Telugu Global
Cinema & Entertainment

టాలీవుడ్ లో జియో- ఆహా వార్?

ఇప్పుడు జియో వూట్ అన్ని హంగులతో బహుళజాతి సంస్థలైన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ లనుంచి చందాదారుల్ని లాక్కునే భారీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.

టాలీవుడ్ లో జియో- ఆహా వార్?
X

టాలీవుడ్ లో జియో- ఆహా వార్?

పానిండియా ట్యాగ్ తో అంతర్జాతీయ దృష్టి నాకర్షిస్తున్న టాలీవుడ్ పై రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ కన్ను పడింది. భారీ యెత్తున తెలుగు సినిమాల్ని కొనుగోలు చేసేందుకు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే విశ్వక్ సేన్ నటించిన హార్రర్ థ్రిల్లర్ ‘బూ’ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కి రంగం చేసేశారు. టీజర్ కూడా విడుదల చేశారు. టాలీవుడ్ లోకి అంబానీ ప్రవేశ వార్త ఇతర ఓటీటీల్ని ఆత్మరక్షణలో పడేస్తోంది. ముఖ్యంగా అల్లు అరవింద్ అధ్వర్యంలో స్ట్రీమింగ్ అవుతున్న ‘ఆహా’ ఓటీటీ తట్టుకో లేదని కామెంట్స్ విన్పిస్తున్నాయి. ఇక జియో-ఆహా వార్ రక్తి కట్ట బోతోందని ఊహాగానాలు చేస్తున్నారు పరిశీలకులు.

దేశీయ ఓటీటీల పైనే కాదు, అంతర్జాతీయ ఓటీటీలైన నెట్ ఫ్లిక్స్, అమెజాన్ లపై కూడా పైచేయి సాధించేందుకు అంబానీ జియో ఓటీటీ వేలకోట్లతో మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. టెలికాం రంగంలో ఇతర కంపెనీల్ని ఎలాగైతే ప్రైస్ వార్ తో తొక్కేస్తూ జియో మొబైల్ అగ్రస్థాయికి చేరుకుందో, అదే మార్కెట్ వ్యూహంతో ఎవరూ వూహించని చాపకింద నీరులా జియో ఓటీటీ వచ్చేసి పోటీ సంస్థల్ని దెబ్బ కొట్టడం ఖాయంగా కన్పిస్తోంది.

ముఖేష్ అంబానీ తమ్ముడు అనిల్ అంబానీ లాగా కాదు. అన్నదమ్ములు ఆస్తులు పంచుకున్నాక అనిల్ వాటాగా వచ్చిన రిలయెన్స్ కమ్యూనికేషన్స్ ని విజయ పథంలో నడిపించలేకపోయాడు. అలాగే రిలయెన్స్ సినిమా ప్రారంబించి దాన్నీ మూత పెట్టిన విషయం తెలిసింది. అనిల్ అంబానీ వొక కార్పొరేట్ ఫెయిల్యూర్ గా ప్రూవ్ అయ్యాక, ముఖేష్ అంబానీ జియో మొబైల్ ప్రారంభించి టెలికాం రంగాన్ని గుప్పెట్లోకి తెచ్చుకున్నాడు. జియో మొబైల్ చందాదారులకి వ్యూహాత్మకంగా ఇన్నేళ్ళూ ఉచితంగా అందిస్తూ వచ్చిన జియో సినిమాని ఇప్పుడు జియో ఓటీటీగా మార్చి సొమ్ములు వసూలు చేసే పద్ధతికి దిగాడు. ముఖేష్ అంబానీ ఏం చేసినా చాలా దూరదృష్టితో చేస్తారని, అది తమకే అర్ధం కాదనీ కంపెనీ అధికారులే చెప్తారు. ఇవ్వాళ ఉచితంగా ఏదైనా ఇస్తున్నాడంటే రేపు దానికేదో వుంటుంది.

దీనికింకో ఉదాహరణ- ఇటీవల ఐపీఎల్ మ్యాచ్ ని జియో సినిమా ద్వారా ఫ్రీగా అందించాడు. 10-12 కోట్ల మంది ఫ్రీ చందాదారులు పోగవడంతో, ఆ చందాదారుల బేస్ కి ‘జియో పెయిడ్ ఓటీటీ’ అంటూ సంచలనాత్మక ప్రకటన చేశాడు. దీంతో ఇప్పుడు కొత్తగా జియో ఓటీటీ యాప్ ఉనికిలోకి వచ్చేసింది. దీని పూర్తి పేరు ‘జియో వూట్’. 2015 లో జియో మొబైల్ ని ప్రారంభించిన సమయంలోనే చందాదారుల కోసం ఉచితంగా జియో సినిమా యాప్ అందిస్తూ వచ్చారు. ఇప్పుడు దీన్ని ఉత్తరాదిన మంచి పాపులారిటీతో నడుస్తున్న వూట్ ఓటీటీని కొనుగోలు చేసి అనుసంధానం చేశారు. జియో వూట్ ని విస్తరించేందుకు ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ వయోకామ్ 18 స్టూడియోస్ ని కొనుగోలు చేశారు.

