నిర్మాతలు ఫిక్స్ చేసిన కొత్త రేట్లు ఇవే
నిర్మాతలంతా కలిసి ఏపీ-నైజాంలో టికెట్ రేట్లు సవరించారు. మరి ఈ సవరించిన టికెట్ రేట్లకు ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా?
నిర్మాతల చర్చలు దాదాపు ఓ కొలిక్కి వచ్చాయి. కీలకమైన టికెట్ రేట్లు, ఓటీటీ అంశాలపై నిర్మాతలంతా ఏకాభిప్రాయానికొచ్చారు. తాము తీసుకున్న నిర్ణయాన్ని ఫిలింఛాంబర్ వేదికగా ప్రకటించారు. టికెట్ రేట్లపై నిర్మాతలు తీసుకున్న నిర్ణయాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ, ఏపీలో చిన్న సినిమాలకు A-సెంటర్, B-సెంటర్స్‌లో సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100, మల్టీప్లెక్సుల్లో రూ.125 టికెట్ రేటు పెట్టాలని నిర్ణయించారు. అదే C-సెంటర్ థియేటర్లలో సింగిల్ స్క్రీన్ రూ.70, మల్టీప్లెక్స్ రూ.125గా నిర్ణయించారు.
ఇక మీడియం బడ్జెట్ మూవీస్ విషయానికొస్తే.. A-సెంటర్లు, B-సెంటర్లలోని థియేటర్లలో సింగిల్ స్క్రీన్స్ కు రూ.112, రూ.177 గా ఫైనల్ చేశారు. C-సెంటర్స్‌లో రూ. 100, రూ. 177గా ఫైనల్ చేశారు. పెద్ద బడ్జెట్ సినిమాల విషయానికొస్తే.. A-సెంటర్లు, B-సెంటర్లలో రూ. 177, రూ. 295 గా ఫైనల్ చేశారు. C-సెంటర్ స్క్రీన్స్ లో రూ. 150, రూ.295 గా నిర్ణయించారు.
సవరించిన టికెట్ రేట్లు అన్నీ ఆగస్ట్ 1 నుంచి అమల్లోకి వస్తాయని నిర్మాతల మండలి ప్రకటించింది. అంతా బాగానే ఉంది కానీ ఈ రేట్లకు ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా అనేది సందేహం. ఎందుకుంటే, ప్రస్తుతం A-సెంటర్లు, B-సెంటర్లలోని థియేటర్లలో చూసుకుంటే దాదాపు ఇవే రేట్లు నడుస్తున్నాయి.
మొన్న రిలీజైన థాంక్యూ సినిమాకు A-సెంటర్లలోని సింగిల్ స్క్రీన్స్ లో 150 రూపాయలు ఛార్జ్ చేశారు. ఈ వీకెండ్ రాబోతున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు A-సెంటర్లలోని సింగిల్ స్క్రీన్స్ లో ఇదే రేటు పెట్టారు. నిర్మాతలు పెట్టిన టికెట్ రేట్లలో గరిష్టంగా 177 రూపాయలుంది. అంటే.. 150 రూపాయలు పెట్టుకోవచ్చన్నమాట. ఈ రేట్లకు ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదని తెలిసిన తర్వాత, తిరిగి అవే రేట్లు ఫిక్స్ చేయడంలో నిర్మాతల ఆంతర్యం ఏంటో వాళ్లకే తెలియాలి. అయితే తాజాగా నిర్ణయించిన టికెట్ రేట్లు ఫైనల్ కాదని, వాటిపై 27వ తేదీన తిరిగి చర్చిస్తామని ప్రకటించారు నిర్మాత సి.కల్యాణ్.