ఆ ఇద్దరి బదులు ఈ ఇద్దరు
ఒకప్పుడు కెవి మహదేవన్, చక్రవర్తి, సత్యం వంటి సంగీత దర్శకులు ఒకొక్కరూ ఏడాదికి 30 సినిమాలకి సంగీతం అందించినా ఆ పాటలన్నీ హిట్టయ్యేవి.
ఒకప్పుడు కెవి మహదేవన్, చక్రవర్తి, సత్యం వంటి సంగీత దర్శకులు ఒకొక్కరూ ఏడాదికి 30 సినిమాలకి సంగీతం అందించినా ఆ పాటలన్నీ హిట్టయ్యేవి. ఇప్పటికీ అవి నిలిచిపోయిన పాటలు. కానీ ఇప్పుడు ఏడాదికి ఓ రెండు సినిమాలకు సంగీతం అందించే ఇద్దరు టాప్ సంగీత దర్శకులు ప్రేక్షకులకి బోరు కొట్టేస్తున్నారు. ‘ఇక మాకొద్దు బాబో, అనిరుధ్ ని తీసుకు రండి’- అని సోషల్ మీడియాలో స్టార్స్ కి, నిర్మాతలకి మొర పెట్టుకుంటున్నారు.
అనిరుధ్ రవిచందర్ పదేళ్ళ క్రితమే ధనుష్ మీద చిత్రీకరించిన ‘వై దిస్ కొలవెరీ డి’ పాటతో తెలుగులోనూ పిచ్చెత్తించి, ఇప్పటికీ ప్రతీ యేటా కొత్త కొత్త పాటలతో అదే పిచ్చిని వైరల్ చేస్తున్నాడు. తమిళంలోనే కాదు, తమిళం దాటి హిందీకి కూడా వెళ్ళిపోయి షారుఖ్ ఖాన్ ‘జవాన్’ తో అక్కడా అలజడి సృష్టించాడు. ఇంకా ఈ యేడాది తమిళంలో రజనీకాంత్ ‘జైలర్’, విజయ్ ‘లియో’ లకూ చార్ట్ బస్టర్ సంగీతం అందించి ఏఆర్ రెహ్మాన్ ని దాటిపోయాడు- పారితోషికం విషయంలో కూడా!
‘జవాన్’ కి 10 కోట్లు తీసుకున్న అనిరుధ్ అదే మొత్తాన్ని తమిళంలో డిమాండ్ చేస్తున్నాడు. అయినా తమిళంలో డిమాండ్ తగ్గలేదు. తెలుగులో సంగీతం తమ స్టార్ సినిమాలకి ప్లస్ కావడం లేదని తెలుసుకున్న కొందరు తెలుగు అగ్ర నిర్మాతలు అనిరుధ్ వెంట పడ్డారు. అతడి 10 కోట్ల డిమాండ్ చూసి షాకయ్యారు. అంతేకాదు, ఇచ్చినప్పుడు పాట తీసుకోవాలని కండిషన్. కమల్ హాసన్ ‘ఇండియన్ 2’, అజిత్ ‘విడా’ సినిమాలకి బుక్కయిన అనిరుధ్ ని, జూనియర్ ఎన్టీఆర్ తో ‘దేవర’ కోసం దర్శకుడు కొరటాల శివ కూడా తీసుకున్నాడు. కానీ పాటలు ఎప్పుడిస్తాడో తెలియక టెన్షన్ పడుతున్నాడు.
