Telugu Global
Cinema & Entertainment

సినిమా పండుగ తెలుగు రాష్ట్రాల్లో లేదు

మల్టీ ప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండవ నేషనల్ సినిమా డే రేపే ప్రారంభమవుతోంది.

సినిమా పండుగ తెలుగు రాష్ట్రాల్లో లేదు
X

మల్టీ ప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండవ నేషనల్ సినిమా డే రేపే ప్రారంభమవుతోంది. అక్టోబర్ 13 వ తేదీ శుక్రవారం ఉదయం నుంచి దేశవ్యాప్తంగా 4000 స్క్రీన్ లలో ఈ పండుగ జరుగుతోంది. ఈ రోజంతా రూ. 99 టికెట్ ధరకే సినిమాలు చూడొచ్చు. అయితే ఈ పండుగలో తెలుగు రాష్ట్రాలు పాల్గొనడం లేదు. గత సంవత్సరం కూడా పాల్గొనలేదు. ఈ సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో బాటు తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి రాష్ట్రాల్ని మినహాయించారు. టికెట్ల ధరలపై ఈ రాష్ట్రాల్లో ప్రస్తుతమున్న ప్రభుత్వ నిబంధనల కారణంగా పండుగ నిర్వహించడానికి ఆస్కారంలేదని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎంఏఐ) తెలిపింది. అయితే ఈ సందర్భంగా మినహాయింపు పొందిన రాష్ట్రాల్లో మల్టీప్లెక్సుల్లో తినుబండరాలపై ప్రకటించిన ఆఫర్లపై మాత్రం ఎలాటి మార్పు వుండదని తెలిపింది.

తక్కువ టిక్కెట్ ధరల కారణంగా, గత సంవత్సరం మొదటి జాతీయ సినిమా దినోత్సవం విస్తృత ప్రపంచ మీడియా కవరేజీని పొందింది. అయితే, ఈ సంవత్సరం అంతర్జాతీయ ఈవెంట్ లా కాకుండా ఐమాక్స్, 4 డీఎక్స్, రిక్లెయినర్ సీట్లు వంటి ప్రీమియం స్క్రీనింగ్స్ కి తగ్గింపు వర్తించదు. సినిమా పండుగ సందర్భంగా అమెరికాలో ప్రీమియం స్క్రీనింగ్స్ కి కూడా తగ్గింపు వర్తిస్తుంది. మన దేశంలో గతేడాది టికెట్టు ధర రూ. 75 గా నిర్ణయించారు. పండుగ సినిమా ప్రదర్శనలు ఉదయం 6 గంటలకు ప్రారంభమైనప్పుడు రోజంతా, 65 లక్షల మంది ప్రేక్షకులు మల్టీప్లెక్సుల్ని సందర్శించినట్టు ఎంఏఐ అంచనా వేసింది. రూ. 48 కోట్లు కలెక్షన్లు వచ్చాయి. దాదాపు అన్ని షోలు 85-90% ఆక్యుపెన్సీతో హౌస్‌ఫుల్‌గా సాగాయి.

గత సంవత్సరం అమెరికాలో మొదటి నేషనల్ సినిమా డేకి 81 లక్షల మంది ప్రేక్షకులు హాజరయ్యారు. టికెట్టు ధర 4 డాలర్లు. 32.4 మిలియన్ డాలర్ల కలెక్షన్ వచ్చింది. ఈ సంవత్సరం రెండవ సినిమా దినోత్సవం ఆగస్టు 27 వ తేదీనే నిర్వహించారు. 85 లక్షల మంది ప్రేక్షకులు హాజరయ్యారు. 34 మిలియన్ డాలర్ల కలెక్షన్ వచ్చింది. బ్రిటన్ లో రెండవ నేషనల్ సినిమా డే సెప్టెంబరు 2 న నిర్వహించారు. 10 లక్షల 56 వేల మంది ప్రేక్షకులు హాజరయ్యారు. 4.65 మిలియన్ పౌండ్లు ఆర్జించింది. గత సంవత్సరం తో పోలిస్తే ఇది 6% పెరుగుదల. 630కి పైగా సినిమాహాళ్ళ లో 3 పౌండ్లకే టికెట్లు విక్రయించారు.

