Telugu Global
Cinema & Entertainment

ఈవారం ఓటీటీ వాచ్ లిస్ట్ : మరికొన్ని తాజా చేరికలు!

ఏప్రిల్ 10- 12 మధ్య మరి కొన్ని సినిమాలు, సిరీసులు ప్రముఖ ఓటీటీల్లో ప్రసారానికి సిద్ధమైన తాజా లిస్టు ఇది.

ఈవారం ఓటీటీ వాచ్ లిస్ట్ : మరికొన్ని తాజా చేరికలు!
X

గత వారం వాచ్ లిస్ట్ కి అనుబంధంగా మరికొన్ని స్ట్రీమింగ్ ఐటెమ్స్ మీ ముందుకు.

ఏప్రిల్ 10- 12 మధ్య మరి కొన్ని సినిమాలు, సిరీసులు ప్రముఖ ఓటీటీల్లో ప్రసారానికి సిద్ధమైన తాజా లిస్టు ఇది. వివరాల్లోకి వెళ్తే ఆసక్తి కల్గించే కంటెంట్ గ్యారంటీ. ఇందులో ఒకే ఒక్క తెలుగు, మిగిలినవన్నీ ఫారిన్ ఎంటర్ టైన్మెంట్.

1. కాజల్ కార్తీక (ఆహా- ఏప్రిల్ 10)

కాజల్ అగర్వాల్, రెజీనా కసాండ్రా, జననీ అయ్యర్, ఆధవ్ కణ్ణ దాసన్ ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు హార్రర్ థ్రిల్లర్ ఇది. కొన్ని వింత కథలతో కూడిన పుస్తకాన్ని చదువుతున్నప్పుడు తన చుట్టూ అతీంద్రియ సంఘటననల్ని అనుభవించే యువతి చుట్టూ ఈ కథ సాగుతుంది. ఆమె పుస్తకాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నించినప్పుడు- పారానార్మల్ కార్యకలాపాలు ముందుకు సాగినప్పుడూ - ఈ కథ ఊహించని మలుపు తిరుగుతుంది.


2. ఆంత్రాసైట్ (నెట్ ఫ్లిక్స్- ఏప్రిల్ 10)

ఒక చిన్న పర్వత పట్టణం నడిబొడ్డున , ఒక విలేఖరి అదృశ్యానికి సంబంధించి దశాబ్దాల నాటి రహస్యాన్ని విప్పే ఫ్రెంచి థ్రిల్లర్ సిరీస్ ఇది. తండ్రి అదృశ్యం గురించి కుమార్తె కొనసాగించే అన్వేషణ, అకాల మరణపు దిగ్భ్రాంతి కలిగించే కారణాల్ని, మానవ మస్తిష్కపు చీకటి కోణాల్ని, సామాజికంగా కుళ్ళిన మానవ వ్యవస్థనూ రట్టు చేస్తుంది.

3. బ్లడ్ ఫ్రీ (డిస్నీ+ హాట్‌స్టార్‌- ఏప్రిల్ 10)

కార్పొరేట్ కుట్రని విప్పే ఫ్యూచరిస్టిక్ థ్రిల్లర్ ఇది. సుదూర భవిష్యత్తులో దక్షిణ కొరియాలో బీఎఫ్ అనే బయోటెక్ కార్పొరేషన్ మాంసపు ఉత్పత్తిని కృత్రిమంగా కల్చర్ చేసిన మాంసంతో ఏమార్చి ప్రపంచ మాంసం మార్కెట్ పై పట్టు బిగించడంతో, కంపెనీ సీఈఓ యున్ జా-యుపై అనుమానపు నీడలు కమ్ముకుంటాయి. ఇది ఉద్రిక్తతల్ని పెంచి అనిశ్చిత వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇప్పుడు వూ చే-వూన్ అనే మాజీ సైనికుడు ఆ కంపెనీలో బాడీగార్డుగా చేరి కుట్రని ఛేదించడం మొదలెడతాడు.

4. ఫ్లైట్ 601 హైజాకింగ్ ( నెట్ ఫ్లిక్స్ - ఏప్రిల్ 10)

నిజ కథ ఆధారంగా హైజాకింగ్ థ్రిల్లర్ ఇది. ఫ్లైట్ 601 విమానంలో ఇద్దరు సాహసోపేత ఫ్లైట్ అటెండెంట్లు సాయుధులైన హైజాకర్‌లని ఎదుర్కొనే హై -ఆక్టేన్ యాక్షన్ డ్రామా సిరీస్. కొలంబియన్ రాజకీయ అశాంతీ, గందరగోళపు నేపథ్యానికి వ్యతిరేకంగా సెట్ చేసిన ఈ ధారావాహిక, 1973 నాటి భయంకర ఉదంతాన్నితిరిగి కళ్ళ ముందుంచుతుంది. 50 మంది రాజకీయ ఖైదీలని విడుదల చేయాలనే డిమాండ్‌తో ఈ హైజాక్ జరిగింది.

5. క్రో ఫ్లైస్ సీజన్ 3 ( నెట్ ఫ్లిక్స్ - ఏప్రిల్ 11)

టర్కిష్ థ్రిల్లర్ సిరీస్ ‘యాజ్ ది క్రో ఫ్లైస్’ చివరి ఎపిసోడ్ ఇది. కార్పొరేట్ కుట్రల చుట్టూ సాగే కథ. జర్నలిజం ప్రపంచంలోని తీవ్ర సవాళ్ళని, నైతిక వివాదాలనూ ఎదుర్కోవడానికి అస్లీ ట్యూనా అనే జర్నలిస్టు తన ఆరాధ్య దైవం ప్రఖ్యాత సీనియర్ యాంకర్ లాలే కిరణ్ న్యూస్‌రూమ్‌లోకి ప్రవేశించి, నైపుణ్యంగా చక్రం తిప్పుతుంది.

