Telugu Global
Cinema & Entertainment

ఫస్ట్ లుక్ ట్రోలింగ్ తో ఇది కూడా విడుదల వాయిదా!

ప్రభాస్ పానిండియా సినిమాల ఫస్ట్ లుక్స్ బెడిసి కొడుతున్నాయి.

ఫస్ట్ లుక్ ట్రోలింగ్ తో ఇది కూడా విడుదల వాయిదా!
X

ప్రభాస్ పానిండియా సినిమాల ఫస్ట్ లుక్స్ బెడిసి కొడుతున్నాయి. వందల కోట్ల బడ్జెట్స్ తో తీస్తున్న ప్రభాస్ సినిమాలు ఫస్ట్ లుక్ దగ్గరే చేతులెత్తేయడం ఆ సినిమాల ప్రమాణాల్ని పట్టిస్తున్నాయి. ‘ఆదిపురుష్’ తో ఇదే జరిగింది. ‘ఆదిపురుష్’ ఫస్ట్ లుక్ ని ప్రేక్షకులు తిప్పి కొట్టి భారీగా ట్రోలింగ్ చేశారు. దీంతో దర్శకుడు ఓం రౌత్ సినిమా సీజీఐ క్వాలిటీని పెంచుకునే పనిలో పడ్డాడు. సినిమా విడుదలయ్యాక ఆ క్వాలీటీ కూడా ప్రేక్షకుల చేత భారీగా ట్రోలింగ్ గురైంది. సినిమా అట్టర్ ఫ్లాప్ అయి దాని చాప్టర్ అక్కడితో ముగిసింది. ఇప్పుడు తిరిగి ‘కల్కి -2898 AD’ తోనూ ఇదే జరిగింది. దీని ఫస్ట్ లుక్ చాలా పూర్ క్వాలిటీతో వుండి షాక్ కి గురిచేసింది. గతవారం విడుదల చేసిన దీని ఫస్ట్ లుక్ కూడా భారీ ట్రోలింగ్ కి గురైంది. దీంతో త్వరత్వరగా నిర్మాణం పూర్తి చేసి జనవరి 12 న సంక్రాంతికి చేయాలనుకున్న రిలీజ్ వాయిదా పడింది.

దీని ఫస్ట్ లుక్ చూసి ప్రేక్షకులే కాదు, ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ప్రభాస్ తో బాటు హీరోయిన్ దీపికా పదుకొణెనూ ఆడిపోసుకున్నారు. ప్రభాస్‌ ని ‘సస్తా ఐరన్ మ్యాన్’ (చవక బారు ఐరన్ మ్యాన్) గా, దీపికాని ఫోటోషూట్ లుక్ కోసం పోజిచ్చిన లేడీగా అభివర్ణిస్తూ కసి తీర్చుకున్నారు. ఇనప కవచంతో ఒక చవకబారు ఐరన్ మాన్ బాడీకి ప్రభాస్ తల తెచ్చి అతికించినట్టుంది. చిన్నపిల్లవాడు కూడా ఇంతకంటే బాగా ఫోటో షాప్ చేస్తాడు.

ఇలావుండగా, ఈ మూవీ హాలీవుడ్ హిట్ రెండు భాగాల ‘డ్యూన్’ (2021, 2023) కి కాపీ అని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ప్రభాస్ మూవీ కూడా రెండు భాగాలుగానే విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ముందుగా ‘ప్రాజెక్ట్ కె’ అనే వర్కింగ్ టైటిల్ తో వున్న ఈ 600 కోట్ల యమ భారీ బడ్జెట్ మూవీకి ఫస్ట్ లుక్ తర్వాత ‘కల్కి -2898 AD’ అని టైటిల్ రిలీజ్ చేశారు.

