Phalana Abbayi Phalana Ammayi - నాగశౌర్య కొత్త సినిమా టీజర్ ఎలా ఉందంటే!
Phalana Abbayi Phalana Ammayi Teaser - నాగశౌర్య కొత్త సినిమా ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. ఈ మూవీ టీజర్ రిలీజైంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'. టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మాతలు. వరుస విజయాలతో దూసుకుపోతున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహిస్తున్నాడు.
'కళ్యాణ వైభోగమే' చిత్రంతో వెండితెరపై మ్యాజిక్ చేసిన హిట్ జోడి నాగశౌర్య, మాళవిక నాయర్ ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. నాగశౌర్య, శ్రీనివాస్ అవసరాల కలయికలో వస్తున్న మూడో సినిమా ఇది. ఇప్పటికే విడుదలైన 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వచ్చింది. తాజాగా టీజర్ విడుదలైంది.
"ఇందుమూలంగా యావత్ ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా.. సంజయ్ పీసుపాటి మరియు అనుపమ కస్తూరి బెస్ట్ ఫ్రెండ్స్ అహో" అంటూ టీజర్ ప్రారంభమైన తీరు ఆకట్టుకుంది. "పాత్రకు అవసరమైతే ఎక్స్ పోజింగ్ కూడా చేస్తా" అని హీరో అనడం, "పెళ్ళైన తర్వాత కూడా నటిస్తా" అని హీరోయిన్ చెప్పడం చూస్తుంటే.. నటీనటుల మధ్య ఓ అందమైన ప్రేమకథ చూడబోతున్నామని అర్థమవుతోంది.
టీజర్ లో ప్రతి ఫ్రేమ్ అందంగా పెయింటింగ్ లా ఉంది. ఇక కళ్యాణి మాలిక్ సంగీతం టీజర్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో వచ్చిన గత రెండు చిత్రాలకూ ఇతడే సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని మార్చి 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.