Telugu Global
Cinema & Entertainment

ప్రకాశ్‌రాజ్‌ ట్వీట్‌.. స్పందించిన పవన్‌

రాజకీయంగా మాకు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఒకరి పట్ల ఒకరికి ఎంతో గౌరవం ఉన్నదన్న ఏపీ డిప్యూటీ సీఎం

ప్రకాశ్‌రాజ్‌ ట్వీట్‌.. స్పందించిన పవన్‌
X

తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో సినీ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ ట్వీట్స్‌ పరంపర కొనసాగుతున్న విషయం విదితమే. దీనిని ఉద్దేశించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఓ ఇంటర్వ్యూలో కామెంట్ చేశారు. ప్రకాశ్‌రాజ్‌ అంటే నాకు ఇష్టం. నాకు మంచి మిత్రుడు. రాజకీయంగా మాకు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఒకరి పట్ల ఒకరికి ఎంతో గౌరవం ఉన్నది. ఆయనతో ఒక సినిమా కోసం వర్క్‌ చేస్తున్నా. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దోషులకు శిక్షపడాలని నేను ట్విట్‌ పెట్టినప్పుడు (ఢిల్లీలో మీ స్నేహితులంటూ) ఆయన ఆ విధంగా కామెంట్‌ చేయాల్సిన అవసరం లేదు. ఆయన పోస్ట్‌ నేను తప్పుగా అర్థం చేసుకోలేదు. ఆయన ఉద్దేశం నాకు అర్థమైందని పవన్‌ తెలిపారు.

జస్ట్‌ ఆస్కింగ్‌.. మనకేం కావాలి?

ఎక్స్‌ వేదికగా ప్రకాశ్‌ రాజ్‌ పోస్టుల పరంపరం కొనసాగుతూనే ఉన్నది. తాజాగా ఆయన మరో పోస్ట్‌ పెట్టారు. 'మనకేం కావాలి.. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించడమా? లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలనా సంబంధమైన అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా? జస్ట్‌ ఆస్కింగ్‌.. మనకేం కావాలి?' అంటూ ట్విటర్‌లో రాసుకొచ్చారు.

తిరుమల లడ్డూ మహా ప్రసాదం కల్తీపై ఎక్స్‌ వేదికగా ప్రకాశ్‌రాజ్‌ చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారిన విషయం విదితమే. దీనిపై ప్రాయశ్చిత దీక్షలో భాగంగా పవన్‌ కల్యాణ్‌ ప్రకాశ్‌రాజ్‌ పోస్టులపై మండిపడ్డారు. దీంతో అప్పటి నుంచి ఇద్దరి మధ్య ట్విట్‌, మాటల యుద్ధం కొనసాగుతున్నది. సున్నిత అంశాలపై ప్రకాశ్‌ రాజ్‌ తెలుసుకుని మాట్లాడాలని.. విమర్శలు చేసే ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలని, సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని పవన్‌ హెచ్చరించారు. దీనిపై స్పందించిన ప్రకాశ్‌రాజ్‌ ఈ నెల 30 తర్వాత ఇండియాకు వచ్చి మీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతాను. ఈలోగా మీకు వీలుంటే నా ట్వీట్‌ను మళ్లీ చదవండి. అర్థం చేసుకోండి' అని పేర్కొన్నారు.

అంతటితో ఆగకుండా 'చేయని తప్పునకు సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! జస్ట్‌ ఆస్కింగ్‌, అని మొన్న పోస్ట్‌ చేయగా.. నిన్న 'గెలిచే ముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఎందుకీ మనకీ అయోమనం...ఏది నిజం # జస్ట్‌ ఆస్కింగ్‌!' అని తెలుగులో మరో పోస్ట్‌ పెట్టారు. దీనిపై స్పందించిన పవన్‌ కల్యాణ్‌ తాజాగా పై విధంగా వ్యాఖ్యలు చేశారు.

First Published:  27 Sept 2024 10:18 AM IST
Next Story