Telugu Global
Cinema & Entertainment

టాలీవుడ్ కి ఒకటి కాదు మూడు దెబ్బలు!

ఈసారి సమ్మర్ సెలవులు టాలీవుడ్ కి కలిసి రావడం లేదు. ప్రతీ స్టార్ సినిమా విడుదల వాయిదా పడిపోయి థియేటర్లు వెలవెల బోతున్నాయి.

టాలీవుడ్ కి ఒకటి కాదు మూడు దెబ్బలు!
X

ఈసారి సమ్మర్ సెలవులు టాలీవుడ్ కి కలిసి రావడం లేదు. ప్రతీ స్టార్ సినిమా విడుదల వాయిదా పడిపోయి థియేటర్లు వెలవెల బోతున్నాయి. సంక్రాంతి తర్వాత వేసవి సెలవులు స్టార్ సినిమాలకి కలెక్షన్లు కురిపిస్తాయి. అలాంటిది ఈసారి పరిస్థితి వ్యతిరేకంగా వుంది. గత సంవత్సరం ఏప్రిల్ - మే సమ్మర్ రెండు నెలల్లో నాని ‘దసరా’, రవితేజ ‘రావణాసుర’, సమంత ‘శాకుంతలం’, నాగచైతన్య ‘కస్టడీ’, అఖిల్ ‘ఏజెంట్’, అల్లరి నరేష్ ‘ఉగ్రం’, గోపీచంద్ ‘రామబాణం’, సాయి ధరం తేజ్ ‘విరూపాక్ష’ స్టార్ సినిమాలు ఎనిమిదీ విడుదలై హంగామా చేశాయి. వీటి బాక్సాఫీసు ఫలితాలెలా వున్నా వేసవి సెలవుల్ని సొమ్ము చేసుకునే ఉద్దేశంతో విడుదలయ్యాయి. ఈ వేసవి అలా సొమ్ములు చేసుకునే ఆలోచనకి దూరంగా వున్నారు. కారణం, సొమ్ము చేసుకోబోతే ఒక వైపు నుంచి ఎన్నికలు, మరో వైపు నుంచి ఐపీఎల్ సీజన్, మరింకో వైపు నుంచీ భగభగ మండిపోతున్న ఎండలు - ఈ మూడూ గట్టి దెబ్బలు కొట్టేట్టున్నాయి!

ఆంధ్రా తెలంగాణాల్లో లోక్ సభ ఎన్నికలు, అదనంగా ఆంధ్రాలో అసెంబ్లీ ఎన్నికలూ మే 13 న జరుగనుండడంతో చిన్న చిన్న సినిమాలు తప్ప స్టార్ సినిమాలు సమ్మర్ రేసులోకి దిగడం లేదు. అలాగే ఐపీఎల్ సీజన్ లో టీవీ తెరకి, లేదా మొబైల్ తెరకి జనం అతుక్కుపోవడంతో, వెండి తెర స్టార్ సినిమాలకి క్షేమం కాదని విడుదలలు వాయిదా పడిపోయాయాయి. అలాగే ఎండలు ఘోరంగా పెరిగిపోవడంతో - ఈ రోజు శుక్రవారం అల్లరి నరేష్ 'ఆ ఒక్కటీ అడక్కు' విడుదలవుతున్న సందర్భంగా - ఉదయం నుంచే వడదెబ్బ కొట్టే తీవ్రతతో ఉష్ణోగ్రత పెరిగిపోవడం- వాతావరణ శాఖ ఆరెంజ్ ఎలర్ట్ ప్రకటించడంతో, జనాలు రోడ్ల మీదికి రావడం లేదు.

ఐతే స్టార్ సినిమాలు లేని అవకాశం చూసుకుని చిన్న సినిమాలు జోరుగా విడుదలవుతున్నాయి. ఏప్రిల్లో విడుదలైన ఒక్క చిన్న సినిమాకూడా సక్సెస్ కాలేదు. ఇప్పుడు మే మొదటి శుక్రవారం శబరి, ఇండియన్ స్టోరీ, ప్రసన్న వదనం, బాక్ అనే 4 చిన్న సినిమాలు విడుదలవుతున్నాయి. ఇవిఎన్ని విడుదలైనా, ఎప్పుడు విడుదలైనా ఫలితాలు బ్రహ్మాండంగా ఏమీ వుండవు!

