నిజ దృశ్యం- సినిమా దృశ్యం ఒకటే!
1945 లో అమెరికా జరిపిన అణుపరీక్ష రియల్ ఫుటేజీ వైరల్ అవుతోంది. దీనికి కారణం క్రిస్టఫర్ నోలన్ తీసిన ‘ఒపెన్ హైమర్’ లో చూపించిన అణుపరీక్ష దృశ్యంతో అచ్చు గుద్దినట్టు పోలి వుండడం! సినిమా విడుదలైనప్పుడే అణుపరీక్ష దృశ్యం నిజ దృశ్యంలాగా ఫీలైనట్టు ప్రేక్షకుల నుంచి బైట్స్ వచ్చాయి.
1945 లో అమెరికా జరిపిన అణుపరీక్ష రియల్ ఫుటేజీ వైరల్ అవుతోంది. దీనికి కారణం క్రిస్టఫర్ నోలన్ తీసిన ‘ఒపెన్ హైమర్’ లో చూపించిన అణుపరీక్ష దృశ్యంతో అచ్చు గుద్దినట్టు పోలి వుండడం! సినిమా విడుదలైనప్పుడే అణుపరీక్ష దృశ్యం నిజ దృశ్యంలాగా ఫీలైనట్టు ప్రేక్షకుల నుంచి బైట్స్ వచ్చాయి. నిజ దృశ్య సృష్టికి దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ గ్రాఫిక్స్ వాడలేదని తర్వాత వెల్లడైంది. ఈ అణు పరీక్షకి ట్రినిటీ టెస్ట్ అని పేరు పెట్టింది అమెరికా. వైరల్ అవుతున్న రియల్ ట్రినిటీ టెస్ట్ ఫుటేజీ, నోలన్ చిత్రీకరించిన దానికి ఎంత దగ్గరగా వుందో చూపిస్తోంది!
ఆటం బాంబుని కనుగొన్న అణు భౌతిక శాస్త్రవేత్త రాబర్ట్ జె ఒపెన్ హైమర్ జీవిత చరిత్ర చిత్రించిన నోలన్, ఐ మాక్స్ మెగా స్క్రీన్ పై వాస్తవికానుభవాన్నిచ్చే దృశ్యాన్ని ఆవిష్కరించాడని అభిమానులు ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రినిటీ టెస్ట్ వాస్తవ ఫుటేజీ అని చెప్తున్న వీడియో ఒకటి ప్రత్యక్షమైంది. ఈ వీడియో ఒపెన్ హైమర్, అతడి బృందం చారిత్రాత్మక ఫ్రేలుడు పరీక్షకి సిద్ధమవుతున్నట్లు చూపిస్తోంది. ఫ్రేలుడు జరిగినప్పుడు, ఆ ప్రేలుడు సినిమాలో చూపించిన ప్రేలుడులాగే వుండడం విస్మయపరుస్తోంది.
వీడియో నేపథ్యంలో వ్యాఖ్యానం ఇలా చెబుతోంది, ‘ప్రేలుడు మెరుపు వెయ్యి సూర్యుల కంటే ప్రకాశవంతంగా వున్నట్లు లెక్క కట్టారు. 2 మైళ్ళ దూరంలో, పుట్టుకతో అంధురాలైన ఒక అమ్మాయి మెరుపుని చూసింది. అణుపరీక్షా స్థలంలోని సిబ్బంది ఎడారి సూర్యుడి వేడిని అనుభవించారు. అప్పుడు షాక్ వేవ్ వచ్చింది’
ఈ వైరల్ వీడియోకి విభిన్న కామెంట్స్ వచ్చాయి. ఒక యూజర్ ‘అంధురాలు ప్రేలుడు మెరుపుని ఎలా చూడగలదు? అది కూడా 2 మైళ్ళ దూరం నుంచి?’ అని సందేహం వ్యక్తం చేస్తే, ఇంకో యూజర్ ‘అక్కడ కెమెరా, ఫిలిం ఎలా తట్టుకున్నాయో?’ అని ప్రశ్నించాడు. మరింకో యూజర్ ‘ఇది సినిమా కంటే బెటర్ గా వుంది’ అన్నాడు. మరొక యూజర్ ‘భూమి ఎందుకు బ్యాలెన్స్ తప్పుతోందనే దానిలో ఎక్కువ భాగం నిరంతరం పరీక్షించే శక్తివంతమైన బాంబుల వల్లనే అని నా బలమైన నమ్మకం’ అంటూ చెప్పుకొచ్చాడు.
