Telugu Global
Cinema & Entertainment

ఓటీటీ వాచ్ లిస్ట్ -శ్రీరామ నవమి స్పెషల్!

ఈరోజు శ్రీరామ నవమి పర్వదినాన రామాయణం గురించిన సినిమాలని వివిధ ఓటీటీలు భక్తులకి అందిస్తున్నాయి.

ఓటీటీ వాచ్ లిస్ట్ -శ్రీరామ నవమి స్పెషల్!
X

ఈరోజు శ్రీరామ నవమి పర్వదినాన రామాయణం గురించిన సినిమాలని వివిధ ఓటీటీలు భక్తులకి అందిస్తున్నాయి. గత జనవరిలో అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం రామనవమి పట్ల దేశవ్యాప్తంగా ఎక్కువ భక్తి ప్రపత్తుల్ని ప్రేరేపిస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఓటీటీలు రాముడికి సంబంధించిన ఎన్నో సినిమాలని స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ముఖ్యంగా తెలుగులో ‘భూకైలాస్’ నుంచీ ‘శ్రీరామ రాజ్యం’ వరకూ అర డజనుకి పైగా సినిమాలు ప్రేక్షకుల భక్తి దాహం తీర్చేందుకు విచ్చేశాయి. ఇవి ఏఏ ఓటీటీల్లో చూడవచ్చో ఓ లుక్కేద్దాం...

1. లవకుశ - ప్రైమ్ వీడియో, సన్ నెక్స్ట్

జనరంజక పాటలతో ఎక్కువ ప్రాచుర్యం పొందిన రామాయణ గాథ ఇది. ఎన్టీఆర్ - అంజలీ దేవి నటించారు. సి. పుల్లయ్య- సీఎస్ రావు దర్శకత్వం వహించారు. 1963 లో సూపర్ హిట్టయిన ఈ సినిమా ఇప్పటికీ చూసే ప్రేక్షకులున్నారు. ఇందులో ఘంటసాల 7 ఎవర్ గ్రీన్ పాటలకి సంగీత దర్శకత్వం వహించారు.


2. శ్రీరామదాసు - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

సంగీత విద్వాంసుడు కంచర్ల గోపన్న జీవితం ఆధారంగా 1964 లో వి. నాగయ్య నటించిన ‘రామదాసు’ కి అనుసరణగా 2006 లో ‘శ్రీరామ దాసు’ విడుదలైంది. ఇందులో కంచర్ల గోపన్నగా/ రామదాసుగా అక్కినేని నాగార్జున నటిస్తే, కబీర్ దాసుగా అక్కినేని నాగేశ్వరరావు నటించారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఇందులో కీరవాణి సంగీతంలో అన్నీ సూపర్ హిట్ పాటలే.

3. శ్రీరామ రాజ్యం – ప్రైమ్ వీడియో, జీ 5

నందమూరి బాలకృష్ణ శ్రీరాముడిగా నటించిన ఈ సినిమాకి బాపు దర్శకత్వం వహించారు. 2011 లో విడుదలైన ఈ సినిమాలో సీతగా నయనతార నటించింది. ఇళయరాజా సమకూర్చిన ఈ సినిమాలోని పాటలు, వాటి చిత్రీకరణ పేరు తెచ్చుకున్నాయి. ఇది ‘లవకుశ’ కి ఆధునిక రూపమనవచ్చు.


4. సంపూర్ణ రామాయణం - యూట్యూబ్, ఈటీవీ విన్

వాల్మీకి రామాయణం ఆధారంగా 1972 లో బాపు దర్శకత్వం వహించిన ‘సంపూర్ణ రామాయణం’ అప్పట్లో ఘన విజయం సాధించింది. ఇందులో శోభన్ బాబు రాముడిగా, చంద్రకళ సీతగా నటించారు. కేవీ మహదేవన్ అందించిన సూపర్ హిట్ పాటలు ఇందులో వున్నాయి.

5. బాల రామాయణం – యూట్యూబ్

1997 లో జూనియర్ ఎన్టీఆర్ రాముడి పాత్రలో నటించిన ‘బాల రామాయణం’ ని కేవలం పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఈ సినిమాలో 3 వేల మంది బాల నటులు నటించారు. గుణశేఖర్ దర్శకత్వం వహించిన దీన్ని ఎంఎస్ రెడ్డి నిర్మించారు.

ఇవిగాక ‘సీతారామ కళ్యాణం’, ‘భూకైలాస్’, ‘శ్రీ రామాంజనేయ యుద్ధం’, ‘శ్రీరామ పట్టాభిషేకం’ లాంటి ఎన్నో రామాయణం సినిమాలు యూ ట్యూబ్ లో అందుబాటులో వున్నాయి. వీటిని కూడా చూస్తూ ఈ పండుగ రోజు గడప వచ్చు.




First Published:  17 April 2024 3:18 PM IST
Next Story