Telugu Global
Cinema & Entertainment

అరవై దాటి హిట్లు కొడుతున్న స్టార్లు!

ఆరు పదులు పైబడిన హీరోలు, ఆరు పదులు దాటిన పాత్రలు నటించిన సినిమాలు యువ హీరోల సినిమాల కంటే బిగ్గెస్ట్ హిట్లవుతున్నాయి- అంటూ రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. కమలహాసన్ ‘విక్రమ్’, రజనీకాంత్ ‘జైలర్’, సన్నీడియోల్ ‘గదర్ 2’ లని పేర్కొంటూ ట్వీట్ చేశారు.

అరవై దాటి హిట్లు కొడుతున్న స్టార్లు!
X

ఆరు పదులు పైబడిన హీరోలు, ఆరు పదులు దాటిన పాత్రలు నటించిన సినిమాలు యువ హీరోల సినిమాల కంటే బిగ్గెస్ట్ హిట్లవుతున్నాయి- అంటూ రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. కమలహాసన్ ‘విక్రమ్’, రజనీకాంత్ ‘జైలర్’, సన్నీడియోల్ ‘గదర్ 2’ లని పేర్కొంటూ ట్వీట్ చేశారు. నిజంగానే యువ హీరోలకిది ఆలోచనలో పడేసే ట్వీట్. యువహీరోలు తమ సీనియర్ హీరోలు యువ హీరోలుగా వున్నప్పటి సినిమాలనే తమ సినిమాలుగా నటిస్తూ -రీసైక్లింగ్ చేస్తూ-ప్రేక్షకులకి కొత్తదనం లేకుండా చేస్తున్నారు.

గత సంవత్సరం విడుదలైన కమల్ ‘విక్రమ్’ 68 ఏళ్ళ జీవితంలో కమల్ వూహించని 432 కోట్లు వసూలు చేసి రికార్డులు బద్దలు కొట్టింది. ఈ ఆగస్టు 10న విడుదలైన రజనీ ‘జైలర్’ నిన్నటికి పది రోజుల్లో 72 ఏళ్ళ రజనీ కళ్ళజూడని 500 కోట్లు కొల్లగొట్టి మరో రికార్డు సృష్టించింది. ఆగస్టు 11 న విడుదలైన సన్నీ డియోల్ ‘గదర్ 2’ నిన్నటికి 9 రోజుల్లో 65 ఏళ్ళ సన్నీ ఎదురు చూడని 300 కోట్ల కనకవర్షం కురిపించింది. ఈ 60 ప్లస్ సీనియర్ స్టార్ల సంబరంలో మెగాస్టార్ మాత్రమే వెనుక బడ్డారు. ఎందుకంటే ఆరు పదులు పైబడిన తను ఆరు పదులు పైబడిన పాత్రని పోషించలేదు. 67 ఏళ్ళ వయసులో కుర్ర పాత్ర పోషించిన ‘భోళాశంకర్’ 30 కోట్లు కూడా వసూలు చేయలేదు. ఇది పైముగ్గురు చిరంజీవి సమకాలీనులు చిరంజీవికిస్తున్న మెత్తని మెసేజ్.

ఇప్పుడు రజనీ కాంత్ ‘జైలర్’ గురించే టాక్. అన్ని అంచనాల్ని తారుమారు చేస్తూ 'జైలర్' కేవలం 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల రూపాయల అసాధారణ వసూళ్ళు చేసి బాక్సాఫీసు తూఫాను సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లు వసూలు చేసిన ‘గదర్ 2’ ఈ వారాంతంలో 400 కోట్లు టచ్ చేసి 500 కోట్ల వైపు పరుగులు దీయడం ఖాయంగా కన్పిస్తోంది. ఆగస్టు 11 న మరో మూవీ, అక్షయ్ కుమార్ నటించిన ‘ఓఎంజీ 2’ కూడా విడుదలైంది. ఇది 100 కోట్లు వసూలు చేసింది. ఈ మూడు సినిమాల బంపర్ వసూళ్ళతో చాలా రోజుల తర్వాత ఇండియన్ బాక్సాఫీసు కళకళ లాడుతోంది. ఒక్క ఆగస్టు పదిహేనునే ఈ మూడు సినిమాలు చూడడానికి ప్రేక్షకులు 140 కోట్లు ఖర్చు పెట్టారని లెక్క తేలింది!

