Telugu Global
Cinema & Entertainment

‘హమారే బారా’ ముస్లిం వ్యతిరేకం కాదు : బాంబే హైకోర్టు

అన్నూ కపూర్ నటించిన ‘హమారే బారా’ సినిమా చూశామని, అందులో ఖురాన్ లేదా ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా, అభ్యంతరకరంగా ఏమీ కనిపించలేదని, వాస్తవానికి ఈ చలన చిత్రం మహిళల అభ్యున్నతిని కోరుతోందని బాంబే హైకోర్టు పేర్కొంది.

‘హమారే బారా’ ముస్లిం వ్యతిరేకం కాదు : బాంబే హైకోర్టు
X

అన్నూ కపూర్ నటించిన ‘హమారే బారా’ సినిమా చూశామని, అందులో ఖురాన్ లేదా ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా, అభ్యంతరకరంగా ఏమీ కనిపించలేదని, వాస్తవానికి ఈ చలన చిత్రం మహిళల అభ్యున్నతిని కోరుతోందని బాంబే హైకోర్టు పేర్కొంది. ఈ సినిమా మొదటి ట్రైలర్ అభ్యంతరకరంగా వుందని, అయితే దానిని తొలగించామని, అలాంటి అభ్యంతరకర సన్నివేశాలన్నింటినీ సినిమా నుంచి తొలగించామనీ జస్టిస్ బిపి కొలాబావాలా, ఫిర్దోస్ పూనావాలాలతో కూడిన డివిజన్ బెంచ్ నిన్న ఇచ్చిన తీర్పులో పేర్కొంది.

వాస్తవానికి ఇది ఆలోచించపజేసే సినిమా అని, ప్రేక్షకులు తమ మెదడుని ఇంట్లో వదిలి వచ్చి మాత్రమే ఆనందించాలని ఆశించే రకం కాదనీ కోర్టు పేర్కొంది. ‘ఈ సినిమా నిజానికి స్త్రీల అభ్యున్నతి కోసమే. సినిమాలో ఒక మౌలానా ఖురాన్‌ కి తప్పుడు వ్యాఖ్యానం చేశాడు. వాస్తవానికి ఒక ముస్లిం పాత్ర అదే వ్యాఖ్యానాన్ని ఖండించినట్టు చూపించారు. కాబట్టి ప్రజలు అలాంటి మౌలానాలను గుడ్డిగా అనుసరించకూడదని ఇది చూపిస్తోంది’ అని హైకోర్టు పేర్కొంది.

ఈ సినిమా ముస్లిం సమాజాన్ని కించపరిచేలా వుందని, ఖురాన్ చెప్పిన వాటిని వక్రీకరించిందనీ పేర్కొంటూ సినిమాపై నిషేధం విధించాలని కోరుతూ ఈ నెల ప్రారంభంలో బాంబే హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. మొదట్లో హైకోర్టు సినిమా విడుదలని వాయిదా వేసింది. సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిలిం సర్టిఫికేషన్ సూచించిన విధంగా అభ్యంతరకర భాగాల్ని తొలగిస్తామని మేకర్స్ చెప్పడంతో విడుదలకి అనుమతినిచ్చింది. దీంతో పిటిషనర్లు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. దీంతో సుప్రీం కోర్టు గత వారం సినిమా విడుదలని నిలిపివేసి, విచారణ జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని బాంబే హైకోర్టుని ఆదేశించింది.

నిన్న మంగళవారం జస్టిస్ కొలాబావాలా నేతృత్వంలోని ధర్మాసనం అన్ని అభ్యంతరకర భాగాల్ని తీసివేసిన తర్వాత సినిమాని చూశామని, హింసని ప్రేరేపించే ఏదీ సినిమాలో లేదనీ, ఇంకా కొంచెం అభ్యంతరకరంగా వున్న కొన్ని సన్నివేశాలపై సూచనలిచ్చామనీ కోర్టు పేర్కొంది. అభ్యంతరకర భాగాల తొలగింపునకు సంబంధిత పక్షాలన్నీ అంగీకరిస్తే సమ్మతిని కోర్టుకి సమర్పించవచ్చని, ఆ తర్వాత సినిమా విడుదలకి అనుమతినిస్తూ కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేస్తుందని ధర్మాసనం పేర్కొంది. అయితే ట్రైలర్, పోస్టర్లు ఇబ్బందికరంగా వున్నాయని పిటిషనర్ల వాదనతో ఏకీభవిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.

ఏ మతం వారి మనోభావాలనూ దెబ్బతీసేలా సృజనాత్మక స్వేచ్ఛ అనే ముసుగులో డైలాగులు, సన్నివేశాలు చేర్చవద్దని, సినిమా నిర్మాతలు కూడా జాగ్రత్తగా వుండాలని కోర్టు హెచ్చరించింది. ‘నిర్మాతలు కూడా చూపించే విషయం పట్ల జాగ్రత్తగా వుండాలి. వారు ఏ మతం మనోభావాలనూ దెబ్బతీయలేరు. వారు (ముస్లిం) ఈ దేశంలో రెండవ అతిపెద్ద మతం’ అని కోర్టు పేర్కొంది. సినిమాలో తన కూతురిని చంపేస్తానని బెదిరించి, దేవుడి పేరు పెట్టుకునే సన్నివేశం వుందని ధర్మాసనం పేర్కొంది. ‘ఇది అభ్యంతరకరం కావచ్చు. దేవుడి పేరుతో ఇలాంటివి చేయడం తప్పుడు సంకేతం పంపవచ్చు. ఈ ఒక్క లైన్‌ని తొలగించడం వల్ల నిర్మాత సృజనాత్మక స్వేచ్ఛకి ఎలాంటి విఘాతమూ కలగదు’ అని హైకోర్టు పేర్కొంది. పిటిషనర్లు సినిమా కూడా చూడనప్పుడు సినిమాపై ఇలాంటి ప్రకటనలు చేయడం ఆశ్చర్యంగా వుందని పేర్కొంది.

ఈ సినిమా ఒక ఆధిపత్య వ్యక్తికి, అతడి కుటుంబానికీ సంబంధించిన కథతో కూడుకున్నదని హైకోర్టు తెలిపింది. ఇది గృహ హింసని ప్రోత్సహిస్తోందని పిటిషనర్లు పేర్కొన్నారని, గృహ హింస కేవలం ఒక వర్గానికి మాత్రమే పరిమితమని చెప్పలేమనీ ధర్మాసనం స్పష్టం చేసింది.

కోర్టు వివాదాల కారణంగా మొదట జులై 7న విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడింది. తిరిగి 14వ తేదీ విడుదల కూడా వాయిదా పడింది. నేడు బాంబే హై కోర్టు తీర్పుతో వివాదం ముగిసినట్టే. ఇక కొత్త విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించుకోవచ్చు.

First Published:  19 Jun 2024 6:24 AM GMT
Next Story