ఈ వారం ఓటీటీలో 14 సినిమాలు, సిరీసులు, షోలు!
ఈ వారం తాజా ఓటీటీ విడుదలలు మీ కోసం. తమిళం, మలయాళం, హాలీవుడ్ సినిమాలు, హిందీ, ఇంగ్లీషు, కొరియన్ వెబ్ సిరీసులు, షోలు, బయోపిక్ లు కొలువుదీరాయి.
ఈ వారం తాజా ఓటీటీ విడుదలలు మీ కోసం. తమిళం, మలయాళం, హాలీవుడ్ సినిమాలు, హిందీ, ఇంగ్లీషు, కొరియన్ వెబ్ సిరీసులు, షోలు, బయోపిక్ లు కొలువుదీరాయి. పంకజ్ త్రిపాఠీ, అలీ ఫజల్, శ్వేతా త్రిపాఠీ, విజయ్ వర్మ తదితరులు నటించిన ‘మీర్జాపూర్ సీజన్ 3’ ఈ వారమే స్ట్రీమింగ్ అవుతోంది. హాలీవుడ్ పాత స్టార్ ఎడ్డీ మర్ఫీ నటించిన ‘బేవర్లీ హిల్స్ కాప్: ఆక్సెల్ ఎఫ్’ హాలీవుడ్ ఫ్రాంచైజీ మూవీ కూడా వచ్చేసింది. అలాగే ఇటీవల విడుదలైన హాలీవుడ్ యాక్షన్ మూవీ ‘ఫ్యూరియోసా : ఏ మ్యాడ్ మ్యాక్స్’ ఫ్రాంచైజీ కూడా వచ్చేసింది. తమిళం ‘గరుడన్’, మలయాళం ‘మలయాళీ ఫ్రమ్ ఇండియా’ కూడా ఈ వారం ఎంజాయ్ చేయవచ్చు. పూర్తి లిస్టు ఈ క్రింద...
1. స్ప్రింట్ (జూలై 2) - నెట్ ఫ్లిక్స్
ఫార్ములా వన్ : డ్రైవ్ టు సర్వైవ్ సృష్టికర్తల స్పోర్ట్స్ డాక్యుమెంటరీ సిరీస్ ఇది. ఇందులో ప్రపంచ ప్రఖ్యాత స్ప్రింటర్లయిన షాకారీ రిచర్డ్ సన్, నోహ్ లైల్స్, షెరికా జాక్సన్‌ల క్రీడా జీవితాల సన్నిహిత సంగ్రహావలోకనం వుంటుంది. 2023లో బుడాపెస్ట్ లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ల నుంచి, 2024 లో పారిస్ ఒలింపిక్ క్రీడల వరకూ గల అసాధారణ ప్రయాణాన్ని, అందులో ఎలీట్ పోటీదారులకు నిర్వచించే కఠిన శిక్షణా నియమాలని, వారి వ్యక్తిగత విజయాలని, కీర్తి ప్రతిష్టల్ని ఈ సిరీస్ కథనం చేస్తుంది.
2. గరుడన్ (జూన్ 3) - అమెజాన్ ప్రైమ్
ఈ తమిళ యాక్షన్ డ్రామాలో సూరి, ఉన్నిముకుందన్, ఇతరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఆలయ భూమిని స్వాధీనం చేసుకోవాలనే మంత్రి దురాశతో ఇద్దరు చిన్ననాటి స్నేహితులైన ఆది, కరుణ ఒకరిపై ఒకరు ప్రతీకారం తీర్చుకునే కథతో ఇది రూపొందింది.
3. బేవర్లీ హిల్స్ కాప్: ఆక్సెల్ ఎఫ్ (జూలై3) -నెట్ ఫ్లిక్స్
హాలీవుడ్ పాత స్టార్ ఎడ్డీ మర్ఫీ ఐకానిక్ డిటెక్టివ్ ఆక్సెల్ ఫోలీగా తిరిగి వచ్చాడు . ఈ హాలీవుడ్ మూవీలో ఒక బెదిరింపు కేసు చేపట్టిన డిటెక్టివ్ ఆక్సెల్ ఒక సహచరుడితో, ఇద్దరు పాత స్నేహితులతో కలిసి ఓ ప్రమాదకర కుట్రని ఛేదిస్తాడు. 1994 లో బేవర్లీ హిల్స్ కాప్ III విడుదలైన 30 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇది యాక్షన్-కామెడీ ఫ్రాంచైజీలో నాల్గవ భాగం.