6. బేబీ రైన్‌డీర్ ( నెట్ ఫ్లిక్స్- ఏప్రిల్ 11)

బేబీ రైన్‌డీర్ అనేది ఏడు భాగాల ఇంగ్లీష్ సిరీస్. ఒక హాస్య నటుడు తన వెంటపడుతున్న యువతితో విషమ పరిస్థితుల్లో చిక్కుకున్న కథ. నిజమైన సంఘటనలలో కూడిన ఈ డ్రామా, మానవ సంబంధాల చీకటి కోణాల్ని, చిక్కుల్నీ శోధిస్తుంది. రిచర్డ్ గాడ్ తన సొంత అనుభవాలకి దగ్గరగా ప్రతిబింబించే పాత్రలో నటించాడు. జెస్సికా గన్నింగ్ వెంటాడే స్టాకర్ పాత్రని పోషించింది.

7. హార్ట్ బ్రేక్ హై సీజన్ 2 ( నెట్ ఫ్లిక్స్- ఏప్రిల్ 11)

ఆస్ట్రేలియన్ లవ్ ట్రయాంగిల్ డ్రామా సిరీస్ ఇది. అమెరీ అనే యువతి ఈ త్రికోణీయ ప్రేమలోని సంక్లిష్టతల్ని నావిగేట్ చేస్తుంది. అయితే హార్పర్ - మలాకై ప్రేమికులిద్దరి మధ్య ఆశ్చర్యకరమైన బంధం వృద్ధి చెందుతుంది. ఈ బంధంలోకి రోమాన్ అనే పాత క్లాసిక్ సినిమాల పిచ్చిగల రోమియో ప్రవేశించి గందరగోళం సృష్టిస్తాడు. ఇదేదో తెలుగు సినిమాగా పనికొచ్చేలా వుంది. కాపీ కొడతారేమో!

8. హైటౌన్ సీజన్ 3 (లయన్స్ గేట్- ఏప్రిల్ 12)

‘హైటౌన్’ గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కి ఇది ఎలక్ట్రిఫయింగ్ ముగింపునిస్తుంది. జాకీ క్వినోన్స్ (మోనికా రేమండ్) చుట్టూ సాగే కథ. ఆమె హత్యోదంతంలో, మాదకద్రవ్యాల కారు చిట్టడవిలో చిక్కుకుని- ఈ కేసుల్ని ఛేదించడానికి తనని తాను అపాయంలోకి నెట్టేసుకునే యువతి డేరింగ్ స్టోరీ.

9. లవ్, డివైడెడ్ ( నెట్ ఫ్లిక్స్ - ఏప్రిల్ 12)

ఇది స్పానిష్ రోమాంటిక్ కామెడీ. ఈ మూవీ 2015లో విడుదలైన ఫ్రెంచ్ మూవీ ‘బ్లైండ్ డేట్‌కి’ పునఃరూపకల్పన. కొత్త అపార్ట్ మెంట్‌లో కొత్తగా మకాం మార్చిన పియానిస్ట్ వాలెంటీనాకీ, అనాగరికంగా ప్రవర్తించే ఆమె పొరుగు గేమ్ డెవలపర్ డేవిడ్ కీ మధ్య డెవలప్ అయ్యే మనోహరమైన ప్రేమ కథని ఆవిష్కరిస్తుంది.

10. నీల్ బ్రెన్నాన్: క్రేజీ గుడ్ (నెట్‌ఫ్లిక్స్- ఏప్రిల్ 8)

హాస్యనటుడు నీల్ బ్రెన్నాన్ మూడవసారి కొత్త స్టాండ్ అప్ స్పెషల్‌తో తిరిగి వచ్చాడు. ఈసారి మానసికారోగ్యం, సంబంధాలు, మిలియనీర్ మైండ్‌సెట్‌లు, క్రిప్టో కరెన్సీ మొదలైన అంశాలపై హాస్యోక్తులు విసిరాడు.

11. అన్‌లాక్డ్- ఏ జైల్ ఎక్స్ పెరిమెంట్ (నెట్‌ఫ్లిక్స్ ఏప్రిల్ 8)

ఆర్కాన్సాస్ సిటీ షెరీఫ్ చేసిన సామాజిక ప్రయోగం నేరాల్ని, జైలులో ఖైదీలనూ ఎలా తగ్గించిందో తెలిపే డాక్యూ సిరీస్ ఇది.

12. వాట్ జెన్నిఫర్ డిడ్ (నెట్‌ఫ్లిక్స్- ఏప్రిల్ 8)

చూడదగ్గ రియల్ క్రైమ్ డాక్యూ సిరీస్ ఇది. జెన్నిఫర్ పాన్ అనే యువతి చుట్టూ తిరిగే సంక్లిష్ట క్రైమ్ కేసు ఆధారంగా రూపొందించారు. తన ఇంటిమీద దాడి జరిగిందని పోలీసులకి ఫోన్ చేసిన జెన్నిఫర్, తీరా తానే ప్రధాన అనుమానితురాలిగా మారుతుంది. అమెరికా వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఈ కేసు పూర్వాపరాలని ఉత్కంఠ భరితంగా చిత్రీకరించారు.

First Published:  10 April 2024 6:16 PM IST
Next Story