మార్కెటింగ్ జోరు పెంచిన స్ట్రీమింగ్ దిగ్గజాలు
ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజాలు వ్యూస్ పెంచుకోవడం కోసం పంథా మార్చి అడుగులేస్తున్నాయి.
ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజాలు వ్యూస్ పెంచుకోవడం కోసం పంథా మార్చి అడుగులేస్తున్నాయి. థియేట్రికల్ విజయాల కారణంగా సినిమాల చుట్టూ అప్పటికే ప్రబలంగా వున్న సందడిని సద్వినియోగం చేసుకోవడానికి, సినిమా చూడని మిగిలిన ప్రేక్షక వర్గాన్ని ఆకర్షించే వ్యూహంతో మార్కెటింగ్ జోరు పెంచుతున్నాయి. థియేట్రికల్ విడుదల తర్వాత సినిమాల కొనుగోలుపై ఎక్కువగా ఆధారపడే స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, ప్రత్యేకించి బాక్సాఫీసుల్లో కనక వర్షాన్ని కురిపిస్తున్న సినిమాల విషయంలో, మార్కెటింగ్ జోరు పెంచి గేమ్ ఆడుకుంటున్నాయి. లీడ్ స్టార్స్ ని పొందడం దగ్గర్నుంచి, ప్రత్యేక రౌండ్ మీడియా ఇంటరాక్షన్‌లు చేయడం, లేదా ఇన్‌ఫ్లుయెన్సర్‌లతో ప్రోమోలు షూట్ చేయడం వరకూ, ఇంకా సెలబ్రిటీలని ఆకర్షించడం వరకూ, వారు భాగం పంచుకోని సినిమాల స్ట్రీమింగ్‌ని వారి సోషల్ మీడియాలోనే ప్రకటించడం వరకూ చేస్తూ, అప్పటికే సినిమాల చుట్టూ వున్న సందడిని క్యాష్ చేసుకోవాలనే ఆలోచనకి శ్రీకారం చుడుతున్నాయి. ఎటొచ్చీసినిమా చూడని మిగిలిన ప్రేక్షక సమూహాల్ని స్ట్రీమింగ్ వైపు మళ్ళించడమే లక్ష్యంగా పని చేస్తున్నాయి.
ఫలితంగా ఓటీటీ విడుదల కోసం థియేట్రికల్ హిట్స్ ని ప్రచారం చేయడంపై దృష్టి బాగా పెరిగింది. వార్తాపత్రికల, హోర్డింగుల ప్రకటనలపై పెట్టుబడి పెట్టడం, ప్రత్యేకంగా స్టార్ ఇంటర్వ్యూలని నిర్వహించడం, డిజిటల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ల చేత సినిమా గురించి మాట్లాడించడం, ఇంకా పోటీలూ ఫ్రీబీలూ నిర్వహించడం, అభిమానులతో సమావేశాలు నిర్వహించడం వంటి సవాలక్ష ప్రచార కార్యమాల జోరు పెరిగిపోయింది.
ఈ కసరత్తుకి నిర్దిష్ట బడ్జెట్ కేటాయిస్తున్నారు. ఈ బడ్జెట్ థియేటర్‌లలో విడుదలైన సినిమా స్థాయిని బట్టి మారవచ్చు. ముఖ్యంగా హిందీ సినిమాల విషయంలో, నిర్మాతలు థియేటర్లలో ఎనిమిది వారాలు పూర్తి కాకముందే ఓటీటీల్లో విడుదల చేయలేరు. దీని వల్ల విడుదలైన సినిమాల చుట్టూ వుండే సందడి స్ట్రీమింగ్ నాటికి తగ్గిపోవచ్చు. ఇందుకే తాజా ప్రమోషన్లు అవసర పడుతున్నాయి.
మార్కెటింగ్ ప్రచారం కూడా ఎక్కువ కాలం వుండకపోవచ్చు. మీడియా కన్సల్టింగ్ సంస్థ ఓర్మాక్స్ ప్రకారం, బాక్సాఫీసుల్లో అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమాలని సాధారణంగా విడుదలైన వారం నుంచి, లేదా విడుదలకి ఒక వారం ముందు ఓటీటీలు ప్రకటించుకుంటే ఎక్కువ ప్రయోజనకరంగా వుంటుంది. అయితే హిందీలో యానిమల్, టైగర్ 3, ఆర్టికల్ 370, సామ్ బహదూర్ వంటి సినిమాలు వాటి ఓటీటీ విడుదలకి కేవలం వారం ముందు ప్రమోషన్లు ప్రారంభించారు. ఈ సినిమాలకి ముందే మంచి పేరు రావడంతో, వాటిని మార్కెటింగ్ చేయడం అనేది కేవలం కొత్త సబ్‌స్క్రైబర్‌లని పొందడమే కాకుండా, అప్పటికే వున్న సబ్‌స్క్రైబర్‌లను నిలబెట్టుకోవడం కోసం, ప్లాట్‌ఫారమ్ బ్రాండ్ ఈక్విటీని కాపాడుకోవడం కోసం ప్రమోషన్లు లేటయినా తేడా రాలేదు.
మునుపటి శాటిలైట్ ఛానెల్‌లు ప్రింట్ యాడ్స్ నుంచి, ఆన్-ఎయిర్ ప్రోమోల వరకు కొత్త సినిమాల ప్రపంచ టీవీ ప్రీమియర్‌లను ప్రకటించే విధానం నుంచి ఈ ట్రెండ్ వచ్చింది. సాంప్రదాయ మార్గాలు అయితే ఇక్కడ పని చేయవు కాబట్టి, సినిమా మీ ఇంటి ముంగిట కొస్తుందని ప్రేక్షకులకి తెలియజేయడానికి సోషల్ మీడియా ఒక్కటే మార్గమని ఓటీటీ వర్గాలు అంటున్నాయి.
వాస్తవానికి, సినిమా విజయాన్ని ఓటీటీలో దాని పనితీరుని బట్టి కూడా అంచనా వేయవచ్చు. ఉదాహరణకి, ‘లాపతా లేడీస్’ హిందీ మూవీని తీసుకుంటే, నెట్‌ఫ్లిక్స్ లో దాని విడుదలని ప్రీ. పోస్ట్-రిలీజ్ ప్లాన్ ద్వారా ప్రచారం చేశారు. ఇది బాగా పని చేసింది. పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఓటీటీలో థియేటర్ కంటెంట్‌ని పొందడం అనేది కోవిడ్ కాలంలో పెరిగిన ట్రెండ్. అయితే తర్వాత థియేట్రికల్ విడుదల తర్వాతే స్ట్రీమింగ్ అనే పద్ధతి ప్రారంభమయింది. దీంతో ఓటీటీల మార్కెటింగ్ వ్యూహాలు మారాయి. విడుదలల కోసం కంటెంట్‌ని మార్కెటింగ్ చేసే అగత్యం ఇక్కడి నుంచే ప్రారంభమయింది.
ఏది ఏమైనప్పటికీ, థియేటర్లలో సినిమా విడుదల - ఓటీటీలో దాని లభ్యత మధ్య గ్యాప్ ఇచ్చినందున, ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగించడానికి బలమైన ప్రచారం తప్పనిసరవుతోంది.