జియో విసురుతున్న సవాళ్ళు

ఇప్పుడు జియో వూట్ అన్ని హంగులతో బహుళజాతి సంస్థలైన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ లనుంచి చందాదారుల్ని లాక్కునే భారీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ముందుగా చవక సబ్ స్క్రిప్షన్స్ ని ప్రవేశపెడుతోంది. జియో వూట్ నెలవారీ సబ్‌స్క్రిప్షన్ కేవలం 99 రూపాయలతో ప్రారంభం కానుంది. దీంతోపాటు జియో బేస్, స్టాండర్డ్, ప్రీమియం ప్లాన్స్ కూడా చవకలో వుంటాయి.

జియో సినిమా ఉచితంగా ఇచ్చిన సమయంలోనే వివిధ భాషల్లో మంచి కంటెంట్ ని అందించింది. ఇప్పుడు పెయిడ్ ఓటీటీగా భారీ ఎత్తున సినిమాల్ని స్ట్రీమింగ్‌ చేసేందుకు ఒప్పందాలు జరుగుతున్నాయి. పాత సినిమాలతో పాటు కొత్త సినిమాల్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. అన్ని భాషల్లో సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్లాన్ చేసి కోట్ల రూపాయలు గుమ్మరించడానికి సిద్ధమవుతోంది. భారీ యెత్తున తెలుగు సినిమాల్ని సొంతం చేసుకోవడానికి టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. ఇందులో భాగంగానే ‘బూ’ విడుదల. విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్ సింగ్, నివేదా పేతురాజ్, మేఘా ఆకాశ్, మంజిమా మోహన్ లు నటించిన ‘బూ’ ఓ తమిళ దర్శకుడు విజయ్ తమిళ- తెలుగు భాషల్లో పూర్తి చేశాడు. అయితే అనివార్య కారణాల వల్ల థియేటర్లలో విడుదల కాలేదు. ఈ నెల 27 న జియో ఓటీటీలో విడుదలవుతోంది.

జియో రాకతో తెలుగు యాప్ ఆహా కి తీవ్ర పోటీ తప్పదు. ఆహాతో బాటు ఇతర ఓటీటీ లు భారీ పెట్టుబడులతో తమ లైబ్రరీలని పెంచుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో జియో సినిమా తెలుగు డివిజన్‌ ని ఏర్పాటు పెద్ద యెత్తున కొత్తా పాతా సినిమాల కొనుగోళ్ళతో బాటు, విరివిగా వెబ్ సిరీస్ ని కూడా నిర్మించేందుకు నిర్ణయించడం ఒక విధంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు ఇతర ఓటీటీలు కనిపించకుండా పోయే అవకాశముందని పరిశ్రమ వర్గాలు స్పందిస్తున్నాయి.

బ్రేకింగ్ న్యూస్

ఇక తాజాగా ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ఇచ్చింది జియో ఓటీటీ. రిలయన్స్ జియో 1499 రూపాయల వార్షిక ఫైబర్ ప్లాన్ తీసుకుంటే -నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ వంటి ప్రసిద్ధ ఓటీటీ లకి ఉచిత సభ్యత్వాన్ని అందిస్తుంది. ఈ ప్లాన్‌లో ఇంకా JioCinema, JioSaavn యాక్సెస్ కూడా వుంది.ఇది కాకుండా, Voot Select, Sony Liv, ZEE5, Voot Kids, Sun NXT, Hoichoi, Universal +, Lionsgate Play, Discovery +, Eros Now, ALTBalaji, ShemarooMe వంటి యాప్‌ లు కూడా ఉచితంగా పొందవచ్చని ప్రకటించింది. మామూలుగా ఒక నెట్ ఫ్లిక్స్ లేదా అమెజాన్ కి సబ్ స్క్రైబ్ చేస్తే వార్షిక ప్లాను వెయ్యి నుంచి 1500 వుంది. అన్ని యాప్స్ కలిపి ఒక బాస్కెట్ లో యేడాదికి రూ. 1500 కి అందించడమంటే ఇది ప్రైస్ వార్. జియో మొదలెట్టే ఇలాటి ప్రైస్ వార్ కే టెలికాం రంగంలో ఇతర ప్రొవైడర్లు కుదేలయ్యారు.



First Published:  24 May 2023 11:53 AM IST
Next Story