మా ఆశలు నిజమయ్యాయి.. మాటలు రావడం లేదు
'లాపతా లేడీస్' మూవీలో ప్రధాన పాత్రలో నటించిన ప్రతిభారత్న
కిరణ్‌రావు డైరెక్షన్‌లో వచ్చిన 'లాపతా లేడీస్' 2025 ఆస్కార్‌కు మన దేశం నుంచి అధికారికంగా ఎంపికైన విషయం విదితమే. దీనిపై ఈ మూవీలో ప్రధాన పాత్రలో నటించిన ప్రతిభారత్న ఆనందం వ్యక్తం చేశారు. ఇందులో ఆమె పుష్పా రాణిగా మెప్పించారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
'ఎంతో ఆనందంగా ఉన్నది. మాటలు రావడం లేదు. మేము ఈ సినిమా ఆస్కార్‌కు మన దేశం నుంచి ఎంపిక కావాలని ఎంతో కోరుకున్నాం. మా ఆశలు నిజమయ్యాయి. కిరణ్‌రావు, అమీర్‌ఖాన్‌లను ఎప్పుడెప్పుడు కలుస్తానా అని ఎదురుచూస్తున్నాను. మా కష్టానికి దక్కిన ఫలితం ఇది. ఒక లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేస్తూ పోతుంటే ఫలితాలు వాటంతట అవే వస్తాయి. ప్రస్తుతం నా విషయంలో ఇదే జరుగుతున్నది. నేను ఊహించిన దానికంటే రెట్టింపు ఆనందాన్ని చూడగలుగుతున్నాను' అని ప్రతిభ చెప్పారు.
ఎవరీ ప్రతిభా రత్న ?
24 ఏళ్ల ప్రతిభా రత్న హిమాచల్ ప్రదేశ్‌లోని టిక్కర్ ప్రాంతానికి చెందినది. ఆమె తన చదువుల కోసం సిమ్లాకు వెళ్లి జీసస్ అండ్ మేరీ కాన్వెంట్‌లో చేరింది. ముంబైలోని ఉషా ప్రవీణ్ గాంధీ కాలేజ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి ఫిల్మ్ మేకింగ్‌లో పట్టభద్రురాలైంది. రత్నా మొదట టీవీ షో ఖుర్బాన్ హువా (2020-2021)లో తన నటనను ప్రారంభించింది, అయితే లాపతా లేడీస్, సంజయ్ లీలా బన్సాలీ డైరెక్షన్‌లో హీరామండి ద్వారా విస్తృతమైన గుర్తింపు పొందింది.
ఎంతగానో శ్రమించిన టీమ్, వారి హార్డ్‌వర్క్‌కు దక్కిన గుర్తింపు ఇది:కిరణ్‌రావు
ఈ సినిమా ఆస్కార్‌కు ఎంపిక కావడంపై దర్శకురాలు కిరణ్‌రావు కూడా ఆనందం వ్యక్తం చేశారు. అద్భుతమైన కథకు ప్రాణం పోయడంలో ఎంతగానో శ్రమించిన టీమ్, వారి హార్డ్‌వర్క్‌కు దక్కిన గుర్తింపు ఇది. సరిహద్దులు దాటి.. మనుషులను చేరువ చేయడంలో సినిమా అనేది ఒక కీలక మాధ్యమంగా మారింది. భారత్‌లో ప్రేక్షకులు ఏ విధంగా మా మూవీని ఆదరించారో.. ప్రపంచవ్యాప్తంగానూ అదేవిధంగా అభిమానిస్తారని ఆశిస్తున్నా' అని తెలిపారు.