Telugu Global
Cinema & Entertainment

ఇకపై బెన్‌ఫిట్‌ షోలు ఉండవు

సినీ ప్రముఖులతో తేల్చి చెప్పిన సీఎం రేవంత్‌ రెడ్డి

ఇకపై బెన్‌ఫిట్‌ షోలు ఉండవు
X

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ ముగిసింది. ఈ సందర్భంగా బెనిఫిట్‌ షోలపై సినీ పెద్దలతో సీఎం తన నిర్ణయాన్ని మరోసారి స్పష్టంగా చెప్పారు. ఇకపై బెనిఫిట్‌ షోలకు అనుమతి ఇవ్వబోమని తెలిపారు. అసెంబ్లీలో చెప్పిన మాటకు తాము కట్టబడి ఉంటామన్నారు. తెలంగాణ అభివృద్ధిలో సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతతో ఉండాలని సూచించారు.

బంజారాహిల్స్‌లోని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు ఆధ్వర్యంలో సుమారు 50 మంది సీఎంతో సమావేశమయ్యారు. సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట, అల్లు అర్జున్‌ అరెస్ట్‌ అనంతర పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. సమావేశం ప్రారంభంలో సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన వీడియోను సినీ ప్రముఖుల ముందు సీఎం ప్రదర్శించారు. అనంతరం పలువురు సినీ పెద్దలు తమ అభిప్రాయాలను సీఎంతో పంచుకున్నారు.

శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు

ప్రభుత్వం ఇండస్ట్రీతోనే ఉన్నది. శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. అభిమానులను కంట్రోల్‌ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే. తెలంగాణ అభివృద్ధిలో పరిశ్రమ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. మాదకద్రవ్యాల నియంత్రణపై అవగాహన, మహిళా భద్రతపై ప్రచారంలో సినీ ప్రముఖులు చొరవ చూపెట్టాలి. ఆలయ పర్యాటకం, ఎకోటూరిజంను ప్రచారం చేయాలి. ఇన్వెస్ట్‌మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలి. ఇకపై బౌన్సర్లపై సీరియస్‌గా ఉంటాం. అంతేకాదు బెన్‌ఫిట్‌ షోలు కూడా ఉండవు. దీనిపై అసెంబ్లీలో చెప్పిన మాటలకు మేం కట్టుబడి ఉంటామని సీఎం సీని ప్రముఖలకు స్పష్టం చేశారు.

సినీ పరిశ్రమలో సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం

సినీ పరిశ్రమలో సమస్యల పరిష్కారానికి మంత్రి వర్గం ఉపసంఘం ఏర్పాటు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో టికెట్‌ ధరలు, సినిమా అదనపు షోల నిర్వహణపై చర్చించి నిర్ణయించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. మరోవైపు సినీ పరిశ్రమ తరఫున తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి సభ్యులు ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. సమస్యలు పరిష్కారించాలని కోరారు.

టికెట్‌ ధరలు, బెనిఫిట్ షోలు అనేవి చిన్న విషయాలు: దిల్‌ రాజు

ప్రభుత్వం, సినీ పరిశ్రమకు మధ్య గ్యాప్‌ ఉందనే అపోహలున్నాయని ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సినీ పరిశ్రమ అంశాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చాం. తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచవ్యాప్తం చేయడమే మా లక్ష్యం. ఇండస్ట్రీ అంశాలను మరోసారి భేటీలో చర్చిస్తాం. టికెట్‌ ధరలు, బెనిఫిట్ షోలు అనేవి చిన్న విషయాలు అని దిల్‌రాజు తెలిపారు.


First Published:  26 Dec 2024 12:38 PM IST
Next Story