Telugu Global
Cinema & Entertainment

నేడే విడుదల కాదు, విడుదల వాయిదా!

ఈ సాంప్రదాయం ఒటీటీలతో ఒప్పందాల పుణ్యమాని వెనక్కి వెళ్ళిపోయింది. ఫలితంగా నెలలకి నెలలు, సంవత్సరాలకి సంవత్సరాలు విడుదల తేదీలు వాయిదా పడుతున్న సమస్యలతో ప్రేక్షకులు సహనం కోల్పోతున్నారు.

నేడే విడుదల కాదు, విడుదల వాయిదా!
X

గత వారం వరకూ అల్లు అర్జున్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప: ది రూల్’ ఆగస్టు 15 నే విడుదల కాబోతోందని అభిమానులు నమ్ముతూ వచ్చారు. ఇంతలో విడుదల వాయిదా వేస్తున్నట్టు అల్లు అర్జున్ ట్వీట్ చేయడంతో అభిమానులు విస్తుపోయారు. ఈ ట్వీట్ తో విడుదల ఏకంగా డిసెంబర్ 6 కి మారిపోయింది. అభిమానుల్లో గగ్గోలు మొదలైంది. విడుదల తేదీలతో ఆభిమానులతో ఆడుకోవడం సర్వసాధారణమైపోయింది ఎన్నో సినిమాలు పదే పదే విడుదల వాయిదా పడుతూ ప్రేక్షకుల్ని విసిగిస్తూ వచ్చాయి.

ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ విడుదల తేదీలతోనైతే ప్రేక్షకులు విసిగి వేసారి పోయారు. అలాగే ‘పుష్ప 1’ విడుదల తేదీతో కూడా. ‘పుష్ప: ది రైజ్’ 2021 డిసెంబర్ 17న విడుదలైంది. కానీ ఆగస్టు 13 న విడుదలవుతుందని ముందు ప్రకటించారు. దీన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మొదటి భాగం మొదట అనుకున్న తేదీకి వస్తుందని, రెండవ భాగం 2023లో వస్తుందనీ ప్రకటించారు. మొదటి భాగం నాలుగు నెలలు ఆలస్యంగా డిసెంబర్ 17 న విడుదలైతే, రెండో భాగం 2023లో విడుదల కానేలేదు. తాజాగా 2024 డిసెంబర్ 6కి వాయిదా పడింది.

ఈ విడుదల వాయిదాలు నిర్మాణ పనుల్లో జాప్యాల వల్లనే. నిర్మాణం పూర్తయినా, గ్రాఫిక్స్ సంతృప్తికరంగా రాలేదన్న కారణంగానే. ‘ఆది పురుష్’, ‘సాలార్ : ది సీజ్ ఫైర్’, ‘భ్రహ్మాస్త్ర’ ... ఇవన్నీ గ్రాఫిక్స్ ని మళ్ళీ మళ్ళీ సరిదిద్దుకుంటూ విడుదలలు వాయిదాలు పడ్డవే. ‘పుష్ప : ది రూల్’ ఇంకా రీషూట్ల తో నిర్మాణం అనంతంగా సాగిపోతూనే వుంది. బడ్జెట్ పరిధి దాటిపోతూనే వుంది.

ఇంతేకాదు, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న -ప్రభాస్ నటించిన రూ. 600 కోట్ల మెగా బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ ‘కల్కి 2898 ఏడీ’ జనవరిలో విడుదల ఖరారు చేశారు. ఇంతలో తేదీ మారిపోయింది. ప్రభాస్ నటించిన ‘సాలార్ : ది సీజ్ ఫైర్’ విడుదల తేదీకి దగ్గరగా వుందని విడుదల వాయిదా వేశారు. తర్వాత సమ్మర్ కి తేదీ ఇచ్చారు. అది కూడా వాయిదా పడింది. మొత్తానికి ఇప్పుడు జూన్ 27న విడుదలవుతోంది.

ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్’ 2022 మార్చి 11 న విడుదలైంది. అంతకి ముందు 2021 జులై 30 కి అన్నారు. అయితే కోవిడ్ లాక్ డౌన్ కారణంగా వాయిదా వేశారు. తర్వాత 2022 జనవరి 14 న విడుదలవుతుందని ప్రకటించారు. మళ్ళీ కోవిడ్ ఏమిక్రాన్ వేరియంట్ కారణంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. తర్వాత ఫిబ్రవరిలో అన్నారు. చిట్టచివరికి 2022 మార్చి 11 న మోక్షం కల్గించారు.

మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ కూడా విడుదల వాయిదాల బారిన పడ్డ సినిమానే. ఇది 2023 ఏప్రిల్ 28 నుంచి ఆగస్టు 11కి వాయిదా పడింది. మళ్ళీ 2024 జనవరి 13 కి వాయిదా పడింది. ఫైనల్ గా జనవరి 14 న విడుదలైంది.

రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ చెంజర్’ 2023 జనవరిలో సంక్రాంతికి విడుదల అన్నారు. తర్వాత 2024 ఏప్రిల్ అన్నారు. అప్పుడు అక్టోబర్ లో అంటున్నారు. ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర: పార్ట్ 1’ ఏప్రిల్ 5 కి వుడుదల తేదీ ఇచ్చి, అక్టోబర్ 10 కి మార్చారు. ఇప్పుడు సెప్టెంబర్ 27 కి సవరించారు. విశ్వక్ సేన్ నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ 2023 డిసెంబర్ 8 నుంచి 2024 మార్చి 8 కి వాయిదాపడి, మే 31 న విడుదలైంది. రామ్ పోతినేని నటిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ మార్చి 8 న విడుదల చేయాలని నిర్ణయించారు, ఇది వాయిదా వేసి ఆగస్టు 15 కి తేదీ ఇచ్చారు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఇదంతా చూస్తే ప్లానింగ్ లేకుండా డేట్లు ఇచ్చేస్తున్నట్టు కన్పిస్తుంది. అయితే ఓటీటీలతో ఒప్పందాల కారణంగా కూడా డేట్లు ప్రకటించక తప్పదు. అయితే ఓటీటీ ఒప్పందాల ప్రకారం ప్రకటించిన డేట్లు మారిపోవడమన్నది సహజమే. ఎందుకంటే ఏ సినిమా ముందుగా ప్రకటించిన తేదీకల్లా నిర్మాణం పూర్తి కావడమన్నది జరగదు. నిర్మాణం పూర్తి కావొస్తున్న తరణంలో డేట్లు ప్రకటించడం పూర్వమున్న సాంప్రదాయం.

ఈ సాంప్రదాయం ఒటీటీలతో ఒప్పందాల పుణ్యమాని వెనక్కి వెళ్ళిపోయింది. ఫలితంగా నెలలకి నెలలు, సంవత్సరాలకి సంవత్సరాలు విడుదల తేదీలు వాయిదా పడుతున్న సమస్యలతో ప్రేక్షకులు సహనం కోల్పోతున్నారు.

పూర్వం ప్రకటించిన తేదీకల్లా సినిమా విడుదల చేయకపపోతే రిస్కుగా భావించేవారు నిర్మాతలు. అలా విడుదల వాయిదా పడ్డ సినిమాల్ని ప్రేక్షకులు చిన్న చూపు చూసే వాళ్ళు. తీరా విడుదలైతే పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. ఇప్పుడీ పరిస్థితి లేదుగానీ, ప్రతీ వాయిదా పడ్డ సినిమాతో ప్రేక్షకుల్ని బెంబేలెత్తిస్తున్నారు.

First Published:  20 Jun 2024 7:23 PM IST
Next Story