపెనీ మొత్తం కొత్త 168 స్క్రీన్‌లని జోడించింది. వీటిలో అత్యధికంగా 74 స్క్రీన్‌లు సౌత్ లో, ఆ తర్వాత 57 స్క్రీన్ లు నార్త్ లో వున్నాయి.

అయితే తక్కువ మాల్ కల్చర్ కారణంగా దక్షిణాదిలో మల్టీప్లెక్స్ వ్యాప్తి నాలుగు రాష్ట్రాల్లో అత్యల్పంగా వుందని ప్రభుదాస్ లీలా ధర్ ప్రైవేట్ లిమిటెడ్ రీసెర్చ్ నివేదిక తెలిపింది. సౌత్ మార్కెట్ ఎక్కువగా సింగిల్ స్రీస్న్‌లతో ఆధిపత్యం చెలాయిస్తోందనీ, ఇది నెమ్మదిగా మల్టీప్లెక్స్ కల్చర్ కి మారుతోందనీ తెలిపింది. అంచనాల ప్రకారం, దేశంలో దాదాపు 9,000-10,000 స్క్రీన్‌లున్నాయి, వీటిలో దాదాపు 6,000 సింగిల్ స్క్రీన్‌లు న్నాయి. 50 శాతానికి పైగా సింగిల్ స్క్రీన్లు సౌత్ లోనే వున్నాయని నివేదిక తెలిపింది.

పీవీఆర్- ఐనాక్స్ సౌత్ మీద దృష్టి సారించడానికి సౌత్ సినిమాల అద్భుత వ్యాపారం ప్రధాన కారణం. గత రెండేళ్ళలో అనేక సౌత్ సినిమాలు- ఆర్ ఆర్ ఆర్, కేజీఎఫ్-చాప్టర్ 2 , పుష్ప , పొన్నియన్ సెల్వన్ - 1, 2, విక్రమ్ మొదలైనవి పాన్-ఇండియన్ బ్లాక్‌బస్టర్‌లుగా నిలిచాయి, వేల కోట్ల వసూళ్ళని రాబట్టాయి.

అయితే మల్టీప్లెక్స్ విస్తరణకి సౌత్ సినిమాల పనితీరు ఒక ప్రమాణంగా వుంటుందని పై రీసెర్చి నివేదిక అంగీకరించడం లేదు. ఎందుకంటే కంటెంట్ అనేది నిలకడగా వుండదు. సౌత్ సినిమాలు బాగా ఆడుతున్నాయి కానీ ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాల తర్వాత, ఇంతే బలమైన కంటెంట్ తో ఇలా వసూళ్ళు సాధించే సినిమాలే వుంటాయని నమ్మకం లేదనీ, అందుకని అప్పుడు విస్తరణ ప్రణాళికాకి ఎదురుదెబ్బ తగలవచ్చనీ నివేదిక పేర్కొంది.

అయితే, మొత్తం బాక్సాఫీసు కలెక్షన్లలో సౌత్ సినిమాల వాటా కోవిడ్ పూర్వ స్థాయి కంటే చాలా ఎక్కువ అని నివేదిక పేర్కొంది. కోవిడ్ తర్వాత, ప్రేక్షకులు తగ్గి లిక్విడిటీ సవాళ్ళ కారణంగా దేశవ్యాప్తంగా వందలాది సింగిల్ స్క్రీన్‌లు మూసివేయవలసి వచ్చిందనీ, చాలా సింగిల్ స్క్రీన్‌లు మల్టీప్లెక్సులుగా మారుతున్నాయనీ, వాటిని స్థాపించిన మల్టీప్లెక్స్ ప్లేయర్‌లతో రీబ్రాండ్ చేస్తున్నాయనీ నివేదిక వెల్లడించింది.

కంటెంట్ బాగా లేకుంటే ఆక్యుపెన్సీ సమస్య వుంటుంది. కాబట్టి స్క్రీన్‌ల సంఖ్యని ఓవర్‌లోడ్ చేయలేదు పీవీఆర్- ఐనాక్స్. కానీ ప్రతి నగరం అభివృద్ధి చెందుతున్నప్పుడు, మరింత ఆశించే వినియోగదారులు వుంటారు. కనుక ఆర్ధిక సంవత్సరం 2025 లో దాదాపు 150 నుంచి 200 వరకు స్క్రీన్స్ ని ప్లాన్ చేస్తోంది కంపెనీ. ముంబాయి, ఢిల్లీ నగరాల్లో మరిన్ని ప్రాజెక్టులు రానున్నాయి. ఈ టైర్ 1 మెట్రోలలో ఇంకా పూర్తిగా సర్వీస్ లేని ప్రాంతాలున్నాయి.

సింగిల్ స్క్రీన్‌లు మల్టీప్లెక్సులు కలిసి వుండే నగరం ఒకప్పుడు ముంబాయి. ఇప్పుడు ఎక్కువ సింగిల్ స్క్రీన్‌ థియేటర్లు కనిపించవు. సౌత్‌ విషయానికొస్తే, చాలా అవకాశాలు పెరుగుతున్నాయి. ప్రెస్టీజ్ గ్రూప్, లులూ గ్రూప్, బ్రిగేడ్ గ్రూప్ మొదలైన డెవలపర్లు నడిపే చాలా మాల్స్ సౌత్‌లో వస్తున్నాయి. సౌత్ లో రిటైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని నిర్మించడానికి ఇవి చాలా డబ్బులు వెచ్చిస్తున్నాయి.

ఇలాంటప్పుడు సౌత్‌లో సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల చావు తప్పదా? సింగిల్ స్క్రీన్ ధరలకి సరిపోయేలా ఈ మార్కెట్‌లలో మల్టీప్లెక్స్ టిక్కెట్ ధరల్ని తగ్గిస్తారా? కాలక్రమేణా, సింగిల్ స్క్రీన్ థియేటర్లు అంతరించిపోతున్నాయి. టిక్కెట్ ధరలకి సంబంధించి, దక్షిణాది మార్కెట్లు ఇప్పటికే టిక్కెట్ ధరల్ని నియంత్రిస్తున్నాయి. తమిళనాడులో, ఆంధ్రాలో నియంత్రిత టిక్కెట్ ధరలున్నందున, మల్టీప్లెక్షులు అంతకంటే ఎక్కువ వసూలు చేయలేవు.

ఈ నేపథ్యంలో పీవీఆర్- ఐనాక్స్ ఇంకా వేలూరు, ఆర్మూరు, మచిలీపట్నం రెండవ శ్రేణి పట్టణాల్లో కూడా విస్తరించాలని యోచిస్తోంది. ఇక్కడ మల్టీప్లెక్సులు లేనందున ఇవి చాలా ఉత్తేజకరమైన మార్కెట్‌లుగా భావిస్తోంది.

First Published:  23 Dec 2023 5:00 PM IST
Next Story