Telugu Global
Cinema & Entertainment

చెన్నైలో పీవీఆర్ ఐస్ థియేటర్ ప్రారంభం!

దేశంలోని ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్‌లలో ఒకటైన పీవీఆర్- ఐనాక్స్ గ్రూపు వినోద పరిశ్రమ ఆవిష్కరణల్లో ఎల్లప్పుడూ ముందంజలో ఉంటోంది. ఇప్పుడు పీవీఆర్ ఐస్ దాని కిరీటంలో మరొక రత్నం. ఐస్ (ICE) అంటే 'ఇన్-సినిమా ఎంటర్‌టైన్‌మెంట్'. ఇది నిన్న చెన్నైలో ప్రారంభమైంది.

చెన్నైలో పీవీఆర్ ఐస్ థియేటర్ ప్రారంభం!
X

ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న సినిమా ప్రదర్శనా రంగంలో పీవీఆర్- ఐనాక్స్ మల్టీప్లెక్స్ గ్రూపు గేమ్ ఛేంజర్‌గా ఉద్భవిస్తున్న దృశ్యం వెండి తెర సాక్ష్యంగా కన్పిస్తోంది. సినిమా చరిత్రలో వెండి తెర ఎన్నో మార్పు చేర్పులు చెందుతూ పురోగమిస్తోంది. సంభ్రమాశ్చర్యాలతో ప్రేక్షకులు సినిమాలు చూసే అపూర్వానుభవాన్ని పునర్నిర్వచిస్తోంది. పీవీఆర్- ఐనాక్స్ ఓ వినూత్న కాన్సెప్ట్ తో అత్యాధునిక సాంకేతికాల్ని విలాసవంతమైన వాతావరణంతో మిళితం చేసి, సినిమా ఔత్సాహికులకి మరపురాని సినిమా ప్రయాణాన్ని సృష్టిస్తోంది. ఈ క్రమంలో ఆవిర్భవించిందే పీవీఆర్ ఐస్ థియేటర్. దేశంలోని ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్‌లలో ఒకటైన పీవీఆర్- ఐనాక్స్ గ్రూపు వినోద పరిశ్రమ ఆవిష్కరణల్లో ఎల్లప్పుడూ ముందంజలో ఉంటోంది. ఇప్పుడు పీవీఆర్ ఐస్ దాని కిరీటంలో మరొక రత్నం. ఐస్ (ICE) అంటే 'ఇన్-సినిమా ఎంటర్‌టైన్‌మెంట్'. ఇది నిన్న చెన్నైలో ప్రారంభమైంది.

బెంగళూరులో జులైలో ప్రారంభమైన‌ 12-స్క్రీన్లతో కూడిన సూపర్‌ప్లెక్స్ ఇదే కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఢిల్లీ, గురుగ్రామ్‌లలో మొదటి రెండింటిని ప్రారంభించిన తర్వాత, ఇది దేశంలో మూడవ ఐస్ థియేటర్, చెన్నైలో నాల్గవది. ఐస్ థియేటర్ ప్రత్యేకతల్లో ఒకటి దాని అత్యాధునిక సాంకేతిక స్వరూపం. థియేటర్‌లో అత్యాధునిక ప్రొజెక్షన్ని, సౌండ్ సిస్టమ్‌ నీ ఏర్పాటు చేశారు. పెద్ద స్క్రీన్స్ పై అధిక-రిజల్యూషన్ ప్రొజెక్షన్ తో బొమ్మని ప్రదర్శించే విధానమే మారిపోయింది. దీనికి త్రీ-డైమెన్షనల్ ఆడియోకి పేరుగాంచిన‌ డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ సినిమా వీక్షించడానికి కొత్త కోణాన్ని జోడిస్తోంది. ప్రతి శబ్దం, గుసగుసలు, పేలుళ్ళూ అద్భుతంగా ప్రేక్షకుల ప్రతి భావోద్వేగానికీ గాలం వేసి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.

