Neha Shetty | బుజ్జిగా మారిన రాధిక
Neha Shetty - గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చేసింది నేహా శెట్టి. ఇందులో తన పాత్ర తీరుతెన్నుల్ని వివరించింది.
విశ్వక్ సేన్ హీరోగానటిస్తున్న చిత్రం "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి". సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ప్రముఖ కంపోజర్ యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. భారీ అంచనాలతో మే 31 న "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించింది హీరోయిన్ నేహా శెట్టి.
"డైరెక్టర్ నాకు శోభన గారిని రిఫరెన్స్ గా చూపించాడు. చీరకట్టు, జుట్టు, కళ్ళ కాటుక ఇలా ప్రతి దాని మీద ఎంతో శ్రద్ధ పెట్టాం. 90ల కాలానికి తగ్గట్టుగా నా ఆహార్యాన్ని మార్చుకోవడమే కాకుండా.. అప్పటి నటీమణుల అభినయం ఎలా ఉండేదో తెలుసుకొని, దానికి తగ్గట్టుగా హావభావాలు పలికించాను. నేను ఇప్పటివరకు ఎక్కువగా మోడ్రన్ పాత్రలే చేశాను. కానీ బుజ్జి పాత్ర అలా కాదు. అందుకే దానికి తగ్గట్టుగా హోంవర్క్ చేశాను. అయితే యాస విషయంలో మాత్రం నేను ఎటువంటి హోంవర్క్ చేయలేదు. ఎందుకంటే బుజ్జి అనేది ధనవంతుల అమ్మాయి పాత్ర కాబట్టి.. రత్న పాత్రలాగా మాటల్లో పెద్దగా యాస ఉండదు. పైగా మాటల కంటే ఎక్కువగా కళ్ళతోనే భావాలను పలికించే పాత్ర ఇది. ఈ బుజ్జి పాత్ర నాకు ఎంతగానో పేరు తెచ్చి పెడుతుంది."
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో విశ్వక్ సేన్ పాత్ర నిడివి 50శాతం ఉంటే, తన పాత్ర 25 శాతం, అంజలి పాత్ర 25 శాతం ఉంటుందని స్పష్టం చేసింది నేహా శెట్టి.