నిర్మాతలకి మల్టీప్లెక్సులే సవాల్!
ఢిల్లీలో పివిఆర్ లక్స్ ప్రైమ్ మల్టీప్లెక్స్ లో టిక్కెట్టు ధర రూ. 1,300. దీంతో ఐస్ కోల్డ్ వాటర్, అవసరముంటే దుప్పటి ఉచితం. ప్రేక్షకులకి సౌకర్యంగా వుండేలా సిబ్బంది ప్రతిదీ చేస్తారు. విలాసవంతమైన లెదర్ సోఫాలు, సోఫాల మధ్య ప్రైవసీ కోసం చాలా ఖాళీ స్థలమూ వుంటాయి.
ఢిల్లీలో పివిఆర్ లక్స్ ప్రైమ్ మల్టీప్లెక్స్ లో టిక్కెట్టు ధర రూ. 1,300. దీంతో ఐస్ కోల్డ్ వాటర్, అవసరముంటే దుప్పటి ఉచితం. ప్రేక్షకులకి సౌకర్యంగా వుండేలా సిబ్బంది ప్రతిదీ చేస్తారు. విలాసవంతమైన లెదర్ సోఫాలు, సోఫాల మధ్య ప్రైవసీ కోసం చాలా ఖాళీ స్థలమూ వుంటాయి. ఇంటి సుఖమంతా ఇక్కడ అనుభవించ వచ్చు. బెల్ నొక్కితే వెయిటర్ హాజర్! ఫైవ్ స్టార్ మర్యాదలు.
సినిమా చూసే విధం సంవత్సరాలుగా సమూలంగా రూపాంతరం చెందుతూ వచ్చింది. చరిత్రలోకి వెళ్తే ఇంతకి ముందు సౌండ్ లేని సినిమాలుండేవి. తర్వాత మోనో సౌండ్, స్టీరియో, సరౌండ్ సౌండ్, ఐమాక్స్, ఐమాక్స్ కొత్త తరం టెక్నాలజీ వచ్చాయి. ఆలాగే సెల్యులాయిడ్, తర్వాత అనలాగ్, జినాన్, లేజర్ ప్రొజెక్షన్లు వచ్చాయి. సినీప్లెక్స్ లొచ్చాయి. ఇప్పుడు మల్టీప్లెక్సుల యుగం. ఒకే కాంప్లెక్స్ లో బహుళ స్క్రీన్‌లతో కూడిన సినిమా థియేటర్ కాంప్లెక్స్, కొన్ని చోట్ల ఐదు నుంచి ఏడు నుంచి పద్నాలుగు స్క్రీన్‌లతో కూడా మల్టీప్లెక్సులు ఏర్పడ్డాయి.
ఈ నేపథ్యంలో సినిమా థియేటర్లకి జనాలు ఎలా తరలి వస్తున్నారో, పెద్ద స్క్రీన్ మీద వున్న ఆకర్షణ ఇప్పటికీ ప్రేక్షకుల్ని ఎలా ప్రభావితం చేస్తోందో ఇటీవలి ట్రెండ్‌లు చూపిస్తున్నాయి. గదర్ 2 ఆల్ ఇండియా నెట్ వసూళ్ళు 400 కోట్లు దాటాయి. ఓ మై గాడ్ 2, 120 కోట్లు, జైలర్ ఇండియా నెట్ 292 కోట్లు, ఒపెన్ హైమర్ 129 కోట్లూ వసూలు చేశాయి.
అంటే పోటీగా ఓటీటీ ప్లాట్ ఫామ్ లున్నా కూడా మల్టీప్లెక్సుల పట్ల ప్రేక్షకుల విధేయత తగ్గలేదు. నాలుగు వారాల్లో ఓటీటీలో వస్తుంది కదా అని ఆగలేదు. మల్టీప్లెక్సులకే వెళ్ళి ఈ సినిమాల్ని చూస్తున్నారు. మల్టీప్లెక్స్ లో సినిమా చూడడం ద్వారా పొందే అనుభవాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలనుకుంటున్నారు. ఓటీటీ లో మజా పొందడానికి ప్రతి ఒక్కరికీ హోమ్ థియేటర్ వుండదు. మొబైల్‌లో చూస్తున్నప్పుడు నిర్మాణ విలువల్ని, సంగీతపు ధ్వనిని, కళ్ళు చెదిరే దృశ్య వైభవాన్నీ ఆనందించలేరు. కాకపోతే ప్రేక్షకులు మల్టీప్లెక్సులకి పరుగు దీయాలంటే తీసే సినిమాలు ఆ స్థాయిలో వుండాలి.
