Prithviraj Sukumaran | రజనీ సినిమాలో మరో హీరో
Prithviraj Sukumaran - త్వరలోనే రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ సినిమా స్టార్ట్ అవుతుంది. ఇందులో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు పృధ్వీరాజ్.

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించే సినిమాలో మరో హీరో ఉంటాడా? ఒకవేళ ఉంటే రజనీ స్టార్ డమ్ ముందు ఆయన కనిపిస్తాడా? అందుకే రజనీతో మల్టీస్టారర్ సినిమాలు రావు. అయితే ఈసారి మాత్రం రజనీకాంత్ సినిమాలో మరో హీరో కనిపించబోతున్నాడు. అయితే అంతా అనుకుంటున్నట్టు హీరోగా మాత్రం కాదు.. ఆ డీటెయిల్స్ చూద్దాం..
రజనీకాంత్ సినిమాలో విలన్ పాత్ర కోసం పృథ్వీరాజ్ సుకుమారన్‌తో చర్చలు జరుగుతున్నాయి. అవును, కోలీవుడ్ ఇన్‌సైడ్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ మలయాళీ సూపర్ స్టార్, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రాబోయే చిత్రంలో కనిపించనున్నాడు. ఈ యువ దర్శకుడు తాజాగా లియోతో బ్లాక్‌బస్టర్ సాధించాడు. ఇప్పుడు తన నెక్ట్స్ సినిమాను రజనీకాంత్ తో చేయబోతున్నాడు.
వచ్చే సమ్మర్ నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. లోకేష్ స్టైల్ లోనే ఫాస్ట్ గా షూటింగ్ కంప్లీట్ అవుతుంది. సో.. ఈ సినిమా కోసం పెద్దగా బ్రేక్స్ తీసుకోకుండా నటించబోతున్నారు రజనీకాంత్. ఈ చిత్రం చాలా స్పెషల్ గా ఉంటుందని లోకేష్ ఇప్పటికే ప్రకటించాడు. కథ ప్రకారం, సినిమాలో ఆశ్చర్యం కలిగించే ఎలిమెంట్స్ చాలా ఉంటాయని, నటీనటుల పరంగా కూడా చాలా మెరుపులు ఉంటాయని అంటున్నాడు. చెప్పినట్టుగానే పృధ్విరాజ్, ఈ ప్రాజెక్టులోకి వచ్చి చేరాడు.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. విక్రమ్ సినిమాలో రోలెక్స్ పాత్ర కోసం ముందుగా పృధ్వీరాజ్ నే అనుకున్నారు. కానీ డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేక అతడు నటించలేదు. ఆ పాత్రలో తర్వాత సూర్యను తీసుకున్నారు. రోలెక్స్ రోల్ లో సూర్య మెరిశాడు. మళ్లీ ఇన్నేళ్లకు, లోకేష్ కనగరాజ్, రజనీకాంత్ రాబోయే చిత్రంలో విలన్ పాత్ర కోసం పృథ్వీ సుకుమారన్ వచ్చి చేరాడు. ఇందులో అతడు విలన్.