మన దేశంలో పీవీఆర్ - ఐనాక్స్, మీరజ్, సిటీ ఫ్రైడ్, ఏషియాటిక్, ముక్తా ఏ2, మూవీ టైమ్, వేవ్, డిలైట్ మొదలైన మల్టీప్లెక్సులు ఈ ఈవెంట్ లో పాల్గొంటున్నాయి. ఇప్పటికే ఈ మల్టీప్లెక్సులు తమ వెబ్‌సైట్ బ్యానర్‌లని అప్‌డేట్ చేశాయి. కోవిడ్ మహమ్మారి వల్ల మల్టీప్లెక్సులు మూతబడి తిరిగి తెరుచుకున్నప్పుడు, అపారంగా ఆదరించిన ప్రేక్షకులకి కృతజ్ఞతా పూర్వకంగా గత సంవత్సరం నుంచి అంతర్జాతీయంగా నేషనల్ సినిమా డే నిర్వహిస్తున్నారు.

అక్టోబర్ 13న మినహాయింపు పొందిన రాష్ట్రాల్లో గాకుండా ఇతర రాష్ట్రాల్లోని మల్టీప్లెక్షుల్లో రూ. 99 లకే, సెప్టెంబర్ లో విడుదలై విజయవంతంగా నడుస్తున్న షారుఖ్ ఖాన్ ‘జవాన్’, గత వారమే విడుదలైన అక్షయ్ కుమార్ ‘మిషన్ రాణిగంజ్’ సినిమాలని కూడా చూడొచ్చు. ఇవి గాక ఇదివరకే విడుదలైన ‘ది వాక్సిన్ వార్’, ‘గదర్ 2’, ‘దోనో’, ‘80’, ‘ది ఎగ్జార్ సిస్ట్: బిలీవర్’ కూడా చూడొచ్చు.

సినిమా దినోత్సవపు రాయితీతో ప్రయోజనం పొందాలని కొందరు హిందీ సినిమాల చిన్న నిర్మాతలు తమ సినిమాల్ని అక్టోబర్ 13 న విడుదల చేస్తున్నారు. ఫుక్రే3, అబ్ తో సబ్ భగవాన్ భరోసే, దర్రాన్ చూ, గుథ్లీ లడూ, సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ, ధక్, ధక్, బాంబే ది ఫిల్మ్ మొదలైనవి. గత సంవత్సరం దుల్కర్ సల్మాన్ నటించిన హిందీ ‘చుప్’, ‘సీతారామం’ హిందీ, ‘ధోకా’, ‘అవతార్’ మూడూ సినిమా డేకి మంచి వసూళ్ళు సాధించాయి.

ఇప్పటికే ‘జవాన్’, ‘మిషన్ రాణిగంజ్’, ‘ఫుఖ్రే3’ అడ్వాన్స్ బుకింగ్స్ లో 3 లక్షల 10 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. ‘ఫుఖ్రే 3’ కి అత్యధికంగా లక్షా పాతిక వేల టికెట్లు అమ్ముడయ్యాయి. అంటే మొదటి రోజే కోటీ 23 లక్షల 75 వేలు వసూలైనట్టు. ఇంకో రోజు విడుదల చేసి వుంటే ఈ చిన్న సినిమాకి ఇందులో సగం కూడా వసూలయ్యేది కాదు. ‘మిషన్ రాణిగంజ్’ లక్షా మూడు వేలు, ‘జవాన్’ 83 వేలు టికెట్లు అమ్ముడయ్యాయి.

రూ. 99 ధరతో టిక్కెట్ కొనుగోలుపై అదనపు ఛార్జీలు, జీఎస్టీ వగైరా వుండవని ఎంఏఐ తెలిపింది.

First Published:  12 Oct 2023 6:00 AM GMT
Next Story