క్వాలిటీకి డిమాండ్
చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా, తీసే సినిమాల క్వాలిటీ ఆ స్థాయిలో లేకపోతే లగ్జరీ థియేటర్లలో ఖరీదైన లెదర్ సీటింగ్, ప్రత్యేక జంట సోఫా సీట్లు, ఎంచుకోవడానికి మెనూల శ్రేణి, పార్కింగ్ లో సహాయం, ఆధునిక ప్రొజెక్షన్‌తో పాటు సౌండ్ టెక్నాలజీ - ఎన్ని వున్నా వృథాయే.
ఇంకా చెప్పాలంటే కొన్ని పెద్ద నగరాల్లో డ్రైవ్ ఇన్ థియేటర్లు, రూఫ్ టాప్ థియేటర్లు, బీచ్ సైడ్ లేదా బార్ వ్యూయింగ్ యాంఫీ థియేటర్ల ఫార్మాట్స్ లో వీక్షణానుభవం శైలి పెద్ద ముందడుగే వేసింది. దేని కోసం? సినిమాల కోసమే. మరి నిర్మాతలు తీసే సినిమాలు ఎలా వుంటున్నాయి? గాండీవధారి అర్జున లాంటి సోది సినిమాలు తీసి థియేటర్లు అందిస్తున్న అభివృద్ధికి దూరంగా వుండిపోతున్నాయి. ఇలాటి సినిమాలు తీస్తే ఎంత, తీయకపోతే ఎంత.
పీవీఆర్ -ఐనాక్స్ మల్టీప్లెక్స్ థియేటర్ చైన్, ఇటీవలే దక్షిణ ఢిల్లీలో ప్రియా సినిమా పేరుతో ఒక స్వతంత్ర ఐమాక్స్ స్క్రీన్ థియేటర్‌ని ప్రారంభించింది. దీనికి ప్రేక్షకులు వెల్లువెత్తుతున్నారు. దేశంలో 100 రూపాయలకి సినిమా చూసే ప్రేక్షకులూ వున్నారు, 1500 పెట్టి సినిమాలు చూసే ప్రేక్షకులూ వున్నారు. ఈ అన్ని సెగ్మెంట్ల ప్రేక్షకుల ముంగిటకీ మల్టీప్లెక్సుల్ని తీసికెళ్ళే ప్రణాళికలతో వుంది పీవీఆర్- ఐనాక్స్. మరి ఈ అవకాశాల్ని అందుకోవడానికి ఏ ప్రణాళికలతో వున్నారు నిర్మాతలు?
సినిమాకి వెళ్ళడం చాలా ఖరీదైన వ్యవహారంగా మారిందని ప్రేక్షకులు అంటున్నారనడంలో ఎలాటి నిజమూ లేదని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చెబుతోంది. ప్రేక్షకులు ఏ రకమైన ఫార్మాట్‌కి వెళుతున్నారో దానిపై మాత్రమే ఆధారపడి వుంటుందనీ, ఐమాక్స్ లేదా రిక్లయినర్లు మాత్రమే వున్న స్క్రీన్‌కి వెళుతున్నారా, లేదా సాధారణ స్క్రీన్ కి వెళ్తున్నారా అన్న దాన్ని బట్టి ఖరీదు మారుతూ వుంటుందనీ అంటోంది.
కన్పించే దృశ్యం చూస్తే, టికెట్ ధర ఏమైనప్పటికీ ప్రీమియం సినిమా థియేటర్లు మంచి ఆక్యుపెన్సీని పొందుతున్నాయి. ప్రీమియం కేటగిరీలలోని సగటు టిక్కెట్ ధరలు బేస్ టికెట్ ధర కంటే 2 నుంచి 10 రేట్లు ఎక్కువుండొచ్చు. బేస్ టికెట్ ధర 100 వుంటే, ప్రీమియం కేటగిరీ 1000 వుండొచ్చు. ఇందువల్లే క్వాలిటీ సినిమాలకి 400, 500 కోట్లు వసూలవుతున్నాయి.
ఎడ్యుకేట్స్ గమనిస్తున్నారు
మల్టీప్లెక్స్ ప్రేక్షకులు ఎడ్యుకేట్స్ అయి వుంటారు. గుడ్డిగా సినిమాల్ని చూసేయరు. తమ అభిరుచికి తగ్గ సినిమాలే సెలెక్టివ్ గా చూస్తారు. అప్పుడు టికెట్ ధర ఎంతైనా పెడతారు. ఏ రకమైన సినిమాని చూడాలన్న దానిపై స్పష్టత వుంటుంది. ఏ జానర్ ఎక్కువగా ఉత్తేజపరుస్తుందో తెలుసు. అది యాక్షన్ లేదా అడ్వెంచర్, కామెడీ లేదా డ్రామా, ఫాంటసీ లేదా హర్రర్, మ్యూజికల్స్ లేదా మిస్టరీ, రోమాన్స్ లేదా సైన్స్ ఫిక్షన్ లేదా థ్రిల్లర్ -ఏదైనా కావచ్చు. తాము లగ్జరీ థియేటర్‌లలో చూసే సినిమాలు తప్పనిసరిగా తమ అభిరుచికి అనుగుణంగా వుండాలి. చాలా మంది రివ్యూలు చూసే వెళ్తారు. ఇంకొంతమంది ఆ సినిమాకి స్క్రిప్ట్ రైటర్లు ఎవరని కూడా ఆరా తీస్తున్నారు. ప్రేక్షకులు సినిమాల్ని ఎంపిక చేసుకునే విధానమిలా వుంటే, ఎంత మంది నిర్మాతలు ఇది తెలుసుకుంటున్నారు?
