Telugu Global
Cinema & Entertainment

ఓటీటీలు వద్దు బాబో, అలసిపోతున్నాం!

గత నెల భారత పరిశ్రమల సమాఖ్య (ఫిక్కీ) విడుదల చేసిన నివేదిక ప్రకారం కోవిడ్ మహమ్మారి కాలంలో ఓటీటీ చందాదారుల సంఖ్య 99 మిలియన్లకి చేరుకున్నా, ఆ తర్వాత రెండేళ్ళ కాలంలో 101 మిలియన్లకి, అంటే నామమాత్రంగానే పెరిగింది.

ఓటీటీలు వద్దు బాబో, అలసిపోతున్నాం!
X

అమెజాన్ ప్రైమ్: అవేర్‌నెస్ (స్పానిష్) – అక్టోబరు 11, ఇన్ మై మదర్స్ స్కిన్ (తగలాగ్ మూవీ) – అక్టోబరు 12, ఎవ్రిబడీ లవ్ డైమండ్స్ (ఇటాలియన్) – అక్టోబరు 13,ది బరియల్ (ఇంగ్లీష్) – అక్టోబరు 13.

నెట్‌ ఫ్లిక్స్: డైరీస్ సీజన్ 2(ఇటాలియన్ సిరీస్) – అక్టోబరు 10, లాస్ట్ వన్ స్టాండింగ్ సీజన్ 2 (జపనీస్) – అక్టోబరు 10, బిగ్ వేప్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబరు 11, వన్స్ అపాన్ ఏ స్టార్ (థాయ్ మూవీ) – అక్టోబరు 11, ప్యాక్ట్ ఆఫ్ సైలెన్స్ (స్పానిష్ సిరీస్) – అక్టోబరు 11.

గుడ్‌ నైట్ వరల్డ్ (జపనీస్ సిరీస్) – అక్టోబరు 12, ది ఫాల్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ఉషర్ (ఇంగ్లీష్) – అక్టోబరు 12, ఇజగ్బాన్ (యోరుబా మూవీ) – అక్టోబరు 13, కాసర్ గోల్డ్ (మలయాళం) – అక్టోబరు 13, ది కాన్ఫరెన్స్ (స్వీడిష్ ఫిల్మ్) – అక్టోబరు 13, క్యాంప్ కరేజ్ (ఉక్రేనియన్) – అక్టోబరు 15

హాట్‌ స్టార్: మాతగాం 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – అక్టోబరు 12, గూస్‌ బంప్స్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబరు 13, సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ (హిందీ సిరీస్) – అక్టోబరు 13

ఆహా: మట్టికథ (తెలుగు) – అక్టోబరు 13; జీ5: ప్రేమ విమానం (తెలుగు) – అక్టోబరు 13; సోనీ లివ్: సంతిత్ క్రాంతి సీజన్ 2(మరాఠీ) – అక్టోబరు 13, జియో సినిమా: అర్మాండ్ (హిందీ షార్ట్ ఫిల్మ్) – అక్టోబరు 10, కమింగ్ ఔట్ విత్ ది హెల్ప్ ఆఫ్ టైమ్ మెషీన్ (ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్) – అక్టోబరు 11, ది లాస్ట్ ఎన్వలప్ (హిందీ షార్ట్ ఫిల్మ్) – అక్టోబరు 12, మురాఖ్ ది ఇడియట్ (హిందీ షార్ట్ ఫిల్మ్) – అక్టోబరు 13, రింగ్ (హిందీ షార్ట్ ఫిల్మ్) – అక్టోబరు 15.

డిస్కవరీ ప్లస్: స్టార్ vs ఫుడ్ సర్వైవల్ (హిందీ సిరీస్) – అక్టోబరు 9, ఈ-విన్: మిస్టర్ నాగభూషణం (తెలుగు సిరీస్) – అక్టోబరు 13, బుక్ మై షో: మిషన్ ఇంపాజిబుల్ – డెడ్ రెకనింగ్ 1- అక్టోబరు 11, టాక్ టు మీ (ఇంగ్లీష్) – అక్టోబరు 15, ది క్వీన్ మేరీ (ఇంగ్లీష్) – అక్టోబరు 15, యాపిల్ ప్లస్ టీవీ:, లెసన్స్ ఇన్ కెమిస్ట్రీ(ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబరు 13.

