Tollywood | తమకు సంబంధం లేదంటున్న నిర్మాతల మండలి
Producers council - తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్స్ మూతపడుతున్నాయి. దీనిపై నిర్మాతల మండలి స్పందించింది.
ఓవైపు ఎండలు, మరోవైపు ఎన్నికలు, ఇంకోవైపు క్రికెట్ మ్యాచులు.. ఫలితంగా థియేటర్లు కూలబడ్డాయి. మరీ ముఖ్యంగా సింగిల్ స్క్రీన్స్ కుదేలయ్యాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో సింగిల్ స్క్రీన్స్ ను మూసేశారు. ఈ చర్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించుకుంది నిర్మాతల మండలి.
"గుంటూరు ఏరియాతో పాటు ఆంధ్రా ప్రాంతంలోని మరికొన్ని ప్రాంతాల్లోని సినిమా థియేటర్ల యజమానులు గత కొన్ని నెలలుగా తగిన ఆదాయం పొందలేకపోతున్నారని, తద్వారా డిజిటల్ ప్రొవైడర్లకు (UFO, Qube) ఛార్జీలు. చెల్లించలేకపోతున్నారని కారణాన్ని చూపుతూ తమ సినిమా థియేటర్లను మూసివేసినట్లు మా దృష్టికి వచ్చింది. అదే విధంగా తెలంగాణలో కూడా కొన్ని సినిమా థియేటర్ల యజమానులు ఇష్టానుసారం తమ థియేటర్లను ప్రేక్షకులు లేని కారణంగా ప్రదర్శన రద్దు చేయడమైనది అని పెడుతున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని అపెక్స్ బాడీస్ అంటే తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలికి సంబంధం లేకుండా, ఒక సంఘం సినిమా థియేటర్లను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నాం."
ఇలా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రకటన చేసింది. సమస్యను పరిష్కరించాల్సింది పోయి, తమకు ఏం సంబంధం లేదంటూ ప్రకటించడం విశేషం. అంతేకాదు.. థియేటర్లు మూసివేతపై తమకు ఎలాంటి నోటీసులు అందలేదు కాబట్టి, మీడియాలో వచ్చిన 'థియేటర్ల మూసివేత' కథనాల్ని ఫేక్ గా భావిస్తున్నట్టు ప్రకటించింది.
ఒకవేళ ఎక్కడైనా థియేటర్లు మూసివేస్తే, అది వాళ్ల వ్యక్తిగత నిర్ణయమని, ఎపెక్స్ బాడీస్ తో ఎలాంటి సంబంధం లేదని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తేల్చిచెప్పింది.