సినిమాని ఎంచుకున్న తర్వాత అప్పుడు బడ్జెట్ విషయం వస్తుంది- సగటు టిక్కెట్ ధర రూ. 250 అయితే, మెరుగైన వీక్షణానుభవం కోసం రూ. 1,100 నుంచి 1,200, లేదా డైరెక్టర్స్ కట్ రూ. 900 నుంచి 2,000, ఐమాక్స్ రూ. 600, స్క్రీన్ ఎక్స్, ఎన్4డిఎక్స్ రూ. 400 వంటి ఫార్మాట్‌లు వున్నాయి ఎంపిక చేసుకోవడానికి.
ఇంకా విలాసవంతమైన ఇంటీరియర్స్, టచ్-స్క్రీన్ ఆపరేటెడ్ రిక్లయినర్లు, లేజర్ ప్రొజెక్షన్ టెక్నాలజీ, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌లతో కూడిన ఐనాక్స్ ఇన్సిగ్నియా థియేటర్లు; త్రీడీ13, పీవీఆర్ డైరెక్టర్స్ కట్ లతో లగ్జరీ గొలుసు థియేటర్లూ సిద్ధంగా వున్నాయి. ఇవి వినోదంతో పాటు అగ్రశ్రేణి ఆతిథ్య సేవల్ని అందిస్తాయి. పిల్లల కోసం కూడా, సీటుపై రంగులు, అదనపు బొమ్మలు, క్యాండీ బార్, స్లయిడ్‌లు మొదలైన వాటితో నిండిన ప్లేహౌస్ కిడిల్స్ వంటి ప్రత్యేక ప్రీమియం కిడ్ సినిమాస్ వున్నాయి. ఎంత మంది నిర్మాతలు వీటిని దృష్టిలో పెట్టుకుని వీటికి తగ్గ క్వాలిటీ సినిమాలు తీస్తున్నారు?
వాళ్ళు ప్రొఫెషనల్స్
పీవీఆర్ - ఐనాక్స్ ప్రతినిధి ప్రకారం, మొదట టికెట్ ధరపై ప్రీమియం ఎందుకు వుందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం- సాంకేతికాలతో నడిచే ప్రీమియం ఫార్మాట్ లేదా ఇన్‌సిగ్నియా లేదా డైరెక్టర్స్ కట్ వంటి వాటికి చాలా పెట్టుబడి అవుతుంది. సీటు, కార్పెట్ టెక్నాలజీ అమెరికన్ కంపెనీతో ఖరీదైనవి. ఈ టెక్నాలజీ నిజ వాతావరణాన్ని కూడా సృష్టిస్తుంది. ఉదాహరణకి, ఇది యుద్ధ సన్నివేశం అయితే, సైడ్‌వాల్స్ నుంచి పొగ వస్తుంది; అది డేటింగ్ సన్నివేశం అయితే సీట్ హ్యాండిల్స్ నుంచి కాఫీ వాసన వస్తుంది!
ఇక లగ్జరీ థియేటర్‌లో ఆహారం, పానీయాల మెనూ వేరే సెక్షన్. పాప్ కార్న్ లు, కోలా, కేఫ్ కౌంటర్‌లతో కూడిన సాధారణ మిఠాయి కౌంటర్లు, ఇంకా బఫే కౌంటర్లు కూడా తక్కువేం లేవు. సినిమా చూస్తున్న ప్రేక్షకులకి ఆహారాన్ని ఎలా అందించాలో, లైటింగ్ చీకటిగా వున్నందున, సర్వర్ ప్రేక్షకులకి అడ్డు పడకుండా ఎంత వంగి వుండాలి - అన్నదానిపై శిక్షణ కూడా పొంది వుంటారు.
ఇదీ ఎప్పటికప్పుడు ప్రేక్షకుల్ని రప్పించేందుకు అప్డేట్ అవడానికి పాట్లు పడుతూ వుండే ఎగ్జిబిటింగ్ సెక్టార్ ముఖ చిత్రం. ఇంత ప్రొఫెషనల్ గా థియేటర్లు మారుతోంటే- చుట్టండ్రా సినిమా, అది కాలుతోంటే చుట్ట వెల్గించుకుందాం చందాన సినిమాలు తీస్తూంటే అది నేరపూరిత నిర్లక్ష్యం కాక ఏమవుతుంది? అసలెందుకు సినిమాలు తీయాలి?