Telugu Global
Cinema & Entertainment

కంటెంట్ షేర్ చేసుకునే ఆలోచన వైపు ఓటీటీలు

ఓటీటీలు హక్కులు పొందిన కంటెంట్ ని తమతోనే వుంచుకోకుండా ఇతర ఓటీటీలతో పంచుకునే ఆలోచనకి శ్రీకారం చుడుతున్నాయి.

కంటెంట్ షేర్ చేసుకునే ఆలోచన వైపు ఓటీటీలు
X

ఓటీటీలు హక్కులు పొందిన కంటెంట్ ని తమతోనే వుంచుకోకుండా ఇతర ఓటీటీలతో పంచుకునే ఆలోచనకి శ్రీకారం చుడుతున్నాయి. ఒకవైపు ఫ్లాపయిన సినిమాల హక్కుల్ని ఇకపై కొనుగోలు చేయకూడదనే తాజా నిర్ణయంపై సమాలోచనలు చేస్తూనే, హక్కులు పొందిన కంటెంట్ ని ఇతర ఓటీటీలతో పంచుకోవడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని చూస్తున్నాయి. ఇప్పటికే హోయిచోయ్ ఓటీటీకి చెందిన షోలు జియోసినిమా కోసం హిందీలో డబ్ చేసి స్త్రీమింగ్ చేస్తున్నారు. అలాగే జీ5, ఆల్ట్ బాలాజీ కూడా కంటెంట్ కూటమిని ప్రకటించాయి. అన్ని ఓటీటీలకూ చెల్లింపు సబ్‌స్క్రిప్షన్‌లు పెరిగాయి కానీ ప్రకటనలు ఇంకా పుంజుకోకుండా వున్న నేపధ్యంలో పంపిణీ, రీచ్, సమయం, మానిటైజేషన్ కలిసి రావాలన్న ఉద్దేశంతో ఈ చర్య చేపడుతున్నట్టు ఓటీటీ రంగ నిపుణులు చెబుతున్నారు.

కొత్త కంటెంట్‌ని రూపొందించడానికి సమయం, పెట్టుబడి పడుతుంది. అయితే ప్రముఖ బెంగాలీ స్ట్రీమింగ్ సర్వీస్ హోయిచోయ్ కి సంబంధించి హిందీ డబ్బింగ్ వ్యాపారావకాశాలు విశేషంగా వున్నాయి. దీంతో జియో సినిమాతో సిండికేట్ గా ఏర్పడి బెంగాలీ కంటెంట్ హిందీ వెర్షన్ లని సరఫరా చేయడంపై దృష్టి పెట్టారు. ఇలా ఇతర ఓటీటీలతో ఒరిజినల్ కంటెంట్ ని షేర్ చేసుకోవడం ద్వారా ఒరిజినల్ ఐపీ (మేధో సంపత్తి) ప్రొవైడర్ తన కంటెంట్ ని ఎక్కువ మంది ప్రేక్షకులకి చేరేలా చూసుకోవడానికి సహాయపడుతుంది. మరాఠీ ఓటీటీ అల్ట్రా ఝాకాస్‌ కూడా ఇదే ప్రయత్నంలోనే వుంది.

దీని వల్ల ఒరిజినల్ కంటెంట్ ప్రొవైడర్ మరిన్ని కొత్త వ్యూస్ పొందడమే గాకుండా, కంటెంట్ బ్రాండ్ ఈక్విటీ మెరుగుపడుతుంది. ఇంకా ఒరిజినల్ కంటెంట్ విజయాన్ని కొలవడానికి, భవిష్యత్తు కోసం వ్యూహాల్ని ప్లాన్ చేయడానికీ ఇది సహాయపడుతుంది. జాతీయ, ప్రాంతీయ ఓటీటీ లన్నింటికీ సిండికేషన్ అనేది భవిష్యత్తు. ఎందుకంటే జాతీయ ఓటీటీలు స్థానిక ఓటీటీల నుంచి మంచి ప్రాంతీయ కంటెంట్‌ని పొందగలుగుతారు. ప్రయోజనాలు ఏమిటంటే బ్రాండ్ పరిధి పెరుగుతుంది, మరింత ఆదాయాన్ని పొందగల్గుతారు, ఇంతే కాకుండా తెలివైన మంచి కంటెంట్ తో నిర్దిష్ట ప్రేక్షకుల్ని సంతృప్తి పరచగల్గుతారు.

నిస్సందేహంగా పెద్ద ఓటీటీలు తమ కంటెంట్‌ని ప్రత్యేకంగా తమతోనే వుంచడానికి ప్రయత్నిస్తాయి. కానీ చిన్న ఓటీటీలు ఈ కొత్త మానిటైజేషన్ మార్గాల్ని చూడవలసి వుంటుందని నిపుణులు చెప్పే మాట. లేకపోతే జనాలకు చేరువ కావడం కష్టం. వినియోగదారులు వున్న ప్రతి యాప్‌నీ డౌన్‌లోడ్ చేయరు. ముఖ్యంగా కంటెంట్ పాతది అవుతున్నప్పుడు వినియోగదారుల్ని ఆకర్షించడానికి ప్రకటనలపై కోసం ఖర్చు చేయాల్సి వుంటుంది. ఇది భరించలేరు.

ఓటీటీల్లో అసలైన కంటెంట్‌కి ఎల్లప్పుడూ అద్భుతమైన విలువ వుంటుంది. ఇది చందాదారుల విధేయతని ప్రోత్సహిస్తుంది. దీర్ఘకాలంలో డబ్బు సంపాదించడానికి ఇది మంచి ఆట స్థలం. ఈ వ్యాపారంలో కంటెంట్ ని పంచుకోవడం అనేది డబ్బు ఆర్జన, మార్కెటింగ్, కంటెంట్ పంపిణీ మొదలైన వాటి గురించి ఆచరణాత్మకంగా వుండడం వల్ల వస్తుందని ఓటీటీ రంగ నిపుణులు వివరిస్తున్నారు.

First Published:  11 Jun 2024 1:32 PM GMT
Next Story