Telugu Global
Cinema & Entertainment

థియేటర్లు కాదు ఓటీటీ సేఫ్ బెట్ ?

సినిమా నిర్మాతలకి ఏది ఎక్కువ లాభదాయకం- థియేట్రికల్ రిలీజులా, లేక ఓటీటీ విడుదలలా? గత రెండు సంవత్సరాల్లో సినిమా కంటెంట్ చాలా తక్కువగా వుండి, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో వీక్షకుల సంఖ్య అత్యధికంగా పెరుగుతున్న పరిస్థితుల్లో, ఈ డిమాండ్ ని తట్టుకోవడానికి ఓటీటీలు కంటెంట్ కోసం వేటలో పడ్డాయి.

థియేటర్లు కాదు ఓటీటీ సేఫ్ బెట్ ?
X

సినిమా నిర్మాతలకి ఏది ఎక్కువ లాభదాయకం- థియేట్రికల్ రిలీజులా, లేక ఓటీటీ విడుదలలా? గత రెండు సంవత్సరాల్లో సినిమా కంటెంట్ చాలా తక్కువగా వుండి, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో వీక్షకుల సంఖ్య అత్యధికంగా పెరుగుతున్న పరిస్థితుల్లో, ఈ డిమాండ్ ని తట్టుకోవడానికి ఓటీటీలు కంటెంట్ కోసం వేటలో పడ్డాయి.

డైరెక్ట్-టు-డిజిటల్ మూవీ రిలీజ్‌లు కరోనావైరస్ మహమ్మారి ఫలితం. ఇది నిర్మాతలు తమ కంటెంట్‌తో డబ్బు ఆర్జించడానికి థియేటర్‌లలో విడుదలలకి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఇచ్చింది. ఇప్పటికీ చాలా సినిమాలు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో నేరుగా విడుదలవుతున్నందున, ఓవర్-ది-టాప్ (ఓటీటీ ) ప్లాట్‌ఫారమ్‌లో విడుదల చేయడం కంటే థియేటర్‌లలో విడుదల చేయడం ఎక్కువ లాభదాయకంగా వుందా అనే ప్రశ్న మదలైంది. కొంతమంది నిర్మాతలు ఓటీటీలతో లాభాలు పరిమితమని చెప్తూన్తే, మరికొందరు చిన్న సినిమాలకు సేఫ్ బెట్ అంటున్నారు.

గత రెండు సంవత్సరాల్లో ఓటీటీలు నిర్మాతలకు 80 నుంచి 100 శాతం ప్రీమియమ్స్ ని చెల్లించాయి. అంటే నిర్మాణ వ్యయం కంటే 80 నుంచి 100 శాతం ఎక్కువ చెల్లించాయి. థియేటర్లు పునఃప్రారంభం కావడం, కంటెంట్ సరఫరా ప్రీ-కోవిడ్ స్థాయికి వెళ్ళడంతో, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రీమియంని 30 నుంచి 40 శాతానికి తగ్గించినట్టు ఓటీటీ కంపెనీలే చెప్తున్నాయి.

మరోవైపు పెద్ద తెరపై స్టార్ పవర్ తగ్గిపోయింది. హిందీలో అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా', అక్షయ్ కుమార్ నటించిన 'రక్షా బంధన్' సహా చాలా సినిమాలు పరాజయాల పాలయ్యాయి. ఇటు తెలుగులో కూడా కొన్ని పెద్ద బ్యానర్లకు తప్ప, మెజారిటీ నిర్మాతలకు విడుదల చేయడానికి ఛాయిస్ లేదు. థియేటర్లలో విడుదల చేయడం వలన రూ. 5-6 కోట్ల రేంజిలో ప్రమోషన్స్, యాడ్స్ అనే అదనపు ఖర్చు వుంటుంది. చిన్న, మధ్య తరహా బడ్జెట్ సినిమాలకి ఇది గిట్టుబాటు కావడం లేదు. అందుకని సొంతంగా థియేటర్లలో విడుదల చేసే పరిస్థితి లేదు. అందుకే చాలా చిన్న మధ్య, తరహా సినిమాల నిర్మాతలు థియేటర్లని తిరిగి తెరిచినప్పటికీ నేరుగా ఓటీటీకే వెళ్తున్నారు. థియేటర్స్ లో విడుదల చేయాలంటే ఇంకో సమస్య కూడా వుంది. తగిన సంఖ్యలో థియేటర్లు లభించడం, విడుదల తేదీలూ తమ అదుపులో లేకపోయడం వల్ల నష్ట పోవడమే జరుగుతోంది.

అందువల్ల చిన్న, మధ్య తరహా సినిమాలు ఓటీటీకి వెళ్ళడమే సముచితమని భావిస్తున్నారు. కానీ ఓటీటీలు వీటిని డీల్ చేయడానికి ముందూ వెనుకా ఆలోచిస్తున్నాయి. థియేటర్లలో విడుదల చేసిన తర్వాతే కొనుగోలు చేయాలనుకుంటున్నారు. డైరెక్ట్-టు- ఓటీటీ విడుదలలు గణనీయమైన లాభార్జన చేయవనే ఇంకో అభిప్రాయముంది. సినిమా నిర్మించిన తర్వాత ఓటీటీ కి వెళితే, నిర్మాణ వ్యయాన్ని తిరిగి పొందగలిగితే అదో పెద్ద విజయమే. ప్రీ-అప్రూవ్డ్ ప్రాజెక్టుల విషయంలో, మార్జిన్ సాధారణంగా ఓ రేంజిలో వుంటుంది. నిర్మాణ వ్యయంపై 8-10 శాతం మేరకు పొందవచ్చు. శాటిలైట్ హక్కుల్ని ఓటీటీ తో ప్యాక్ చేస్తే మార్జిన్ ఇంకా పెరుగుతుంది. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో నేరుగా విడుదల చేసే నిర్మాతలు ఎక్కువగా వన్-టైమ్ వేల్యూని పొందుతారు. థియేట్రికల్ విడుదల విషయంలో, అపరిమిత ఆదాయాలతో బాటు నష్టాలూ వుంటాయి. ఒక మూవీ బాక్సాఫీసు హిట్టయితే, ఓటీటీ, శాటిలైట్ ప్లాట్‌ఫారమ్‌లలో దాని విలువ గణనీయంగా పెరుగుతుంది. విజయవంతమైన థియేట్రికల్ విడుదలతో లాభాలు నిర్మాణ వ్యయం కంటే 5 రెట్లు పెరుగుతాయని విశ్లేషకుల మాట.

వీటన్నిటి దృష్ట్యా చిన్న, మధ్య తరగతి సినిమాలకి ఏదో ఒక రూపంలో ఎంతో కొంత ఓటీటీలే బెస్ట్ అన్న నమ్మకం ఏర్పడుతోంది. సినిమాలు తీస్తే ఓటీటీలని దృష్టిలో పెట్టుకుని తీయాలి, లేకపోతే తీసి చేతులు కాల్చుకోనవసరం లేదన్న అభిప్రాయాని కొచ్చేస్తున్నారు.

First Published:  30 Nov 2022 1:12 PM IST
Next Story