దక్షిణాదిలోనే కాదు ‘జవాన్’ తర్వాత ఉత్తరాదిలోనూ డిమాండ్ తెచ్చుకున్న అనిరుధ్ రవిచందర్ ని సంగీత దర్శకుడిగా తీసుకోవాలంటే నిర్మాతలకు అదో సినిమా తీసినంత పనిగా కనిపిస్తోంది. పది కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడనే టాక్ నేపథ్యంలో అంత ఇవ్వడానికి కూడా సిద్ధంగా వున్న నిర్మాతలు చాలా మంది వున్నారు. ఇంతా చేసి పక్కా ప్లానింగ్ ప్రకారం అతని దగ్గర ట్యూన్లు తీసుకోవడం, బీజీఎమ్ (బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్) చేయించుకోవడం అంత సులభం కాదు. అయితే జరిగేదేమిటంటే, అందరూ అతడి వెంటపడితే పాటల క్వాలిటీ క్షీణిస్తుంది. ఒత్తిడిలో అతను ఏదో సృష్టిస్తాడు. దాంతో అతనూ పతనమవుతాడు. ఇంకోటేమిటంటే, ఇప్పటికే పతనానికి బాట వేసుకుంటున్నాడని చెన్నైలో అనుకుంటున్నారు. కారణం, అతను ఒక సినిమాలో హీరోగా నటించబోవడం. ఇదే జరిగితే తెలుగులో నటించడం కూడా చేసి కెరీర్ పోగొట్టుకున్న పాపులర్ దర్శకుడు ఆర్పీ పట్నాయక్ పరిస్థితే ఎదురవుతుందని భావిస్తున్నారు. హిందీలో హిమేష్ రేషమ్మియాతో కూడా ఇదే జరిగింది.
మ్యూజిక్ టాలెంట్, బహుముఖ ప్రజ్ఞ విశేషంగా వున్న అనిరుధ్ రవిచందర్ పెప్పీ సాంగ్స్ అయినా, మనోహరమైన మెలోడీలైనా విభిన్న స్టయిల్సులో కంపోజ్ చేశాడు.
ఆకట్టుకునే, గుర్తుండిపోయే ట్యూన్స్ నీ రూపొందించడంలో అతడి సామర్థ్యం సినిమాలకి వజ్రాభరణంలా వుంటోంది. అతడి మీద భారం పెరిగిపోతే నష్టం అందరికీ. అతనేం ఇళయరాజా కాదు అన్ని భాషల్లో అసంఖ్యాక అపురూప ఆణిముత్యాల్ని సృష్టించడానికి.
ప్రత్యామ్నాయాలు వెతుకుతున్న టాలీవుడ్ నిర్మాతలకి అనిరుధ్ తో కొన్ని పరిమితులుంటే, మరోపక్క ఇంకో కొత్త టాలెంట్ దృష్టిలోపడ్డాడు. అతను విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషి’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ‘హృదయం’ మలయాళం మూవీ ఫేమ్ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్. ‘ఖుషీ’ పాటలు చార్ట్ బస్టర్‌లు కానప్పటికీ, ఇప్పటికీ ఆ పాటలు యూత్ ని అలరిస్తున్నాయి. ఈ సంగీతం తెలుగులో ఇద్దరు టాప్ కంపోజర్‌ల ట్యూన్స్ కంటే బిన్నంగా వుంది. తెలుగులో ఆ ఇద్దరు టాప్ కంపోజర్లు వద్దు మొర్రో అని సోషల్ మీడియాలో వినతులు సమర్పించుకుంటున్నప్పుడు, వహాబ్ రెండో ఛాయిస్ గా నిర్మాతల దృష్టిలో పడ్డాడు.
ఈ కారణంగా వెంటనే అతను నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘హాయ్ నాన్న’ కి, వేరే ఇంకో సినిమా ‘స్పార్క్’ కీ బుక్కయిపోయాడు. ఇప్పుడు రెండో శ్రేణి హీరోలు అతడ్నే కోరుకుంటున్నట్టు విన్పిస్తోంది. పనిలో పనిగా అతడి పారితోషికం కూడా పెరిగింది. ఇతడి వెంటకూడా అందరూ పడితే అతడి క్రియేటివిటీ కూడా పలచబడిపోతుంది. తెలుగులో ఆ ఇద్దరు టాప్ కంపోజర్ల నుంచి ఇందుకే క్రేజీ పాటల బదులు లేజీ పాటలు వచ్చాయి. ఇద్దరే వుంటే ఇది తప్పదు. ఇంకో నల్గురు కొత్త టాలెంట్స్ ని పైకి తీసుకురావాలి స్టార్లు, నిర్మాతలు.