Telugu Global
Cinema & Entertainment

బాలీవుడ్ కాదు, హాలీవుడ్ సినిమాలే ఆదుకున్నాయి!

హిందీ సినిమాలు సినీ ప్రేక్షకుల్ని థియేటర్స్ కి రప్పించడంలో విఫలమవడంతో, దేశంలో అతి పెద్ద థియేటర్ గ్రూపు పీవీఆర్ -ఐనాక్స్ ని హాలీవుడ్ సినిమాలే ఆదుకున్నాయి.

బాలీవుడ్ కాదు, హాలీవుడ్ సినిమాలే ఆదుకున్నాయి!
X

బాలీవుడ్ కాదు, హాలీవుడ్ సినిమాలే ఆదుకున్నాయి!

హిందీ సినిమాలు సినీ ప్రేక్షకుల్ని థియేటర్స్ కి రప్పించడంలో విఫలమవడంతో, దేశంలో అతి పెద్ద థియేటర్ గ్రూపు పీవీఆర్ -ఐనాక్స్ ని హాలీవుడ్ సినిమాలే ఆదుకున్నాయి. ఏప్రెల్- జూన్ మొదటి త్రైమాసికంలో ఆదాయం పెరగడానికి హాలీవుడ్ సినిమాలే తోడ్పడ్డాయి. ఓటీటీలతో దాదాపు అస్తిత్వ పోరాటం చేస్తున్న బాలీవుడ్ తన హిందీ సినిమాల ద్వారా ప్రేక్షకుల్ని థియేటర్లకి రప్పించడంలో వరుసగా విఫలమవుతోంది. మహమ్మారి తర్వాత హిందీ సినిమాల కంటే అత్యధిక సంఖ్యలో హాలీవుడ్ సినిమాల ద్వారానే ఆదాయ వృద్ధి చూశామని కంపెనీ చెప్పింది. ఆదాయం 30 శాతం పెరిగి 13.05 బిలియన్ రూపాయలకి చేరుకుంది.

ఈ త్రైమాసికంలో ‘ఫాస్ట్ ఎక్స్’, ‘గార్డియస్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్’ తో బాటు, ‘ది కేరళ స్టోరీ’ విడుదలలతో మేలో బాక్సాఫీసు వేగం పుంజుకుంది. బాలీవుడ్ సినిమాలు సుమారు 35 శాతం నుంచి 40 శాతం మార్కెట్ వాటాని కలిగి వున్నాయి. తినుబండారాలపై, పానీయాలపై ఖర్చులు పెరగడం, చలనచిత్ర ప్రదర్శన ఖర్చులు పెరగడం వంటి వ్యయాల నేపథ్యంలోనే ఈ ఆదాయ పెరుగుదల కనిపించింది. దేశంలోని అతిపెద్ద సినిమా ఆపరేటర్ అయిన పీవీఆర్- ఐనాక్స్ శ్రీలంకతో బాటు దేశంలో 1,702 స్క్రీన్‌లతో వ్యాపారం చేస్తోంది. కాగా గత నెల విడుదలైన హాలీవుడ్‌ మూవీలు ‘ఒపెన్ హైమర్’, ‘బార్బీ’ సినిమాల సక్సెస్ కూడా బాగా తోడ్పడింది.

దేశంలో ‘బార్బీ’, ‘ఒపెన్‌ హైమర్’ ల వంటి సాంప్రదాయేతర చలనచిత్రాలు బ్లాక్‌బస్టర్ విజయాల్ని చవిచూడడమొక అద్భుతమే. ఇలాటి సినిమాలు విడుదలైనప్పుడు ప్రేక్షకులు ప్రత్యేకమైన సినిమా అనుభూతి కోసం పెద్ద స్క్రీన్నే ఎంచుకుంటారని ఇది స్పష్టం చేస్తోంది.

ఈ త్రైమాసికంలో పరిమితంగా హిందీ సినిమాలు విడుదలయ్యాయి. మలయాళ సినిమా '2018' తర్వాత, 2023లో అత్యధిక వారాంతపు వసూళ్ళని నమోదు చేసిన 'ఆదిపురుష్' విడుదలతో జూన్‌లో అదే జోరు కొనసాగింది. దురదృష్టవశాత్తూ, మొదటి వారాంతం తర్వాత ఇది పెద్దగా ఆడలేదని కంపెనీ తెలిపింది..

'స్పైడర్‌మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్‌వర్స్', 'ది ఫ్లాష్' ,'ట్రాన్స్ ఫార్మర్స్: రైజ్ ఆఫ్ ది బీస్ట్స్' మాంచి వసూళ్ళని హాలీవుడ్ అందించిన ఇతర సినిమాలు. త్రైమాసికం చివరిలో విడుదలైన పంజాబీ సినిమా 'క్యారీ ఆన్ జట్టా 3', మరాఠీ సినిమా 'బైపన్ భారీ దేవా' వంటి ప్రాంతీయ చలనచిత్రాలు చెప్పుకోదగిన రికార్డు-బ్రేకింగ్ విజయాన్ని సాధించాయి.

ఈ త్రైమాసికంలో కంపెనీ 31 కొత్త స్క్రీన్స్ ని ప్రారంభించింది. ఇదే సమయంలో నష్టాల్ని అందిస్తున్న 14 స్క్రీన్స్ ని మూసి వేసింది. ఇకపోతే, ఆదాయం పెరగడానికి స్నాక్స్, డ్రింక్స్ ధరలు తగ్గించడం కూడా ఒక కారణం కావచ్చు. దీంతో ప్రేక్షకుల సంఖ్య పెరిగి వుండొచ్చు. ఇప్పుడు ఈ థియేటర్ గ్రూపులో సినిమా చూడడానికి తక్కువ ఖర్చువుతోంది. వాస్తవానికి స్నాక్స్ పై, డ్రింక్స్ పై ధరల్ని 40 శాతం వరకు తగ్గించింది.

ఇంతకి ముందు, కంపెనీ ధరల విషయంపై సోషల్ మీడియాలో ఖండనమండనల్ని ఎదుర్కొంది. దీన్ని దృష్టిలో వుంచుకుని ధరవరల్ని సవరించింది. సోమవారం నుంచి గురువారం వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రూ. 99 లతో ఫుడ్ కాంబోలని ప్రవేశపెట్టింది. వారాంతాల్లో కూడా పాప్‌కార్న్, పెప్సీలకి కోసం ప్రత్యేక ఆఫర్లని అందిస్తోంది. ఈ చర్యలు దేశవ్యాప్తంగా లక్షల మంది ప్రేక్షకులకి ప్రయోజనం చేకూరుస్తోంది. మల్టీప్లెక్సుల్లో ఆహార పదార్థాల ధరల గురించి ఎప్పటినుంచో రచ్చ జరుగుతోంది. తమ నుంచి యథేచ్ఛగా డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రేక్షకులు వాపోయారు. ఇప్పుడు ఇందులో ఉపశమనం లభిస్తోంది.

First Published:  2 Aug 2023 11:30 AM GMT
Next Story