Telugu Global
Cinema & Entertainment

సినిమా ఒకటే - సంగీత దర్శకులు ఎందరో!

ఒక సినిమాలకి నియమించుకుంటున్న సంగీత దర్శకుల సంఖ్య ఇద్దరితో మొదలై ఆరుగురు వరకూ పెరిగింది.

సినిమా ఒకటే - సంగీత దర్శకులు ఎందరో!
X

ఒక సినిమా- ఒక సంగీత దర్శకుడు చట్రం నుంచి బ్యాండ్ బాజా మోగించుకుంటూ బయట పడుతున్నాయి సినిమాలు. పాటలన్నీ సింగిల్ కార్డుతో ఒక సంగీత దర్శకుడే కొట్టడమేమిటి? పాటకొకరు కొట్టాలి, పాటకొకరికి కార్డు పడాలి. అప్పుడే సినిమాకి ఆకర్షణ పెరుగుతుంది. ఎక్కువ మంది కొత్త మ్యూజిక్ డైరెక్టర్లకి అవకాశాలూ దక్కుతాయి. ఇది గత కొన్నేళ్ళుగా కన్పిస్తున్న ట్రెండ్. ఒక సినిమా- ఒక సంగీత దర్శకుడు అనే విధానం నుంచి ఎక్కువమంది పెద్ద సినిమాల మేకర్లు వైదొలగుతున్నారు.

ఒక సినిమాలకి నియమించుకుంటున్న సంగీత దర్శకుల సంఖ్య ఇద్దరితో మొదలై ఆరుగురు వరకూ పెరిగింది. అయితే ఇదేమన్నా సంగీతపరంగా ఆ సినిమాకి అదనపు విలువ, లేదా ఆకర్షణ చేకూరుస్తోందా అంటే- పేరు తెలియని సంగీతదర్శకులతో అదేమీ లేదు. పేరున్న సంగీత దర్శకుల శ్రేణి కన్పిస్తే పాటలకే కాక సినిమాకీ క్రేజ్ రావచ్చు.

పూర్వమెప్పుడో 1997 లో వెంకటేష్ నటించిన ‘ప్రేమించుకుందాం రా’ కి మణిశర్మతో 3 పాటలు, మహేష్ మహదేవన్ తో 3 పాటలు చేయించుకున్నారు. చిరంజీవి నటించిన ‘ఇంద్ర’ లో ఆర్పీ పట్నాయక్ తో ఒక పాట, మణిశర్మతో మిగతా పాటలు చేయించుకున్నారు. నితిన్ నటించిన ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ లో అరవింద్ శంకర్ తో ఒక పాట, అనూప్ రూబెన్ తో మిగతా పాటలు; నాని నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లో ఇళయరాజాతో ఒక పాట, రాధన్ తో మిగతా పాటలు; అఖిల్ నటించిన ‘అఖిల్’ లో తమన్ తో ఒక పాట, అనూప్ రూబెన్స్ తో మిగతా పాటలూ చేయించుకుంటూ వచ్చారు.

ఇలా ఇంకా చాలా సినిమాలకి జరిగింది. ఈ సంఖ్య సిద్ధార్థ్ నటించిన ‘అనగనగా ఒక ధీరుడు’ లో, ప్రభాస్ నటించిన ‘సాహో’ లో నలుగురు సంగీత దర్శకుల దాకా పెరిగింది. వీటి నేపథ్య సంగీతానికి వేరే ఇంకో సంగీత దర్శకుడు కూడా తోడయ్యాడు. ఇలా నేపథ్య సంగీతానికి ఇంకో సంగీత దర్శకుడ్ని నియమించుకునే ట్రెండ్ కూడా మొదలైంది.

