Telugu Global
Cinema & Entertainment

రాజమౌళి-మహేశ్‌ ప్రాజెక్టు ప్రారంభం!

గురువారం ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో వేడుకగా జరిగినట్లు వార్తలు

రాజమౌళి-మహేశ్‌ ప్రాజెక్టు ప్రారంభం!
X

ప్రముఖ డైరెక్టర్‌ రాజమౌళి, హీరో మహేశ్‌ బాబు కాంబోలో ఒక భారీ ప్రాజెక్టు తెరకెక్కనున్న విషయం విదితమే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉన్నది. నేటి నుంచి ఈ మూవీ అధికారికంగా ప్రారంభమైనట్లు సమాచారం. గురువారం ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో వేడుకగా జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. నగర శివారులోని అల్యుమినియం ఫ్యాక్టరీలో ఈ వేడుక నిర్వహించినట్లు తెలుస్తోంది. చిత్ర బృందంతో పాటు మహేశ్‌బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారంటూ పలు వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా లాంఛ్‌కు సంబంధించి టీమ్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన, ఫొటోలు వెలువడలేదు. మరోవైపు ఈ సినిమా ప్రారంభంపై మహేశ్‌ బాబు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఎండకాలం నుంచి ఈ మూవీ రెగ్యులర్‌ షూట్‌ మొదలుకానున్నదని సమాచారం. సుమారు రెండు భాగాల్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి భాగాన్ని 2027లో విడుదల చేస్తారని టాక్‌ వినిపిస్తున్నది. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాలో ప్రియాంక చెప్రా, పృథ్వీరాజ్‌ సుకుమార్‌ నటించనున్నట్లు సమాచారం. హాలీవుడ్‌ నటీనటులు, టెక్నీషియన్స్‌ కూడా ఈ ప్రాజెక్టులో భాగమైనట్లు వార్తలు వస్తున్నాయి. వీటన్నింటిపై మూవీ టీమ్‌ నుంచి స్పష్టత రావాల్సి ఉన్నది.

ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఇప్పటివరకు చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఈ చిత్రంతో ఆవిష్కరించనున్నారని రచయిత విజయేంద్రప్రసాద్‌ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లోనూ దీనిని అనువదించనున్నారు. దుర్గా ఆర్ట్స్‌ పై కె.ఎల్‌. నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మహేశ్‌ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం గత కొంతకాలంగా ఆయన సన్నద్ధమౌతున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్‌ రాజమౌళి లొకేషన్స్‌ కూడా చూసి వచ్చిన విషయం విదితమే. ఇటీవల ఆయన ఒడిషా వెళ్లి వచ్చారు. కొంతకాలం కిందట ఆఫ్రికా అడవుల్లోనూ ఆయన పర్యటించారు.

First Published:  2 Jan 2025 11:35 AM IST
Next Story