Telugu Global
Cinema & Entertainment

జాతీయ అవార్డులు ఇక ఇందిర, నర్గీస్ పేరిట ఉండవు!

జాతీయ చలనచిత్ర అవార్డుల పేర్లలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. ఇందిరాగాంధీ పేరిట ఇస్తున్న ఉత్తమ నూతన దర్శకుడు అవార్డు, నర్గీస్ దత్ పేరిట ఇస్తున్న ఉత్తమ జాతీయ సమగ్రత చలన చిత్రం అవార్డు పేర్లని మార్చింది.

జాతీయ అవార్డులు ఇక ఇందిర, నర్గీస్ పేరిట ఉండవు!
X

జాతీయ చలనచిత్ర అవార్డుల పేర్లలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. ఇందిరాగాంధీ పేరిట ఇస్తున్న ఉత్తమ నూతన దర్శకుడు అవార్డు, నర్గీస్ దత్ పేరిట ఇస్తున్న ఉత్తమ జాతీయ సమగ్రత చలన చిత్రం అవార్డు పేర్లని మార్చింది. ఇందిరాగాంధీ పేరిట ఇస్తున్న అవార్డుని ‘ఉత్తమ నూతన దర్శకుడు’ అవార్డుగా, నర్గీస్ దత్ పేరిట ఇస్తున్న అవార్డుని 'జాతీయ, సామాజిక - పర్యావరణ విలువల ఉత్తమ చలనచిత్రం’ అవార్డుగా ఇవ్వాలని ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫార్సు చేసింది. అలాగే ‘ఉత్తమ నూతన దర్శకుడు’ అవార్డు కిస్తున్న మొత్తాన్ని రూ. 3 లక్షలకు పెంచాలని, రజత పతకం లభించే 'జాతీయ, సామాజిక - పర్యావరణ విలువల ఉత్తమ చలనచిత్రం’ అవార్డుకి నిర్మాతకు, దర్శకుడికి ఒకొక్కరికి ఇస్తున్న మొత్తాన్ని రూ. లక్షన్నర నుంచి రూ. 2 లక్షలకు పెంచాలనీ కమిటీ సిఫార్సు చేసింది. ఇక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచాలని కూడా కమిటీ సిఫార్సు చేసింది.

కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (ఐ అండ్ బి) అదనపు కార్యదర్శి నీరజా శేఖర్‌ నేతృత్వంలో హేతుబద్ధీకరణ కమిటీని నియమించారు. ఇందులో నిర్మాతలు ప్రియదర్శన్, విపుల్ షా, హౌబాం పబన్ కుమార్, కేంద్రీయ సెన్సార్ బోర్డు అధ్యక్షుడు ప్రసూన్ జోషి, ఛాయాగ్రహకుడు ఎస్. నల్లముత్తు, ఐ అండ్ బి సంయుక్త కార్యదర్శి పృథుల్ కుమార్, ఐ అండ్ బి ఆర్థిక శాఖ డైరెక్టర్ కమలేష్ కుమార్ సిన్హా వున్నారు.

కోవిడ్ మహమ్మారి సమయంలో మార్పులపై కమిటీ చర్చించిందని, ఈ మార్పులు చేయాలనే నిర్ణయం ఏకగ్రీవంగా జరిగిందనీ కమిటీ సభ్యుడొకరు తెలిపారు. కాగా, ఇతర మార్పుల్లో ఉత్తమ యానిమేషన్ ఫిలిం, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ కేటగిరీలని కలిపి 'ఉత్తమ ఎవిజిసి ఫిలిం’ అనే కొత్త కేటగిరీని సృష్టించడం జరిగింది.

ఉత్తమ నటుడు, నటి, సహాయ నటుడు, సహాయ నటి అవార్డుల పేర్లు కూడా మార్చారు. బహుమతి మొత్తాలు కూడా పెంచారు. అదనంగా, ఉత్తమ ఆడియోగ్రఫీ, ఉత్తమ సంగీత దర్శకుడు వంటి వర్గాలకు మార్పులు చేశారు.

ఉత్తమ నటుడి అవార్డు (రూ. 50,000తో రజత్ కమల్) పేరుని 'ప్రధాన పాత్రలో ఉత్తమ నటుడు' (రజత కమలం /రూ. 2 లక్షలు) గా; ఉత్తమ నటి (రూ. 50,000తో రజత కమలం) పేరుని 'ప్రధాన పాత్రలో ఉత్తమ నటి' (రూ. 2 లక్షలతో రజత కమలం) గా; ‘ఉత్తమ సహాయ నటుడు’ అవార్డు (రూ. 50,000 తో రజత కమలం) పేరుని 'సహాయక పాత్రలో ఉత్తమ నటుడు' (రూ. 2 లక్షలతో రజత కమలం) గా; ‘ఉత్తమ సహాయ నటి అవార్డుని 'సహాయక పాత్రలో ఉత్తమ నటి' (రజత్ కమలంతో రూ. 2 లక్షలు) గా మార్పులు చేశారు.

ఉత్తమ ఆడియోగ్రఫీ విభాగంలో, మూడు ఉప-కేటగిరీలు - లొకేషన్ సింక్ సౌండ్ రికార్డిస్టు(సింక్ సౌండ్ కోసం మాత్రమే), సౌండ్ డిజైనర్, ఫైనల్ మిక్స్డ్ ట్రాక్ రికార్డిస్టు - కలిపి 'బెస్ట్ సౌండ్ డిజైన్'గా రీబ్రాండ్ చేశారు. రజత కమలంతో సౌండ్ డిజైనర్‌ కి రూ. 2 లక్షలు లభిస్తాయి. అదేవిధంగా, ఉత్తమ సంగీత దర్శకుడు (నేపథ్య సంగీతం) అవార్డుగా రజత కమలంతో రూ. 2 లక్షలు లభిస్తాయి.

రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లో పేర్కొన్న ప్రతి భాషలో ఉత్తమ ఫీచర్ ఫిలిం అవార్డుని 'ఉత్తమ (భాష పేరు) ఫీచర్ ఫిలిం’'గా మార్చారు.అవార్డు డబ్బు రెండింతలు పెంచి రూ. 2 లక్షలు నిర్ణయించారు. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లో పేర్కొన్నవి కాకుండా ఇతర ‘ప్రతి భాషలో ఫీచర్ ఫిలిం' కేటగిరీకి ఇలాంటి మార్పులే చేశారు.

అవార్డుల ప్రతిష్టని నిలబెట్టుకోవడానికి అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే షేర్డ్ అవార్డులతో, కేటగిరీకి ఒక అవార్డు మాత్రమే ఇవ్వాలని కమిటీ సిఫార్సు చేసింది. స్వర్ణకమలం విజేతలకి రూ.3 లక్షలు, రజత్ కమలం విజేతలకు రూ.2 లక్షలుగా ఏకీకృత నగదు అవార్డుల్ని నిర్ణయించారు.

కాగా, అవార్డుల 70వ ఎడిషన్ ఈ ఏడాది జరగనుంది. కమిటీ సిఫార్సుల ఆధారంగా ఈ ఎడిషన్ కోసం ఎంట్రీలు కోరుతూ ప్రకటన కూడా వెలువడింది.

First Published:  17 Feb 2024 2:54 PM IST
Next Story