‘ఆది పురుష్’ లో పాటలకి ఇద్దరు (అజయ్ అతుల్, సంకేత్ పరంపర), నేపథ్య సంగీతానికి ఇద్దరు (సంచిత్ భాత్రా, అంకిత్ బల్హరా), ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ కి పాటలకి గోపీ సుందర్, నేపథ్య సంగీతానికి రాధన్... ఇలా ఆల్బమ్ కి, బ్యాక్ గ్రౌండ్ కీ వేర్వేరుగా ఔట్ సోర్సింగ్ మొదలైంది.

హిందీలో కూడా ఈ ట్రెండ్ 2000లలోనే మొదలైంది. కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన 'కభీ ఖుషీ కభీ ఘమ్' 2001లో విడుదలైంది. దీనికి నలుగురు సంగీత దర్శకులు- జతిన్-లలిత్, ఆదేశ్ శ్రీవాస్తవ్, సందేశ్ శాండిల్య, బబ్లూ చక్రవర్తి పాలుపంచుకున్నారు. ఐతే అప్పట్లో దీన్ని కేవలం ఒక అపసవ్య ధోరణిగా భావించారు. అయినా కూడా ఈ ధోరణి క్రమంగా బాలీవుడ్ ని ఆకర్షించింది. ఇప్పుడు సల్మాన్ ఖాన్- వెంకటేష్ లు నటించిన ‘కిసీకా భాయ్ కిసీకీ జాన్’ (2023) లో 8 మంది సంగీత దర్శకులు- రవి బస్రూర్, హిమేష్ రేషమ్మియా, సాజీద్ ఖాన్, సుఖ్ బీర్, పాయల్ దేవ్, అమల్ మాలిక్, ఆఖరికి దేవీశ్రీ ప్రసాద్ కూడా కలిసి 8 పాటల్ని సమకూర్చి పెట్టారు. నేపథ్య సంగీతానికి రవి బస్రూర్ వేరే.

అయితే సంగీతం మాన్యువల్ రోజుల నుంచి డిజిటల్ కాలానికి వచ్చాక సంగీత దర్శకుల ముద్రా చెరిగి పోయింది. ఫిలిం రీళ్ళ శకం ముగిసి డిజిటల్ మేకింగ్ వచ్చాక ఛాయాగ్రాహకులందరి ముద్ర పోయినట్టు. మాన్యువల్ సంగీతం వున్నప్పుడు ఇళయరాజా పాటల్ని గుర్తు పట్టేవాళ్ళం, బప్పీలహరీ పాటల్ని గుర్తు పట్టేవాళ్ళం. కెవి మహదేవన్, చక్రవర్తి, సత్యం, రాజేశ్వరరావు, పెండ్యాల, కోదండపాణి, విశ్వనాథన్... అటు హిందీలో శంకర్ -జైకిషన్, లక్ష్మీకాంత్ - ప్యారేలాల్, కళ్యాణ్ జీ- ఆనంద్ జీ, ఓపీ నయ్యర్, ఎస్డీ బర్మన్, ఆర్డీ బర్మన్... ఇలా ఎవరి పాటనైనా వినగానే గుర్తు పట్టగలిగే వాళ్ళ ముద్ర, లేదా సంతకంతో వుండేవి. అంటే ఒక్కో వాద్య పరికరం ఒక్కో సంగీత దర్శకుడి పాటల్లో ఒక్కో రకంగా పలికేది. అది లైవ్ ఆర్కెస్ట్రా. కాబట్టి ఎవరి ఆర్కస్ట్రేషన్ ఏమిటో సులభంగా తెలిసిపోయేది.

సంగీతం డిజిటల్ అయ్యాక ఇప్పుడు ఏఆర్ రెహ్మాన్ పాటలు కూడా గుర్తుపట్ట లేకుండా వున్నాయి. అనిరుధ్ రవిచందర్, దేవీశ్రీ ప్రసాద్, తమన్, మణిశర్మ –ఇలా పేర్లు చెప్తే తప్ప ఫలానా వారి పాట అని తెలుసుకోలేం. అలాంటప్పుడు ఒక సినిమాకి మల్టీపుల్ మ్యూజిక్ డైరెక్టర్లని బుక్ చేసుకుంటే వచ్చే ప్రత్యేకత ఏమిటి? ఆ పాటలన్నీ ఒకేలా వినిపిస్తాయి. ఒక ఇళయ రాజాని, ఒక బప్పీలహరీని, ఒక మహదేవన్ నీ కలిపి నియమించుకుంటే - ఆ పాటలు ఒక ఇడ్లీలాగా, ఒక వడ లాగా, ఒక దోశెలాగా వేర్వేరుగా అన్పించి రేడియో కార్యక్రమం వింటున్నంత కిక్ నిస్తాయి.

