Telugu Global
Cinema & Entertainment

మేము మీ జోలికి రాము : ఓటీటీలకు ట్రాయ్ భారీ ఊరట!

టెలికాం రెగ్యులేటరీ ఆధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తాజాగా రూపకల్పన చేసిన ‘నేషనల్ బ్రాడ్‌కాస్టింగ్ పాలసీ (ఎన్ బి పి) 2024’ సిఫార్సుల్లో ఓటీటీలకు భారీ ఊరట లభించింది.

మేము మీ జోలికి రాము : ఓటీటీలకు ట్రాయ్ భారీ ఊరట!
X

టెలికాం రెగ్యులేటరీ ఆధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తాజాగా రూపకల్పన చేసిన ‘నేషనల్ బ్రాడ్‌కాస్టింగ్ పాలసీ (ఎన్ బి పి) 2024’ సిఫార్సుల్లో ఓటీటీలకు భారీ ఊరట లభించింది. ఎన్ బి పి లో ఓటీటీ సేవల్ని చేర్చడాన్ని ఓటీటీ వర్గాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ, ట్రాయ్ గత సంవత్సరం ఓటీటీ కమ్యూనికేషన్ సేవల నియంత్రణ ఫ్రేమ్‌వర్క్- ఓటీటీ సేవల ఎంపిక నిషేధంపై ఒక కన్సల్టేషన్ పేపర్‌ని ప్రచురించింది. తాజాగా ప్రకటించిన దీని సిఫార్సు పత్రంలో, ట్రాయ్ అటువంటి నియంత్రణని ఏదీ సూచించలేదు. దీంతో ఓటీటీ వర్గాలు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. నెట్ ఫ్లిక్స్, అమెజాన్, జియో సినిమా వంటి అనేక ఓటీటీ సేవలపై ఇక ఎటువంటి ట్రాయ్ నియంత్రణ లేనట్టే!

ట్రాయ్ ఓవర్-ది-టాప్ (ఒటీటీ ) యాప్ రెగ్యులేటరీ మెకానిజమ్ సిఫార్సులపై పనిచేస్తున్నట్లు సూచించిన ఒక నెల లోపు ఓటీటీ వర్గాలకు ఉపశమనం ఇచ్చింది. ఎన్ బి పి 'విజన్, మిషన్ అండ్ గోల్స్' గురించి విడుదల చేసిన నేషనల్ బ్రాడ్‌కాస్టింగ్ పాలసీ సూత్రీకరణపై ప్రభుత్వానికి చేసిన సిఫార్సుల్లో, ఓటీటీల్ని ట్రాయ్ నియంత్రించడం గురించి గానీ, ఓటీటీలకి లైసెన్సింగ్ అవసరాల గురించి గానీ ప్రస్తావించలేదు.

ఓటీటీ యాప్‌ల రెగ్యులేటరీ మెకానిజమ్ సిఫార్సులపై ట్రాయ్ పనిచేస్తోందని గత నెలలో దాని ఛైర్మన్ అనిల్ కుమార్ లాహోటీ ప్రకటించారు. ఇంతలో ఎన్ బి పి పై ట్రాయ్ నిర్వహించిన బహిరంగ చర్చలో, ఓటీటీ ప్రతినిధులు కంటెంట్ సృష్టికర్తలకి స్వేచ్ఛ వుండేలా చూడాలని, ప్రసారకర్తలు ఎలాంటి ఒత్తిడికి గురికాకూడదనీ ట్రాయ్ ని కోరారు.

