SIIMA Awards 2023 | ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్
SIIMA Awards 2023 - సైమా అవార్డుల సంబరం గ్రాండ్ గా ముగిసింది. ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్ నిలిచాడు.

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా)-2023 వేడుకలు దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వేదికగా అంగరంగ వైభవంగా జరిగాయి. సెప్టెంబరు 15, 16 తేదీల్లో నిర్వహించిన ఈ వేడుకలు తారలని ఒక చోటుకి చేర్చింది. చలనచిత్ర పరిశ్రమలో గత ఏడాది అద్భుతమైన ప్రతిభ కనబరిచిన వాళ్లను ఈ వేదికపై ఘనంగా సత్కరించారు.
సెప్టెంబర్ 14న బిజినెస్ అవార్డ్స్ తో కొంతమందిని సత్కరించింది సైమా. 15న తెలుగు, కన్నడ పరిశ్రమల విజేతలకు అవార్డులు ప్రదానం చేయగా, 16న మలయాళం, తమిళ పరిశ్రమల విజేతలను సన్మానించారు.
సైమా దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలలోని చలనచిత్ర ప్రముఖులను అభినందించడానికి, అంతర్జాతీయ మార్కెట్లలో దక్షిణ భారతీయ చిత్రాలను ప్రోత్సహించడానికి ఒక వేదిక. సైమా వ్యవస్థాపకుడు విష్ణు వర్ధన్ ఇందూరి, అతని భార్య బృందా ప్రసాద్ ఈ వేడుకలో పాల్గొన్న కళాకారులు, సాంకేతిక నిపుణులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. విజేతలను అభినందించారు.
ఇక ‘సైమా’ 2023 అవార్డ్స్ విజేతల వివరాలు చూస్తే.. ఉత్తమ చిత్రంగా సీతారామం నిలిచింది. ఉత్తమ నటుడిగా ఆర్ఆర్ఆర్ చిత్రానికి గాను జూనియర్ ఎన్టీఆర్ అవార్డ్ అందుకున్నాడు. ఇక క్రిటిక్స్ మెచ్చిన హీరోగా అడివి శేష్, ఉత్తమ నటిగా శ్రీలీల అవార్డులు అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను రాజమౌళి ఉత్తమ దర్శకుడిగా, కీరవాణి ఉత్తమ సంగీత దర్శకుడిగా, భీమ్లానాయక్ సినిమాకు గానూ ఉత్తమ సహాయ నటుడిగా రానా, ఉత్తమ గాయకుడిగా రామ్ మిరియాల (డీజే టిల్లూ) అవార్డులు అందుకున్నారు.