4. బాబ్ మార్లే: వన్ లవ్ (జూలై 3) -అమెజాన్ ప్రైమ్
ఈ హాలీవుడ్ మూవీ బయోపిక్ డ్రామా. ఇందులో కింగ్స్లీ బెన్-ఆడిర్ లెజెండరీ పెర్ఫార్మర్‌గా 1976 నుంచి 1978 వరకు గల నట జీవితపు చిత్రణ చేస్తుంది.
5. ఇఫ్ (జూలై 3)-బుక్ మై షో
జాన్ క్రాసిన్స్కి దర్శకత్వం వహించిన హాలీవుడ్ మూవీ ‘ఇఫ్’ మంత్రముగ్ధుల్ని చేసే లైవ్-యాక్షన్ యానిమేటెడ్ ఫాంటసీ కామెడీ. ఇందులో కైలీ ఫ్లెమింగ్ ‘బీ’ అనే యువతి పాత్ర నటించింది. ఆమె ఊహాత్మక స్నేహితుల్ని చూసే ప్రత్యేక సామర్థ్యాన్ని కలిగి వుంటుంది. ఈ కొత్తగా కనుగొన్న సామర్థ్యంతో, మరచిపోయిన స్నేహితుల్ని వారి అసలు సహచరులతో తిరిగి కనెక్ట్ చేయడానికి ఓ విచిత్ర సాహసయాత్ర ప్రారంభిస్తుంది.
6. రెడ్ స్వాన్ (జూలై 3) - డిస్నీ+ హాట్‌స్టార్
ఇదొక చమత్కారం చేసే దక్షిణ కొరియా డ్రామా మూవీ. ఇది ఓహ్ వాన్-సూ అనే యువతి కథని హైలైట్ చేస్తుంది. ఈమె పేదరికం నుంచి ప్రపంచ స్థాయి గోల్ఫ్ క్రీడాకారిణిగా ఎదిగి, శక్తివంతమైన హ్వైన్ గ్రూప్ వారసుడు కిమ్ యోంగ్-గుక్‌ని వివాహం చేసుకుంటుంది. దీంతో విలాసవంతమైన ఫౌండేషన్ ఛైర్‌పర్సన్, గా నియమితురాలవుతుంది. ఐతే తన అంగరక్షకుడిగా సియో డో-యూన్ అనే వ్యక్తిని నియమించుకున్నప్పుడు, ఆమె జీవితం తలక్రిందులవడం మొదలవుతుంది.
7. ఫ్యూరియోసా: ఎ మ్యాడ్ మాక్స్ సాగా (జూలై 4) -బుక్ మై షో
ఇది ఐకానిక్ మ్యాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్ ఫ్రాంచైజీలో ఐదవది. మ్యాడ్ మాక్స్ ఫ్రాంచైజీ దర్శకుడు జార్జ్ మిల్లర్ దర్శకత్వం వహించిన ఈ హాలీవుడ్ మూవీ బలీయమైన ఎంపెరేటర్ ఫ్యూరియోసా కథ చెబుతుంది. ఆమె కరుడుగట్టిన వార్ లార్డ్ డిమెంటస్ చేతిలో బందీ అవుతుంది. ఎప్పుడైతే డిమెంటస్ కీ, నిరంకుశ ఇమ్మోర్టన్ జో కీ మధ్య క్రూరమైన అధికార పోరాటం మొదలవుతుందో -అప్పుడామె తన మనుగడ కోసం, స్వేచ్ఛ కోసం ప్రిటోరియన్ జాక్ తో ఒక చిన్న కూటమిని ఏర్పరచుకోవడం మినహా వేరే మార్గం కనపడదు.
8. స్పేస్ క్యాడెట్ (జూలై 4) -అమెజాన్ ప్రైమ్ వీడియో
ఎమ్మా రాబర్ట్స్ వ్యోమగామి కావాలని కలలుకంటున్న స్వేచ్ఛా-స్ఫూర్తి గల ఫ్లోరిడా పార్టీ అమ్మాయి. ఆమె కొన్ని విస్మయకర సంఘటనల తర్వాత- నాసాకి తప్పుడు రెజ్యూమ్‌ని సమర్పించి ఎలీట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో స్థానం సంపాదిస్తుంది. తనకి అధికారిక శాస్త్రీయ శిక్షణ లేనప్పటికీ సంకల్పబలంతో, సమయస్ఫూర్తితో ఆమె తోటి బృందంలో ప్రత్యేకంగా నిలుస్తుంది.ఆ ఆతర్వాత అంతరిక్షంలోకి ఆమె ప్రయాణ అనుభవాల్ని చూసి తీరాల్సిందే.
