The Kerala Story OTT: ‘ది కేరళ స్టోరీ’ కి ఓటీటీ బయ్యర్లు దూరం?
The Kerala Story Movie OTT: మే 5న విడుదలై రూ. 30 కోట్ల బడ్జెట్ కి రూ 303 కోట్ల బాక్సాఫీసుతో సంచలన విజయం సాధించిన ‘ది కేరళ స్టోరీ’ ఓటీటీ విడుదల తేదీ గురించి చాలా అప్డేట్స్ వచ్చాయి.
‘ఆదిపురుష్’ మీద చెలరేగుతున్న వివాదాల మంటలు ‘ది కేరళ స్టోరీ’ ని కబళిస్తున్నట్టుంది. మే 5న విడుదలై రూ. 30 కోట్ల బడ్జెట్ కి రూ 303 కోట్ల బాక్సాఫీసుతో సంచలన విజయం సాధించిన ‘ది కేరళ స్టోరీ’ ఓటీటీ విడుదల తేదీ గురించి చాలా అప్డేట్స్ వచ్చాయి. చాలా పోటీ, డిమాండ్ వున్నట్టు మీడియాలో రాశారు. అంతే కాదు, దీని ఓటీటీ హక్కుల్ని ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం జీ5 కొనుగోలు చేసినట్టు, జూన్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్టూ వార్తలు కూడా వచ్చాయి. అయితే నిర్మాతలు ఓటీటీ విడుదలపై అధికారిక ప్రకటన ఏదీ చేయలేదు. 'ది కేరళ స్టోరీ' సినిమా థియేట్రికల్ రన్ పూర్తయిన దాదాపు నెల తర్వాత ఓటీటీలో విడుదల కానుందని వార్తలు మాత్రం బాగానే వ్యాపించాయి. జూన్ మూడవ వారంలో స్ట్రీమింగ్ జరగనుందని కూడా మే నెలాఖరున తాజా అప్డేట్స్ వచ్చాయి. ఆ తర్వాత నిశ్శబ్దం నెలకొంది.
ఎందుకీ నిశ్శబ్దమని సీనియర్ బాలీవుడ్ జర్నలిస్టు సుభాష్ కె. ఝా కూపీ లాగితే, షాకింగ్ విషయాలు తెలిశాయి. ‘ది కేరళ స్టోరీ’ త్వరలో స్ట్రీమింగ్ అవుతుందని రిపోర్టులు చదివిన తర్వాత ఝా, దర్శకుడు సుదీప్తో సేన్ ని అడిగినప్పుడు,’ది కేరళ స్టోరీ’ కోసం తమకు ఇంకా ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ నుంచీ తగిన ఆఫర్ రాలేదని చెప్పాడు. మీడియాలో వస్తున్న వార్తలు ఫేక్ న్యూస్ అని చెప్పాడు. తాము ఇంకా ఏదైనా ప్రధాన ఓటీటీ ప్లాట్ ఫామ్ నుంచి మెరుగైన డీల్ కోసం ఎదురు చూస్తున్నామని చెప్పాడు. అంతేకాదు, ఒక తీవ్ర ఆరోపణ చేశాడు. తమని శిక్షించేందుకు బాలీవుడ్ లోని కొన్ని వర్గాలు ఏకమైనట్టు కనిపిస్తోందన్నాడు.
దేనికి శిక్ష?- అంటే, “మా బాక్సాఫీసు విజయం బాలీవుడ్ లోని అనేక వర్గాల్ని కలవరపరిచింది. మా విజయం చూసి ఓర్వలేక శిక్షించడానికి బాలీవుడ్ లోని కొన్ని వర్గాలు ఒక వర్గం ఏకమైందని మేము భావిస్తున్నాం” అని వివరణ ఇచ్చాడు. ఆ వర్గాలు ఏవో చెప్పడానికి నిరాకరించాడు.
జర్నలిస్టు ఝా ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ని సంప్రదిస్తే, “మేము రాజకీయంగా వివాదాస్పదంగా మారిన సినిమాల జోలికి పోదల్చుకోలేదు” అని సమాధానం వచ్చింది.
బాలీవుడ్ వర్గాల అభిప్రాయం కోరితే, ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ కూడా ఒక వర్గానికి వ్యతిరేకంగా తీసిన సినిమాని ప్రసారం చేసి, ఆ వర్గాన్ని దూరం చేసుకోదనీ చెప్పారు.
ఓటీటీ ఛానెల్‌లు మరింత తెలివైన, ఆలోచింపజేసే, వినోదాత్మక కంటెంట్ వున్న సినిమాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నప్పుడు, ‘ది కేరళ స్టోరీ’ లాంటి ప్రాపగాండా సినిమాకి పల్లకీ మోయవని, దీన్ని అర్ధం జేసుకోవాలనీ చెప్పారు.
ఈ నేపథ్యంలో మతపరంగా ప్రజల మనోభావాల్ని తీవ్రంగా గాయపర్చి ఫ్లాపైన ‘ఆదిపురుష్’ నెగెటివ్ ప్రబావం ఓటీటీలపై పడదని చెప్పలేం. ‘ఆదిపురుష్’ కూడా ప్రాపగాండా సినిమాగా ప్రచారమై పోయింది. దీని వివాదాల తీరు చూసి ఓటీటీలు ‘ది కేరళ స్టోరీ’కి ఇక దూరంగా వుండే అవకాశం లేకపోలేదు. అయితే భారీ చందాదారుల సంఖ్యగల దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ దీనికి దూరంగా వుండే పక్షంలో చిన్న కంపెనీలు ముందుకు రావచ్చు. అలాంటప్పుడు నిర్మాతలు మెరుగైన డీల్ ని ఆశించక రాజీపడక తప్పదు.
