సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన నిర్మాత దిల్ రాజు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టాలీవుడ్ సినీ నిర్మాత దిల్ రాజు కలిశారు.
సీఎం రేవంత్‌రెడ్డిని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు కలిశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో గల ముఖ్యమంత్రి నివాసంలో కలిశారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా దిల్ రాజును ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన దిల్ రాజు... తనకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా దిల్ రాజును నియమిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే..తన సోదరుడు శిరీష్‌తో కలిసి దిల్ రాజు తెలంగాణ సీఎం నివాసానికి వచ్చారు.
ఈ సందర్భంగా సినిమా పరిశ్రమ అభివృద్ధి గురించి వారి మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి... దిల్ రాజుకు శాలువా కప్పి అభినందించారు. దిల్ రాజుఅసలు పేరు వెంకటరమణారెడ్డి. 1990లో పెళ్లి పందిరి అనే సినిమాతో పంపిణీదారుడిగా దిల్‌రాజు కెరీర్ ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఆయన సినిమాలను నిర్మిస్తున్నారు. 2003లో దిల్ సినిమాకు తొలిసారి ఆయన నిర్మాతగా వ్యవహరించారు. ఆ చిత్రం హిట్ తర్వాత ఆయన పేరు దిల్‌రాజుగా మారిపోయింది. టాలీవుడ్‌లో ఎన్నో విజయవంతమై సినిమాలను నిర్మిస్తూ అగ్ర నిర్మాతగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే కాకుండా చిన్న సినిమాలు నిర్మిస్తూ కొత్త వారికి ఛాన్సులు ఇస్తారు. ప్రస్తుతం ఆయన మూడు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.