ఒక్క ఫస్ట్ లుక్ దెబ్బకి సినిమా విడుదల తేదీ మారిపోయింది. 2024 జనవరి 12 న షెడ్యూల్ చేసిన విడుదల తేదీ మకర సంక్రాంతి, పొంగల్‌ల శుభప్రదమైన పండుగల సందర్భంగా అభిమానుల్లో గొప్ప ఉత్సాహాన్ని సృష్టింగలదని ఆశించినదంతా తలకిందులైంది. ఇక మే 9 కంటే ముందు విడుదలయ్యే అవకాశం లేదని ప్రకటించాల్సి వచ్చింది. అంటే ఇంకా 10 నెలలు నిరీక్షించాలి! ఫస్ట్ లుక్ కి సంబంధించిన రియాక్షన్స్ వైరల్‌గా మారడంతో నిర్మాత అశ్వనీదత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సీనియర్ అగ్ర నిర్మాత సి. అశ్వనీ దత్ మే 9 సెంటిమెంట్ గురించి తెలిసిందే. ఆయన నిర్మించిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి' (1990), 'మహానటి' (2018) మే 9నే విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచాయి. దీన్ని దృష్టిలో వుంచుకునే ‘కల్కి’ విషయంలో నిర్ణయం. అశ్వనీదత్ 1975-2022 మధ్య కాలంలో 31 సినిమాలు నిర్మించారు.

‘మహానటి’ తీసిన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి- 2898 AD’ సైన్స్ ఫిక్షన్ కథ. దీనికి సంబంధించిన ఇంకా చాలా వీఎఫ్‌ఎక్స్ వర్క్ మిగిలుందని చెబుతున్నా, జనవరి కల్లా ఇంకా ఐదు నెలలు చాలా సమయముంది. మరో 5 నెలలు విడుదలని పొడిగించాల్సిన అవసరం లేదు. దీన్ని బట్టి జనవరి విడుదలని ఫస్ట్ లుక్ ఇచ్చిన షాక్ తోనే క్యాన్సిల్ చేసినట్టు భావించ వచ్చు.

ఆసక్తికరమైన విషయమేమిటంటే, ‘ఆదిపురుష్’ కూడా మొదట జనవరిలోనే విడుదల చేయాలనుకున్నారు. మకర సంక్రాంతి సందర్భంగా 2023 జనవరిలో విడుదల చేయనున్నట్టు మొదట ప్రకటించారు. అయితే ఫస్ట్ లుక్ తో బాటు టీజర్ భారీ ట్రోలింగ్‌ ని ఎదుర్కొన్న తర్వాత, వీఎఫ్ఎక్స్ రీవర్క్ చేసి ఆరు నెలలు ఆలస్యంగా, జూన్ 16న విడుదల చేశారు.

‘కల్కి- 2898 AD’ లో ఇంకా అమితాబ్ బచ్చన్, కమల హాసన్ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ ఆధునీకరించిన ‘మహాభారతం’ అని చెప్పారు. అమితాబ్ అశ్వత్థామగా, ప్రభాస్ కర్ణుడుగా కన్పించనున్నారని అప్పట్లో చెప్పారు. 3వ ప్రపంచయుద్ధం నేపథ్యంలో సినిమా వుంటుందని కూడా తెలియజేశారు. మళ్ళీ ప్రభాస్ విష్ణువు పదవ అవతారం కల్కి పాత్రని పోషిస్తున్నట్టు వెల్లడించారు. ఇప్పుడు ‘డ్యూన్’ కి కాపీ అని బాలీవుడ్ మీడియా రాస్తోంది.

ప్రభాస్ నటిస్తున్న ఈ తాజా సైన్స్ ఫిక్షన్ కథా నేపథ్యం ఏదైనా ఖచ్చితంగా ఆసక్తికరంగానే అనిపిస్తుంది. కానీ ఫస్ట్ లుక్ బెడిసి కొట్టగా, టీజర్ కూడా పెద్దగా బజ్ క్రియేట్ చేయలేదు.

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ కి సక్సెస్ అనేది లేదు. ‘సాహో’, ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’ పానిండియాలు మూడూ అట్టర్ ఫ్లాపయ్యాయి. ఇక ‘కల్కి- 2898 AD’ కంటే ముందు సెప్టెంబర్ లో ‘సాలార్’ విడుదల కావాల్సి వుంది. దీని రిజల్ట్ ఎలా వుంటుందో!

First Published:  25 July 2023 4:09 PM IST
Next Story