సీటింగ్ ఏర్పాటు కూడా విలాసవంతమైన లెగ్‌రూమ్‌తో, వాలుగా ఉండే సీట్లతో, మొత్తం స్క్రీనింగ్ సమయంలో వీక్షకులకి అత్యంత సుఖవంతమైన సౌకర్యాన్ని అందిస్తుంది. థియేటర్ ఇంటీరియర్ డిజైన్ ఇంకో చెప్పుకోదగ్గ విశేషం. ఖరీదైన తివాచీలు, మైమరపించే లైటింగ్, సొగసైన డెకర్, మొత్తం సినిమాటిక్ అనుభవాన్ని ఆహ్లాదకరంగా మార్చేస్తాయి. ఆడిటోరియం ప్రతి వైపూ అమర్చిన ప్రత్యేక ప్యానెల్‌లు, డైనమిక్ ఆకారాలు, వాటి రంగులూ అద్భుత దృశ‌నీయ‌ వాతావరణాన్ని సృష్టిస్తాయి. గరిష్ట నాణ్యతతో 4 కె ప్రొజెక్షన్, రియల్ డీ త్రీడీ అందించే దృశ్యానుభవం ఇంకొకెత్తు. 237 మంది కూర్చునే సామర్థ్యం గల ఆడిటోరియంలో క్లాసిక్, ప్రైమ్, రిక్లయినర్ తరగతి సీట్లు ఉన్నాయి.

మన దేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద చలనచిత్ర మార్కెట్‌లలో ఒకటి. ఇక్కడ భారీ సమూహంతో విభిన్న ప్రేక్షకులు ఉన్నారు. కాబట్టి, ప్రేక్షకుల మారుతున్న ప్రాధాన్యాల్ని, అంచనాలనూ అందుకోవడానికి థియేటర్లు నిరంతరం కొత్త ఆవిష్కరణలు చేస్తూ పోవాల్సిందే. లేకపోతే థియేటర్లు ప్రేక్షకుల్ని కోల్పోయి హోమ్ థియేటర్లకి అప్పగించే పరిస్థితి వస్తుంది.

కనుక దేశంలోని వివిధ ప్రాంతాల్లోని మార్కెట్‌లకి వినూత్న తరహా ప్రదర్శనలని అందించే థియేటర్లని తీసుకు వచ్చే వ్యూహంలో భాగంగా కంపెనీ విస్తరిస్తోంది. ఈ గ్రూపు దేశంలో సినిమా ప్రద‌ర్శనల్లో, దాని నవీకరణల్లో శ్రేష్ఠతకి ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం 115 నగరాల్లో, 361 ప్రాపర్టీల్లో 1708 స్క్రీన్‌లని కలిగివుంది. ప్రారంభం నుంచే పీవీఆర్- ఐనాక్స్ చలనచిత్ర ప్రదర్శన పరిశ్రమలో ముఖ్యమైన మైలురాళ్ళని సాధించడం, బెంచ్‌ మార్క్ లని నెలకొల్పడం వంటి చరిత్రలతో ఐకానిక్ సినిమా బ్రాండ్‌లని సృష్టిస్తూ వస్తోంది. ఈ థియేటర్లని దక్షిణ దేశానికి విస్తరిస్తూ, ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు ముందడుగేస్తోంది. ఐస్ థియేటర్స్ అనేది ఒక ఆశాజనక సినిమా ఫార్మాట్. ఇది దేశంలో చలనచిత్ర వీక్షణానుభవాన్ని విప్లవాత్మకంగా మార్చగల సామర్థ్యాన్ని కలిగి వుంది.

ఇక తినుబండారాల విషయానికొస్తే, అంతర్జాతీయ వంటకాలతో బాటు, అనేక రకాల రుచికర స్థానిక వంటకాలు, పానీయాలూ నోరూరిస్తాయి. సినిమా ప్రదర్శనలే కాకుండా, స్పెషల్, ఈవెంట్‌లు, ప్రీమియర్‌లు నిర్వహించుకునేందుకు కూడా ఇక్కడ అవకాశాలున్నాయి. దీంతో ఈ థియేటర్లు సినిమా సెలబ్రిటీలకి హాట్‌స్పాట్‌గా మారాయి. సినిమా ఈవెంట్‌లు, ప్రమోషన్లు ఇక్కడ ఊపందుకుంటున్నాయి. మరి ఇక ఐస్ థియేటర్ల అనుభవం తెలుగు రాష్ట్రాలకి ఎప్పుడు అందుతుందో వేచి చూడాలి!

First Published:  5 Sept 2023 5:04 PM IST
Next Story