9. ఆర్థర్ ది కింగ్ (జూలై 5) -లయన్స్ గేట్ ప్లే
డొమినికన్ రిపబ్లిక్‌లో భయంకర అడ్వెంచర్ రేసింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ సమయంలో ఆర్థర్ అనే వీధికుక్కతో ఊహించని విధంగా గాఢమైన బంధాన్ని ఏర్పరుచుకున్న వృద్ధ అడ్వెంచర్ రేసర్ మైఖేల్ లైట్‌గా - మార్క్ వాల్‌బర్గ్ నటించిన ఔట్ డోర్ యాక్షన్ మూవీ ఇది. దీన్ని మైకేల్ లిండ్‌నార్డ్ గ్రంధం ‘ ఆర్థర్: ది డాగ్ హూ క్రాస్డ్ ది జంగిల్ టు ఫైండ్ ఏ హోమ్’ ఆధారంగా నిర్మించారు. ప్రమాదకర అడవి, పర్వతాలు, సముద్రాలూ ఈ అడ్వెంచర్ లో భాగంగా వుంటాయి.
10. డెస్పరేట్ లైస్ (జూలై 5) -నెట్ ఫ్లిక్స్
మోసం, విధేయత, కుటుంబ బంధాల సంక్లిష్టతలకి సంబంధించిన ఇతివృత్తాల్ని పరిశీలించే బ్రెజిలియన్ డ్రామా సిరీస్ ఇది. లియానా అనే యువతి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆమె కవలలతో గర్భవతి అని తెలుసుకున్న తర్వాత ఆమె జీవితం నాటకీయ మలుపు తిరుగుతుంది. ఒక అరుదైన దృష్టాంతంగా ఆమె గర్భంలో పెరుగుతున్న కవలలకి తండ్రులు వేర్వేరు. ఈ దిగ్భ్రాంతికర నిజాన్ని దాచిపెడుతూనే, టోమస్‌తో తన వైవాహిక జీవితాన్ని చెక్కుచెదరకుండా వుంచడానికి ఆమె పడే సంఘర్షణ అంతా కుటుంబాన్ని ముక్కలు చేసే దిశకే దారితీయిస్తుంది.
11. గోయో (జూలై 5) -నెట్ ఫ్లిక్స్
ఆటిస్టిక్ మ్యూజియంలో యువ గైడ్ అయిన గోయో విఫలమైన వివాహం కారణంగా సెక్యూరిటీ గార్డు ఏవాని కలుసుకోవడంతో అతడి జీవితం వూహించని మలుపు తిరుగుతుంది. గోయో, ఏవా మార్గాలు ఒకదానితో ఒకటి ముడిపడి వున్నందున కలిసి జీవన యానాన్ని ప్రారంభిస్తారు.
12. మీర్జాపూర్ సీజన్ 3 (జూలై 5) -అమెజాన్ ప్రైమ్
మిర్జాపూర్ సీజన్ 3 వీక్షకుల్ని తిరిగి నీలి నీడల భయంకర గాథలోకి తీసుకెళ్ళడానికి వచ్చేసింది... ఈసారి నేరాల నగరంలో క్రూర అధికార పోరాటాలు, ప్రతీకారాలు మరింత తీవ్రతరమవుతాయి. దివ్యేందు, అలీ ఫజల్, శ్వేతా త్రిపాఠీ, రసికా దుగల్, పంకజ్ త్రిపాఠీ, అంజుమ్ శర్మ తదితర నటులు ఈ కొత్త ఆధిపత్యంలోని ద్రోహపూరిత కుట్రల్లో భాగమవుతారు. నేరం - రాజకీయం చుట్టూ ఒక దుర్మార్గపు వాతావరణంలోకి ఈ తాజా ప్రత్యర్ధులు ప్రవేశించినప్పుడు, కొత్త పొత్తులు, ద్రోహాల ఎత్తులు పురులు విప్పుకుని వికార నృత్యాలు చేస్తాయి.
13. మలయాళీ ఫ్రమ్ ఇండియా ( జూన్ 5) - సోనీ లివ్
నళిన్ పౌలీ నటించిన మలయాళం కామెడీ మూవీ ఇది
14. ది సీడింగ్ (జూలై 5)
అతను నిర్జన ఎడారిలో తప్పిపోయి ఒక చోట ఆశ్రయం పొందినప్పుడు అలీనా అనే యువతిని కలుస్తాడు. ఆమె ఆ లోయలో ఒంటరిగా నివసించడం ఆసక్తి కలిగిస్తుంది. అయితే ఆమెని ఒక పిల్లల సమూహం బందీగా వుంచిందని తెలుసుకున్నప్పుడు, ఆ క్రూరులైన పిల్లలతో క్రూరమైన ఆట ప్రారంభిస్తాడు.