అసలు ‘ది కేరళ స్టోరీ’ జీ5 ఓటీటీ ద్వారా విడుదలవుతుందని వచ్చిన ప్రారంభ వార్తలు సైతం నిజం కావని సినిమా దర్శకుడు కొట్టి వేయడంలో కూడా ఒక ప్రశ్న ఎదురవుతోంది- కేంద్రంలో అధికార పార్టీకి సన్నిహితుడైన జీ5 అధిపతి ‘ది కేరళ స్టోరీ’ ని స్ట్రీమింగ్ చేయడంలో అభ్యంతర మేముంటుంది?
ఇక ‘ది కేరళ స్టోరీ’ ని ఓటీటీలు నిరాకరించడానికి పైన చెప్పిన కారణాలే నిజమైతే, ‘ఆదిపురుష్’ సంగతేమిటి? ‘ది కేరళ స్టోరీ’ ఓటీటీ విడుదలపై ఏవైనా ఆశలు మిగిలుంటే వాటికి ‘ఆదిపురుష్’ చెక్ పెట్టేసిందన్న అభిప్రాయాలూ కూడా వున్నాయి. మరి అలాటి ‘ఆదిపురుష్’ ని ఓటీటీలు ముట్టుకుంటాయా? ‘ఆదిపురుష్’ సినిమా విడుదలైన వారమంతా సినిమా థియేట్రికల్ బిజినెస్ కి స్పేస్ నివ్వకుండా ఓటీటీ విడుదల గురించి అప్పుడే మీడియాలో అసంఖ్యాకంగా వార్తలు గుప్పించారు, ఓటీటీ విడుదల తేదీ కూడా వెల్లడిస్తూ. సినిమా బాక్సాఫీసు కలెక్షన్స్ ని దెబ్బతీసే ఇలాటి వార్తలు మంచివేనా? రూ. 250 కోట్లకి నెట్ ఫ్లిక్స్ ఓటీటీ హక్కుల్ని సొంతం చేసుకుందనీ, నెట్ ఫ్లిక్స్ కాదు అమెజాన్ సొంతం చేసుకుందనీ, ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో ప్రసారమవుతుందనీ రకరకాలుగా స్థానిక, జాతీయ మీడియాలు హోరెత్తించాయి. శుభమా అని ప్రేక్షకులకోసం థియేటర్లలో సినిమా విడుదలైతే, సినిమాకి ప్రచారం చేయకుండా, ప్రేక్షకుల్ని రాకుండా చేసే ఓటీటీలకి ప్రచారం చేయడమేమిటో వాళ్ళకే తెలియాలి. ప్రతీ సినిమాకీ ఇదే తంతు.
అయితే చుట్టుముట్టిన ఇన్ని వివాదాల మధ్య ఇప్పుడు ‘ఆదిపురుష్’ ఓటీటీ వ్యవహారమేమిటో ఇంకా బయటికి రావడం లేదు. కానీ ‘ఆదిపురుష్’ ప్రాపగాండా సినిమా దెబ్బతో రానున్న ప్రాపగాండా సినిమాలకీ గండం తప్పదేమో? మరో రెండు ప్రాపగాండా సినిమాలు జులైలో రాబోతున్నాయి- ‘72 హూరే’, ‘ఆజ్మీర్ 92’. మొదటిది జులై 7 విడుదల, రెండోది జులై 14 విడుదల. ’72 హూరే’ (72 మంది అందమైన కన్యలు) అనేది టెర్రరిస్టు నాయకులు అమాయక యువకుల్ని ఆత్మాహుతి దళాలుగా మార్చడానికి వేసే ఎర. ఆత్మహుతి దాడికి పాల్పడితే స్వర్గంలో 72 అందమైన కన్యలతో సుఖ భోగాలు లభిస్తాయని నమ్మిస్తూ టెర్రరిస్టులుగా మార్చేస్తారు. ఈ అంశాన్ని తీసుకుని మరో ప్రాపగాండా సినిమాగా తీశారు.
ఇక ‘ఆజ్మీర్ 92’ నిజంగా జరిగిన కేసు. 1992 లో రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో దాదాపు 250 మందికి పైగా ముస్లిమేతరుల్ని కొందరు ముస్లిం యువకులు సామూహిక అత్యాచారాలకి, బ్లాక్‌మెయిలింగ్ కీ పాల్పడిన సంచలన కేసుని తీసుకుని మరింకో ప్రాపగాండా సినిమాగా తెరకెక్కించారు. ఇక ఇప్పుడు ఏవగింపు పుట్టించిన ‘ఆదిపురుష్’ ప్రాపగాండా సినిమా నేపథ్యంలో ఈ రెండిటి బాక్సాఫీసు, ఓటీటీ వ్యాపారాలెలా వుంటాయన్నది వచ్చే నెల చూడాల్సిందే.