ట్రాయ్ తాజా సిఫార్సుల్లో టెలివిజన్, రేడియో, ఓటీటీ ప్రసార సేవల కోసం పారదర్శక, విశ్వసనీయ ప్రేక్షకుల వ్యూస్, రేటింగ్ వ్యవస్థని ఏర్పాటు చేయడానికి చేసిన సిఫార్సుల్ని ఓటీటీ ప్రతినిధులు ఆమోదించారు. ఎన్ బి పి -2024 సిఫార్సులు సరైన దిశలో అడుగులు వేసినట్లు కనిపిస్తున్నాయని, ఈ విధానం వృద్ధిని పెంపొందించే, నాణ్యతని సృష్టించడానికి కంటెంట్ సృష్టికర్తల్ని శక్తిమంతం చేసే, ఎకోసిస్టమ్‌ని రూపొందించడానికి ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. పరిశ్రమ ఎదుగుదలకి సృజనాత్మక స్వేచ్ఛ కీలకం అయితే, నాణ్యత లేని నకిలీ లేదా కాపీ కంటెంట్ సృష్టించకుండా, లేదా ప్రసారం చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు కంటెంట్ సృష్టికర్తలపై, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లపై వుందనీ చెప్పారు. దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని, దాని మానవీయ విలువల్ని గౌరవించాల్సిన అవసరం వుందనీ స్పష్టం చేశారు.

మొత్తం మీద, ఎన్‌బిపిపై ట్రాయ్ సిఫార్సులు, సూత్రీకరణలు చాలా ప్రగతిశీలమైనవని అభిప్రాయపడ్డారు.

ఓటీటీ రంగాన్ని నియంత్రించాలనే ఉద్దేశం ఏదీ ట్రాయ్ పత్రంలో వ్యక్తం కాకపోవడం స్వాగతించదగిన మార్పు. ఇప్పుడిప్పుడే పరిశ్రమ పరిపక్వం చెందుతోంది. దీని స్వయం నియంత్రణకి దాని సొంత యంత్రాంగాల్ని అదే కనుగొంటుంది. పై నుంచి ప్రభుత్వం రుద్దనవసరం లేదు. దేశంలో ఓటీటీ పరిశ్రమ కొత్తది. అది ఎదగడానికి, దానికంటూ ఒక పునాదిని కనుగొనడానికీ తగినంత స్పేస్ అవసరం. అది ఒక నిర్దిష్ట పరిపక్వత స్థాయికి చేరుకున్న తర్వాత, అటువంటి నియంత్రణ ముఖ్యం కావొచ్చు, ఇప్పుడు కాదు. ఈ ప్రారంభ దశలో చాలా ఓటీటీలు ఇన్వెస్ట్‌మెంట్ సమస్యలతో వున్నాయి. ఇటువంటి ఏ ఓటీటీలు కూడా లైసెన్స్ రుసుముల్ని చెల్లించడానికి తగినంత డబ్బుని సంపాదిస్తున్నాయని చెప్పడానికి లేదు. ఈ సన్నివేశంలో ఏదైనా నియంత్రణ వస్తే, అది అన్ని ఓటీటీలకూ అస్తిత్వ సమస్యే కాగలదు.

మానిటైజేషన్ అవకాశాల పరంగా ఓటీటీలు ఇప్పటికీ తిప్పలు పడుతున్నాయని, ఇవి పరిపక్వ దశకి చేరుకోవడానికి మరో 4-5 సంవత్సరాలు పడుతుందనీ నిపుణులు చెబుతున్నారు.

ఇంకేం చెబుతోంది ట్రాయ్?

ట్రాయ్ సిఫార్సులు ఇంకా ఏం చెబుతున్నాయో చూద్దాం : ఓటీటీ ప్లాట్‌ఫారంలు ఆడియో-విజువల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారంలు. ఇవి కంటెంట్ హోస్టులుగా ప్రారంభమయ్యాయి. అయితే వెబ్ సిరీస్‌లు, ఫీచర్ ఫిలింలు, డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిలింలు వంటి కంటెంట్ సృష్టిలో, పంపిణీలో వేగంగా విస్తరించాయి. ఓటీటీల్నినియంత్రించడానికి వినియోగదారుల సంఘాలు లాబీయింగ్ చేస్తున్నందున ఓటీటీలపై నిబంధనలు దేశంలో చర్చనీయాంశంగా వున్నాయి. అయితే కన్వర్జ్డ్ లీగల్, అడ్మినిస్ట్రేటివ్, రెగ్యులేటరీ, లైసెన్సింగ్ ఫ్రేమ్‌వర్క్ ని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. బదులుగా, అనుమతులు కోరే ప్రక్రియని క్రమబద్ధీ