మే 10న సత్య దేవ్ నటించిన 'కృష్ణమ్మ' అనే యాక్షన్ మూవీ విడుదల కానుంది. మే 17 నా విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదలకి సిద్ధమైంది. ఈ ఇద్దరు మీడియం హీరోల సినిమాలతో బాటు మరో ఇద్దరు సుధీర్ బాబు, ఆనంద్ దేవర కొండ నటించిన 'హరోం హర', 'గం గం గణేశ' మే 31 విడుదలవుతాయి.

పోతే ఈ యేడాది సమ్మర్ రేసు నుంచి తప్పుకుంటున్న స్టార్ సినిమాల వివరాలు చూస్తే, జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’, రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, అల్లు అర్జున్ ‘పుష్ప-2’, ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ వున్నాయి. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో ‘దేవర’ ఏప్రిల్ 5న విడుదలవ్వాలి. అయితే ఈ సినిమా షూటింగే ఇంకా పూర్తి కాలేదు. ప్రభాస్ తో నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ‘కల్కి 2898 ఏడీ' మే 9కి విడుదల ఖరారైంది. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా వాయిదా పడింది ఇక బాలకృష్ణ తో బాబీ తెరకెక్కిస్తున్న మూవీ కూడా సమ్మర్ విడుదల వాయిదా పడింది. ఇవి షూటింగులు, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా సమ్మర్ రేసు నుంచి తప్పుకున్నాయనేకంటే, సమ్మర్ పరిస్థితిని ఊహించే నిదానంగా షూటింగులు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయని భావించుకో వచ్చు.

ఎండలు, ఎన్నికలు, క్రికెట్ వాటి సమ్మర్ సీజన్ ముగించుకోవడం జరిగాక, తొలకరితో జూన్ నుంచి చల్లని వాతావరణంలో మొదట, జూన్ 14 న పూరీ జగన్నాథ్- రామ్ పోతినేని కాంబోలో 'డబుల్ ఇస్మార్ట్' విడుదలవుతుంది. తర్వాత జూన్ 27 న 'కల్కి 2878 ఏడీ' విడుదలవుతుంది. ఆ తర్వాత ఆగస్టులో అల్లు అర్జున్ 'పుష్ప2', నాని 'సరిపోదా శనివారం', సెప్టెంబర్ లో పవన్ కళ్యాణ్ 'ఒజీ', అక్టోబర్ లో ఎన్టీఆర్ 'దేవర' విడుదలవుతాయని ఇప్పటికీ తెలుస్తోంది. అయితే కమల్ హాసన్- శంకర్ ల 'భారతీయుడు 2' విడుదల జూన్ లో ప్రకటించారు. మరి రామ్ చరణ్ తో శంకర్ రూపొందిస్తున్న 'గేమ్ ఛేంజర్' పరిస్థితేమిటో తెలీదు. శంకర్ ఒకేసారి 'భారతీయుడు 2', 'గేమ్ ఛేంజర్' బాధ్యతలు రెండూ తీసుకోవడంతో మొదట్నుంచీ 'గేమ్ ఛేంజర్' బలి అవుతూనే వస్తోంది. దీపావళికి విడుదలవుతుందని ఒక లీకు వదిలారు.

ఇలా సమ్మర్ రేసు నుంచి స్టార్ సినిమాలు కన్వీనియెంట్ గా తప్పుకుని వర్షాకాలం, శీతాకాలంల వైపు వెళ్ళిపోయాయి. ఈలోగా 12 చిన్న సినిమాలు ప్రేక్షకుల్ని రిక్వెస్ట్ చేస్తూ, తృణమో పణమో పొందాలని ఆశలు పెట్టుకుని చిన్న సినిమాల సమ్మర్ రేసుని ప్రారంభించాయి!

First Published:  3 May 2024 6:19 AM GMT
Next Story