ఇదీ ఈ వారం ఓటీటీ వేదికలపై విడుదలైన వివిధ భాషల సినిమాలు, షోలు, వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిల్ములు వగైరాల తాలూకు మెనూ. ఇది శాంపిల్ కోసం తీసుకున్నది మాత్రమే. పై లిస్టు 33 కొత్త విడుదలల్ని చూపిస్తోంది. కొన్ని ఓటీటీలు, కొన్ని భాషలు మాత్రమే లిస్టింగ్ అయ్యాయి. మన దేశంలో ఇంకా ఎన్నో ఓటీటీలున్నాయి- మొత్తం 40. ఇంకెన్నో భాషల్లో కంటెంట్ ని విడుదల చేస్తున్నాయి. ప్రతీవారం 15, 20, 30, 40 టైటిల్స్ వచ్చి ప్రేక్షకుల మీద పడుతున్నాయి. ఇంత కంటెంట్ ని వీక్షకుల మీద గుప్పిస్తున్నాయి ఓటీటీలు. దీన్ని దాడిగా పేర్కొంటున్నారు నిపుణులు. ఏది చూడాలో తెలియక, ఎన్ని చూడాలో అర్ధం గాక, ఈ దాడి దెబ్బకి అలసిపోతున్నారు ప్రేక్షకులు.

యూట్యూబే శరణ్యం!

గత నెల భారత పరిశ్రమల సమాఖ్య (ఫిక్కీ) విడుదల చేసిన నివేదిక ప్రకారం కోవిడ్ మహమ్మారి కాలంలో ఓటీటీ చందాదారుల సంఖ్య 99 మిలియన్లకి చేరుకున్నా, ఆ తర్వాత రెండేళ్ళ కాలంలో 101 మిలియన్లకి, అంటే నామమాత్రంగానే పెరిగింది. అంటే సబ్ స్క్రిప్షన్లు సంతృప్త స్థాయికి చేరుకున్నాయని నివేదిక పేర్కొంది. మీడియా పార్టనర్స్ ఆసియా రిపోర్టు ప్రకారం- 2022 జనవరి- 2023 మార్చి మధ్య చందాదారులు లేదా యూజర్లు ఆన్ లైన్ కంటెంట్ ని వీక్షిస్తూ 6.1 ట్రిలియన్ నిమిషాలు గడిపారు. ఇందులో 88 శాతం కాలం యూట్యూబ్ లోనే గడిపారు!

యాక్సెంచర్ రెండవ వార్షిక గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ అధ్యయనం ప్రకారం, మన దేశంలోని 77 శాతం మంది యూజర్లు తాము ఎంచుకోవడానికి స్ట్రీమింగ్ సేవల సంఖ్యని చూసి కన్ఫ్యూజ్ అవుతున్నామని చెప్పారు. మూడవ వంతు మంది ఏది చూడాలో ఎంపిక చేసుకునేందుకు 10 నిమిషాల కంటే ఎక్కువ సమయమే పడుతొందని చెప్పారు.

ఇందుకే ఇదంతా చిరాకేసి యూట్యూబ్ ని ఆశ్రయిస్తున్నారు. యూట్యూబ్ లో ఏదో వొకటి ఫ్రీగా చూస్తూ కాలక్షేపం చేయొచ్చు. పైగా ఇందులో నాలెడ్జి సంబంధ వీడియోలు ప్రయోజనకరంగా అనిపిస్తున్నాయి. దేశీయ ఓటీటీ మార్కెట్ లో అన్ని భాషల్లో 40కి పైగా ఓటీటీ యాప్‌లు పోటీ పడుతున్నాయి. ఈ పోటీతో ఎంతసేపూ తమ లైబ్రరీని భారీగా పెంచుకుని ప్రేక్షకుల్ని ఆకర్షించాలన్న తపనే తప్ప, ఎంత మంది వీక్షిస్తున్నారో, ఎంతమంది చందాలు నిలిపి వేస్తున్నారో తెలుసుకునే ఓపికా, సమయం లేవు.