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జరిగిన కథగా ఒపెన్ హైమర్ బయోపిక్ వుంటుంది. ఫాదర్ ఆఫ్ ది అటామిక్ బాంబ్ అని పెరుబడ్డ భౌతిక శాస్త్రవేత్త జె రాబర్ట్ ఒపెన్ హైమర్, అణు బాంబుని పరీక్షించడం వాతావరణాన్ని మండించి ప్రపంచాన్ని నాశనం చేయడానికే అన్నట్టు అతను అర్థం చేసుకున్న విషయాన్ని ఈ బయోపిక్ చెప్తుంది. నటుడు సిలియన్ మర్ఫీ ఈ పాత్ర అద్వితీయంగా పోషించాడు. ఇంకో నటుడు మాట్ డామన్ మాన్హాటన్ ప్రాజెక్ట్ అధినేత జనరల్ లెస్లీ గ్రోవ్స్ పాత్ర పోషించాడు. ఎమిలీ బ్లంట్ ఒపెన్ హైమర్ భార్య కేథరీన్ ఒపెన్ హైమర్‌గా నటించింది. ‘ఒపెన్ హైమర్’ తో బాటు ‘బార్బీ’ కూడా విడుదలైంది. ఇవి రెండూ మన దేశంలో 100 కోట్లు వసూలు చేశాయి.
‘ఒపెన్ హైమర్’ అణు పరీక్ష సన్నివేశ చిత్రీకరణలో గ్రాఫిక్స్ వాడలేదు. ట్రినిటీ టెస్ట్ ని పునఃసృష్టించడానికి నిజమైన పేలుడు పదార్థాలనే ఉపయోగించారు. గ్యాసోలీన్, ప్రొఫెన్, అల్యూమినియం పౌడర్, మెగ్నీషియంలని వినియోగించారు. ప్రాక్టికల్ ఎఫెక్ట్ కోసం స్పెషల్ ఎఫెక్ట్స్ సూపర్‌వైజర్ స్కాట్ ఫిషర్ మినియేచర్స్ ని ఉపయోగించాడు. స్పెషల్ ఎఫెక్ట్స్ బృందం మోడల్స్ ని వీలైనంత పెద్దవిగా చేయడానికి ప్రయత్నించింది. మోడల్‌లు వాటి ఉద్దేశించిన సహజ పరిమాణానికి దగ్గరగా కనిపించేలా చేయడానికి, బృందం ఫోర్సుడు ఫర్స్ పెక్టివ్ అనే టెక్నిక్ నుపయోగించింది. లొకేషన్ నేటి ఆధునిక లాస్ అలమోస్ చాలా భిన్నంగా కనిపిస్తున్నందున, 1940ల తరహా పట్టణమంతా సెట్ వేశారు.
పరమాణువులు, అణువులు, శక్తి తరంగాల మధ్య పరస్పర చర్యల విజువలైజేషన్స్, అలాగే నక్షత్రాలు, కృష్ణ బిలాలు, సూపర్నోవాల విజువల్స్ ని కూడా ఆచరణాత్మక పద్ధతుల ద్వారా సాధించారు. మొత్తం కలిపి కృత్రిమత్వానికి దూరంగా ఒక నిజ అనుభవానికి ప్రేక్షకుల్ని అద్భుతంగా లోనుజేశారు!