Telugu Global
Cinema & Entertainment

భావోద్వేగానికి గురైన బన్ని

నేను చట్టాన్ని గౌరవించే పౌరుడిని. చట్టానికి కట్టబడి ఉంటానన్న అల్లు అర్జున్

భావోద్వేగానికి గురైన బన్ని
X

చంచల్ గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ జూబ్లిహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తనకు అండగా నిలిచిన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నేను చట్టాన్ని గౌరవించే పౌరుడిని. చట్టానికి కట్టబడి ఉంటాను. బాధిత కుటుంబానికి మరోసారి సానుభూతి తెలుపుతున్నా. నేను సినిమా చూడటానికి వెళ్లినప్పుడు అనుకోకుండా ఘటన జరిగింది. ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. 20 ఏళ్లుగా థియేటర్ కు వెళ్లి సినిమా చూస్తున్నాను. నా సినిమాలే కాదు.. మావయ్య సినిమాలూ చూశాను. బాధిత కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిది. అభిమానం, ప్రేమతో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నేను బాగున్నాను. ఎవరూ ఆందోళన చెందవద్దని అల్లు అర్జున్ తెలిపారు. పుష్ప సినిమా నిర్మాత, డైరెక్టర్‌ సుకుమార్‌ అల్లు అర్జున్‌ ఇంటికి వెళ్లారు. తాజా పరిణామాలపై అల్లు అర్జున్‌, సుకుమార్‌ చర్చిస్తున్నారు.

కన్నీటిపర్వంతమైన బన్ని సతీమణి స్నేహ

తన ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ కు కుటుంబసభ్యులు దిష్టి తీసి స్వాగతం పలికారు. తన కుమారుడు, కుమార్తెను ఎత్తుకొని అల్లు అర్జున్ భావోద్వేగానికి గురయ్యారు. సతీమణి స్నేహ ఆయనను ఆప్యాయంగా ఆలింగం చేసుకుని కన్నీటిపర్వంతమయ్యారు

బెయిల్ వచ్చినా ఆలస్యానికి కారణంపై చర్చలు

జైలు నుంచి విడుదలైన వెంటనే అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ ఆఫీసుకు చేరుకున్నారు. అక్కడ న్యాయవాదుల బృందం ఆయనతో చర్చలు జరిపింది. 45 నిమిషాల పాటు న్యాయవాది నిరంజన్ రెడ్డితో అల్లు అర్జున్ చర్చించారు. బెెయిల్ వచ్చినా విడుదల ఆలస్యంపై చర్చించినట్లు సమాచారం. ఆ తర్వాత ఆఫీసునుంచి అల్లు అర్జున్ తన ఇంటికి చేరుకున్నారు.

First Published:  14 Dec 2024 10:00 AM IST
Next Story