రజనీ కాంత్ నటించిన ‘జైలర్’ కి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. అపహరణకి గురైన కొడుకుని కాపాడుకునే రిటైర్డ్ జైలర్ కథ ఇది. ఈ యాక్షన్-థ్రిల్లర్‌లో జాకీ ష్రాఫ్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, సునీల్, రమ్య కృష్ణ, తమన్నా నటించారు.

‘గదర్ 2’ 2000 లో సూపర్ హిట్టయిన సన్నీ డియోల్- అమీషా పటేల్ లు నటించిన ‘గదర్ ఏక్ ప్రేమ్ కథ’ కి సీక్వెల్. ఇందులో సన్నీ- అమీషా సీనియర్ పాత్రల్ని పోషించారు. దీనికి కూడా నిర్మాత, దర్శకుడు అనిల్ శర్మ. ఈయన కుమారుడు ఉత్కర్ష్ శర్మ యువ పాత్ర పోషించాడు. ఇది కూడా ఇండియన్ అబ్బాయి- పాక్ అమ్మాయి యాక్షన్ లవ్ కథ.

2012 నాటి ‘ఓ మైగాడ్’ కి సీక్వెల్ ‘ఓఎంజీ 2’ లో కూడా అక్షయ్ కుమారే నటించాడు. ఇది పాఠశాలల్లో సెక్స్ ఎడ్యుకేషన్ అవసరం గురించి తీసిన సినిమా. ఈ మూడు హిట్లు పీవీఆర్ - ఐనాక్స్ మల్టీప్లెక్స్ గ్రూపుని సంక్షోభంలోంచి బయటపడేశాయి. జనవరిలో ‘పఠాన్’ తర్వాత బాలీవుడ్ నుంచి హిట్లు లేక నష్టాల్లో వున్న ఈ గ్రూపుకి పై రెండు బాలీవుడ్ హిట్లు, ఒక పానిండియా హిట్ ఊరట నిచ్చాయి. ఈ మూడు సినిమాల ఓపెనింగ్స్ కి 12.8 లక్షల మంది ప్రేక్షకులతో రూ. 39.5 కోట్ల గ్రాస్ బాక్సాఫీస్ ఆదాయాన్ని ఆర్జించినట్టు గ్రూపు ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. 11-13 ఆగస్ట్'23 వారాంతం కూడా కంపెనీ చరిత్రలో అతిపెద్ద వారాంతమని, 33.6 లక్షల మంది ప్రేక్షకులతో రూ. 100+ కోట్ల గ్రాస్ బాక్సాఫీస్ ఆదాయాన్ని ఆర్జించామనీ పేర్కొంది.

'గదర్ 2', 'జైలర్', ‘ఓఎంజీ2’ మూడూ కంటెంట్ ప్రధానమైన సినిమాలని, ఇలాటి సినిమాల కోసం ఎదురు చూశామనీ, ఈ మూడు సినిమాల అద్భుతమైన కంటెంట్ తో అద్భుతమైన మైలురాయి సాధించమనీ ప్రకటనలో పేర్కొంది గ్రూపు.

60 ప్లస్, 70 ప్లస్ స్టార్లు వయసు దాచుకోకుండా 60 ప్లస్, 70 ప్లస్ పాత్రలు పోషిస్తే చూడడానికి కుర్రకారు ప్రేక్షకులు కూడా సిద్ధంగా వున్నారని రుజువైంది. రానున్న కమల్ ‘ఇండియన్ 2’ ఇలాటిదే. చిరంజీవి మరో మూడు సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ఆయన కుర్రతనం ఆయనదే!

First Published:  20 Aug 2023 8:24 AM GMT
Next Story