HariHara Veeramallu | పవన్ సినిమా టీజర్ రెడీ
HariHara Veeramallu - చాన్నాళ్లుగా పవన్ చేస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమా నుంచి టీజర్ రెడీ అయింది.

పవన్ కల్యాణ్, క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమా నుంచి బిగ్ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా టీజర్ ను రేపు ఉదయం 9 గంటలకు విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు 'ధర్మం కోసం యుద్ధం' అంటూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. 17వ శతాబ్దం నాటి చారిత్రక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్, వజ్రాలు దొంగిలించే బందిపోటుగా కనిపించనున్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
దాదాపు నాలుగేళ్ల నుంచి షూటింగ్ జరుపుకుంటోంది హరిహర వీరమల్లు సినిమా. ఎప్పటికప్పుడు ఈ సినిమా షూటింగ్స్ లేట్ అవుతూ వస్తున్నాయి. ఈ మూవీని పక్కనపెట్టి, ఇతర సినిమాలకు పవన్ కాల్షీట్లు ఇవ్వడంతో సమస్య వచ్చింది.
దీంతో ఈ సినిమాలో విలన్ గా నటించాల్సిన అర్జున్ రాంపాల్, ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో బాబీ డియోల్ ను తీసుకున్నారు. ఇక దర్శకుడు క్రిష్ కూడా సినిమాను కొన్నాళ్లుగా పక్కనపెట్టాడు. అతడు, అనుష్కతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. అటు సంగీత దర్శకుడు కీరవాణి కూడా ఇతర ప్రాజెక్టులతో బిజీ అయ్యాడు.
ఇలాంటి టైమ్ లో సినిమాను లైమ్ లైట్లోకి తీసుకొచ్చేందుకు టీజర్ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించాడు నిర్మాత ఏఎం రత్నం. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత హరిహర వీరమల్లు సినిమాకు పవన్ కాల్షీట్లు ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే అంతకంటే ముందు అతడు ఓజీ సినిమాను పూర్తిచేస్తాడు.