డిస్నీ+ హాట్‌స్టార్ ఆసియాలో అత్యధికంగా 60.3 మిలియన్ సబ్‌స్క్రైబర్‌లతో అగ్రగామిగా వుంది- ఇందులో అత్యధిక భాగం మన దేశానిదే. ప్రత్యర్థులైన అమెజాన్ ప్రైమ్ వీడియో (సుమారు 20 మిలియన్లు), నెట్‌ఫ్లిక్స్ (సుమారుగా 20 మిలియన్లు) కంటే ముందుంది. తర్వాతి స్థానాల్లో జీ5, సోనీలివ్ వున్నాయి. ఇంకేముంది? దేశంలోని 41 శాతం మంది యూజర్లు గత 12 నెలల్లో మొదటి ఐదు స్ట్రీమింగ్ వీడియో-ఆన్-డిమాండ్ సర్వీసుల్లో కనీసం ఒకదాని నుంచి వైదొలిగారు. 42 శాతం మంది రాబోయే 12 నెలల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వాటిని తొలగించుకోవాలని యోచిస్తున్నట్లు చెప్పారు.

షెల్ఫ్ లైఫ్ పది రోజులే!

క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఇలా వుండగా, ఓటీటీలు వారం వారం భారీ పెట్టుబడులతో 40, 50 రకాల కంటెంట్ ని ప్రేక్షకుల మీద గుప్పిస్తున్నాయి. వాడి లైబ్రరీ కంటే నా లైబ్రరీ మిన్నగా వుండాలన్న తాపత్రయంతో ఎడాపెడా ఇంట్లో కూడా సుఖం లేకుండా ప్రేక్షకుల్ని బాదేస్తున్నాయి. ఇంతా చేసి ఏ కంటెంట్ కైనా పది రోజులకి మించి టాక్ వుండడం లేదు. అంటే ఆ కంటెంట్ షెల్ఫ్ లైఫ్ పది రోజులేనన్న మాట. ఆ తర్వాత లైబ్రరీలో ఏ మూల పడుతుందో తెలీదు, దాన్నెవరూ పట్టించుకోరు.

వెబ్ స్పేస్‌లో షోలు, సినిమాల బాదుడే షెల్ఫ్ లైఫ్ క్షీణించడానికి కారణమని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. కంటెంట్ తో భారీగా పెరుగుతున్న లైబ్రరీని స్ట్రీమింగ్ ప్రపంచానికి సానుకూల సంకేతంగా చాలా మంది చూస్తున్నప్పటికీ, ఇది వీక్షకుల మీద మానసిక దాడికి దారితీస్తోందనీ, చివరికి వీక్షకులు అలసిపోయి ఇంకా వద్దు బాబో అనే పరిస్థితి వస్తోందనీ హెచ్చరిస్తున్నారు. 30 రకాల కూరలతో వడ్డించే సుబ్బయ్య గారి హోటల్ ని అనుకరుస్తున్నట్టుగా వున్నాయి ఓటీటీలు.

ఈ రంగం ఇప్పటికే వీక్షకుల అలసటకి, సంతృప్త స్థితికి చేరుకుందనీ, పరిశ్రమ ఈ సవాలుని ఎలా ఎదుర్కోగలదో తెలియదనీ మార్కెట్ నిపుణులే అంటున్నారు. తరుగుతున్న షెల్ఫ్ లైఫ్ ఓ పక్క, స్ట్రీమింగ్ వేదికల్లో వుంచుతున్న కంటెంట్‌పై పెరుగుతున్న ఆందోళనలు ఇంకోపక్క, సృజనాత్మకత పేరుతో దుర్వినియోగమవుతున్న భాష పట్ల వ్యతిరేకత మరోపక్క ఈ రంగాన్ని ఉచ్చులో బిగిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు.

First Published:  13 Oct 2023 5:15 PM IST
Next Story