అయితే బహుళ సంగీత దర్శకుల్ని నియమించుకోవడానికి వేరే సాంకేతిక, సృజనాత్మక, సామాజిక కారణాలూ వుంటున్నాయి. బాలీవుడ్ నిర్మాత ముఖేష్ భట్ ప్రకారం- సినిమాలో కథాపరంగా విభిన్న పరిస్థితులు వుంటాయి. ప్రతి పరిస్థితికి భిన్నమైన సంగీత శైలి అవసరం. శంకర్-జైకిషన్, ఎస్డీ బర్మన్, ఆర్డీ బర్మన్ ల వంటి ఒకప్పటి సంగీత దర్శకుల్లాగా నేటి స్వరకర్తలు డైనమిక్‌గా లేరు. కాబట్టి విభిన్న సన్నివేశాలకి భిన్నమైన మెలోడీలు వుండాలంటే, విభిన్న స్వరకర్తలు అవసరం- ఇది సాంకేతిక కారణం.

టీ సిరీస్ అధినేత కృషన్ కుమార్ ప్రకారం- చాలా మంది సంగీత దర్శకులు ఒకేసారి అనేక సినిమాలు చేస్తున్నారు. ఒక డైరెక్టర్ తోనే కూర్చుని ఆరు హిట్ సాంగ్స్ క్రియేట్ చేసేంత టైమ్ వాళ్ళకి లేదు. ఈ ప్రక్రియకి చాలా సమయం, నిబద్ధత అవసరం- ఇది కూడా సాంకేతిక కారణమే.

కృషన్ కుమార్ ప్రకారమే- ఇంతకి ముందు ఒక్కో సినిమాకు ఒక సంగీత దర్శకుడిని తీసుకున్న చాలా పెద్ద బ్యానర్లు ఇప్పుడు ఈ కొత్త ట్రెండ్‌ ని అనుసరించడం ప్రారంభించాయి. ఇది సౌండ్‌ట్రాక్ నాణ్యతని మెరుగుపరచడమే కాకుండా, కొత్త వారికి వారి ప్రతిభని ప్రదర్శించడానికి అవకాశం ఇస్తుంది. కొత్త వ్యక్తులు విభిన్న దృక్కోణాలని కూడా తీసుకువస్తారు- ఇది సృజనాత్మకత కోణంలో కారణం.

కృషన్ కుమార్ ప్రకారమే- ఒక సినిమాకి ఎక్కువ మంది కొత్త సంగీత దర్శకులకి అవకాశమిస్తే వెలుగులోకి వస్తారు. లేకపోతే సింగిల్ కార్డుతో పని చేసే అవకాశమే వాళ్ళకి రాదు- ఇది సామాజిక కారణం.

అయితే ఇద్దరు, ముగ్గురు సంగీత దర్శకులు వుంటే ఫర్వాలేదుగానీ మరీ ఆరుగురు, ఏడుగురు సంగీత దర్శకుల రేంజ్‌లో గుంపు వుంటే సినిమా లాజిక్‌ ని ధిక్కరిస్తుందని, అయినప్పటికీ ట్రెండ్ అలా వుందనీ, విభిన్న టాలెంట్స్ తో ప్రయోగాలు చేయవచ్చనీ కొందరు నిర్మాతలు చెబుతున్నారు.

First Published:  16 Nov 2023 4:30 PM IST
Next Story