కరించడం ద్వారా సెక్టార్‌లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఓడీబీ) ని ప్రోత్సహించడంపై దృష్టి పెట్టాలి. ఈఓడీబీని ప్రోత్సహించే మార్గాలలో ఒకటి మౌలిక సదుపాయాల స్థితిని మంజూరు చేయడం. ఇలా దేశంలో ఓటీటీ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి అనేక విధాన సిఫార్సుల్ని జోడించింది.

ఓటీటీ ఉదయిస్తున్న రంగం కావడంతో ముందు చూపుతో పాలసీ విధానం అవసరమని పేర్కొంది. ఓటీటీ అనేది పుల్-ఆధారిత మాధ్యమని, కాబట్టి ఓటీటీలకి చట్టపరమైన ప్రసార నిబంధనల్ని బదిలీ చేయడం ఈఓడీబీని ప్రభావితం చేస్తుందనీ, వృద్ధికి ఆటంకం కలిగిస్తుందనీ ట్రాయ్ పేర్కొంది.

వినియోగదార్ల విభిన్న అవసరాల్ని తీర్చడం కోసం నాణ్యమైన కంటెంట్ సృష్టిని సులభతరం చేసేందుకు సహకరించడంతో బాటు, ప్రసార రంగపు స్థిరమైన అభివృద్ధి కోసం పోటీతత్వంతో కూడిన, సరసమైన - సర్వవ్యాప్త పర్యావరణ వ్యవస్థని పెంపొందించడానికీ తగిన సిఫార్సులు చేసినట్టు ట్రాయ్ తెలిపింది.

ఎన్ బి పి -2024 రాబోయే 5 సంవత్సరాలపై దృష్టి పెట్టి. 10 సంవత్సరాల పాటు విస్తృత రోడ్‌మ్యాప్‌ని లక్ష్యంగా చేసుకుంటుందని జోడించించింది. ఇది స్థానికంగానూ ప్రపంచ

వ్యాప్తంగానూ భారతీయ కంటెంట్ విస్తరణని ప్రోత్సహించడం ద్వారా, టెలివిజన్ తో బాటు ఓటీటీ ప్రసార సేవల కోసం నాణ్యమైన కంటెంట్‌ ఉత్పత్తి జరిగేలా చూసేందుకు తోడ్పడుతుందని పేర్కొంది. చలనచిత్రాలు, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, మ్యూజిక్ వగైరా రంగాల్లో భారతీయ కంటెంట్ ఉత్పత్తిని ప్రోత్సహించాలని సిఫార్సు చేసింది.

పోతే, దూరదర్శన్, ఆలిండియా రేడియో ఛానెల్‌ల కంటెంట్ ప్రమోషన్ కోసం ప్రసార భారతి ద్వారా ఓటీటీల్ని అభివృద్ధి చేయాలని ట్రాయ్ కోరింది. దూరదర్శన్ దాని గుణాత్మక కంటెంట్ ఆర్కైవ్‌లని ఉపయోగించుకోవాలని, ఓటీటీల మహారాజ పోషకులైన యువ ప్రేక్షకుల కోసం దాన్ని మళ్ళీ ప్రారంభించాలనీ కోరింది. కాపీరైట్ రక్షణ విధానాల ద్వారా వాటాదారుల ప్రయోజనాల్ని పరిరక్షించే నిబంధనల్ని కూడా అందించింది.

First Published:  23 Jun 2024 2:17 PM IST
Next Story