Telugu Global
Cinema & Entertainment

త్రివిక్రమ్ తొలి సినిమా.. సిరివెన్నెలకు అంకితం

తాజాగా 20 ఏళ్లు పూర్తి చేసుకుంది నువ్వే నువ్వే సినిమా. తనను దర్శకుడిగా పరిచయం చేసిన ఈ సినిమాను, సిరివెన్నెలకు అంకితం ఇస్తున్నట్టు ప్రకటించాడు త్రివిక్రమ్.

త్రివిక్రమ్ తొలి సినిమా.. సిరివెన్నెలకు అంకితం
X

త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ... ప్రముఖ నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ బ్యానర్ పై 'స్రవంతి' రవికిశోర్ నిర్మించిన సినిమా 'నువ్వే నువ్వే'. తరుణ్, శ్రియ జంటగా నటించిన ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, చంద్ర మోహన్, సునీల్, రాజీవ్ కనకాల, తనికెళ్ళ భరణి, అనితా చౌదరి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ కీలక పాత్రలు పోషించారు.

తాజాగా ఈ సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఏఎంబీ సినిమాస్‌లో స్పెషల్ షో కూడా వేశారు. సినిమాకు సంబంధించిన కీలకమైన యూనిట్ సభ్యులంతా ఈ షోకు హాజరయ్యారు. అలా శ్రియ, తరుణ్, త్రివిక్రమ్ మరోసారి కలిశారు.

నువ్వే నువ్వే సినిమా 20 ఏళ్లూ పూర్తి చేసుకున్న సందర్భంగా అప్పటి జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నాడు దర్శకుడు త్రివిక్రమ్. హీరో, హీరోయిన్, నిర్మాత, ఆర్టిస్టులు ఎవ్వరూ మారలేదని.. సిరివెన్నెల లేకపోవడమే అప్పటికీ ఇప్పటికీ పెద్ద తేడా అన్నాడు. ఈ సందర్భంగా నువ్వే నువ్వే సినిమాను సిరివెన్నెలకు అంకితం చేశాడు.

"నిర్మాత రవికిషోర్ గారికి, సీతారామశాస్త్రి గారికి మధ్య ఉన్న లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్ ఇంకెవరి మధ్య చూడలేదు. అందుకు నేను సాక్షిని. 'గాలిపటం గగనానిదా? ఎగరేసే నేలదా?' అని రాసిన శాస్త్రి గారి గురించి నేను ఏం చెప్పగలను! ఆయన మాటల్లో చెప్పాలంటే... 'ఆయన ఉఛ్వాసం కవనం. ఆయన నిశ్వాసం గానం. ఆయన జ్ఞాపకం మన అందరికీ ఎప్పటికీ అమరం'. అటువంటి సీతారామశాస్త్రి గారి దివ్య స్మృతికి ఆయన పాదాల దగ్గర ఈ సినిమాను రవికిశోర్ గారు, నేను, మా చిత్ర బృందం నివాళిగా అర్పిస్తున్నాం."

First Published:  12 Oct 2022 5:28 AM GMT
Next Story