ప్రభాస్ 'రెబల్' మళ్ళీ ఫ్లాపయ్యింది!
తెలుగు స్టార్స్ పుట్టిన రోజుకి సూపర్ హిట్టయిన సినిమాలు రీరిలీజ్ చేస్తున్న సరికొత్త ట్రెండ్ లో ప్రభాస్ నటించిన ‘రెబల్’ కూడా విడుదలైంది. పదేళ్ళ క్రితం 2012 లో విడుదలై ఫ్లాపయిన ఈ మూవీని రీరిలీజ్ చేస్తే మళ్ళీ ఫ్లాపయ్యింది.
తెలుగు స్టార్స్ పుట్టిన రోజుకి సూపర్ హిట్టయిన సినిమాలు రీరిలీజ్ చేస్తున్న సరికొత్త ట్రెండ్ లో ప్రభాస్ నటించిన 'రెబల్' కూడా విడుదలైంది. పదేళ్ళ క్రితం 2012 లో విడుదలై ఫ్లాపయిన ఈ మూవీని రీరిలీజ్ చేస్తే మళ్ళీ ఫ్లాపయ్యింది. ఇది తెచ్చి పెట్టుకున్న అవమానమే. ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరూ దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇది గతవారం అక్టోబర్ 15 న విడుదలైంది. కానీ ప్రభాస్ 43 వ పుట్టిన రోజు అక్టోబర్ 23న వస్తుంది. పుట్టిన రోజున కాకుండా విడుదల చేసి ఫ్లాప్ చేసుకోమని నిర్మాతల కెవరు చెప్పారో తెలీదు. పుట్టిన రోజున ఫ్రెష్ గా 'బిల్లా' సిద్ధం చేస్తున్నారు.
లారెన్స్ దర్శకత్వంలో 2012లో 'రెబల్' విడుదలైంది. తన ఫ్యామిలీ మరణానికి కారణమైన మాఫియాలపై యువకుడు ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనే పాయింట్‌తో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో రెబెల్‌గా ప్రభాస్ మాస్ క్యారెక్టర్‌లో కనిపిస్తే, రెబల్ స్టార్, దివంగత కృష్ణంరాజు కీలక పాత్ర పోషించారు. తమన్నా హీరోయిన్‌గా నటించింది. లారెన్స్ దర్శకత్వం వహించడంతో పాటు సంగీతాన్నీ అందించాడు.
రొటీన్ పాయింట్ కారణంగా ఆనాడు 'రెబల్' డిజాస్టర్‌గా నిలిచింది. నిర్మాతలు జె. భగవాన్, జె. పుల్లారావు తీవ్రంగా నష్టపోయారు. దీంతో నిర్మాతలు - లారెన్స్ గొడవ పడ్డారు కూడా. ఐతే ఈ రీరిలీజ్ మరో నిర్మాత నట్టికుమార్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన థియేటర్లలో 'రెబల్' స్పెషల్ షోలు ఏర్పాటు చేశారు. కానీ అంచనాలకి విరుద్ధంగా ప్రేక్షకుల స్పందన కరువైంది.
దీనికి భిన్నంగా ఇటీవల మహేష్ బాబు 'పోకిరి', పవన్ కళ్యాణ్ 'జల్సా', బాలకృష్ణ 'చెన్న కేశవ రెడ్డి' రీరిలీజులు సూపర్ హిట్టయ్యాయి. 'రెబల్' రీరిలీజ్ అయిన అక్టోబర్ 15 నే 'కాంతార' కూడా విడుదలైంది. 'కాంతార' ముందు 'రెబల్' నిలబడే అవకాశం లేదని ట్రేడ్ పండిట్లు అంటున్నారు. అసలు ప్రభాస్ నటించిన పానిండియా సినిమాలు 'సాహో', 'రాధే శ్యామ్' రెండూ ఫ్లాపవడం కూడా ప్రేక్షకుల ఆసక్తి తగ్గడానికి కారణం కావచ్చని ట్రేడ్ పండిట్లు అంటున్నారు.
ఇలా వుండగా, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ 80వ జన్మదినాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 8- 11 మధ్య, ఏకంగా ఫిల్మ్ ఫెస్టివల్ నే నిర్వహించారు. ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్, పీవీఆర్ మల్టీప్లెక్స్ సంస్థ భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా 17 కేంద్రాల్లో అమితాబ్ నటించిన చలనచిత్రాలని ప్రదర్శించారు. 'బచ్చన్ బ్యాక్ టు ది బిగినింగ్' అనేది ఈ నాలుగు రోజుల ఈవెంట్ పేరు. ఈ భారీ ఈవెంట్ దేశం అంతటా 22 థియేటర్లలోని 30 స్క్రీన్‌లలో జరిగింది. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, సూరత్, బరోడా, రాయ్‌పూర్, కాన్పూర్, కొల్హాపూర్, ఇండోర్ లతో బాటు బచ్చన్ స్వస్థలం ప్రయాగ్‌రాజ్ థియేటర్లలో చలన చిత్రోత్సవం జరిగింది.
దీవార్, కాలా పత్తర్, కభీ కభీ, అమర్ అక్బర్ ఆంథోనీ, డాన్, నమక్ హలాల్, అభిమాన్, మిలీ, సత్తే పే సత్తా, చుప్కే చుప్కే మొదలైన సినిమాలు ప్రదర్శించారు. టికెట్టు ధర 80 రూపాయలే కావడంతో ప్రేక్షకులు బారీగానే తరలి వచ్చారు.
ఈ సందర్భం గా అమితాబ్ బచ్చన్ స్పందన ఇదీ... 'ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్, పీవీఆర్ సంస్థ నా సినిమాలతో నా కృషిని మాత్రమే కాకుండా, నా దర్శకుల, నా తోటి నటీనటుల, సాంకేతిక నిపుణుల కృషిని కూడా నేటి ప్రేక్షకులకి తెలియజెప్పడం అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. ఇది గతించిన, మర్చిపోయిన కాలాన్ని తిరిగి గుర్తుకు తెస్తోంది. అందుకే భారతదేశ సినిమా వారసత్వాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. భారతీయ సినిమా ల్యాండ్‌మార్క్ సినిమాలని తిరిగి పెద్ద తెరపై జరుపుకునే అనేక పండుగలకు ఇది ప్రారంభం మాత్రమేనని నేను భావిస్తున్నాను'
మన స్టార్స్ కూడా ఇలా బర్త్ డే సినిమాలకి కృతజ్ఞతలు తెలుపుకుంటే బావుంటుందేమో ఆలోచించాలి.