Telugu Global
Cinema & Entertainment

రేపు రూ. 99 లకే సినిమాలు!

మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎంఏఐ) రేపు మే 31న సినిమా లవర్స్ డే ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రేక్షకులు రూ. 99 లకే సినిమాలు చూడొచ్చు.

రేపు రూ. 99 లకే సినిమాలు!
X

మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎంఏఐ) రేపు మే 31న సినిమా లవర్స్ డే ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రేక్షకులు రూ. 99 లకే సినిమాలు చూడొచ్చు. పీవీఆర్ -ఇనాక్స్, సినీపొలిస్, మీరజ్ సినిమాస్, సిటీ ఫ్రైడ్, ఏసియన్, ముక్తా ఏ2, మూవీ టైమ్, మూవీ మాక్స్, వేవ్, ఎం2కె, డిలైట్ మల్టీప్లెక్సులు సహా 4,000 స్క్రీన్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. ఈ ఆఫర్ అన్ని భాషల సినిమాలకూ వర్తిస్తుంది. అయితే రేపు విడుదలయ్యే కొత్త తెలుగు సినిమాలకు వర్తించదు. అలాగే ఐమాక్స్, 4డీ ఎక్స్, రీక్లైనర్స్ వంటి ప్రీమియం ఫార్మాట్‌లని ఈ ఆఫర్ నుంచి మినహాయించారు.

పరిమిత హాలీవుడ్ విడుదలలతో పాటు, హిందీలో, ఇతర భాషల్లో విడుదలైన కంటెంట్‌ కి అప్పీల్ లేకపోవడం వల్ల సినిమా పరిశ్రమకి మార్చి త్రైమాసికం బలహీనంగా వున్న సమయంలో సినిమా లవర్స్ డే నిర్వహిస్తున్నారు. గత మూడు సంవత్సరాలుగా దీన్నినిర్వహిస్తున్నారు. గత నెల ఏప్రిల్ 19 నే ఈ సినిమా ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు. అయితే కారణాలు చెప్పకుండా ఆకస్మికంగా వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు చేపట్టారు.

ఎండలు, క్రికెట్, ఎన్నికలు ప్రస్తుత త్రైమాసికంలో కొత్త విడుదలల సంఖ్యని ప్రభావితం చేశాయి. జూన్ నుంచి బలమైన కంటెంట్ తో సినిమాల విడుదలలు, ప్రేక్షకుల సంఖ్య పెరగడాలూ చూడగలమని మల్టీప్లెక్ యాజమాన్యాలు ఆశిస్తున్నాయి. సినిమా లవర్స్ డేకి మిస్టర్ అండ్ మిసెస్ మహి, ఛోటా భీమ్, ది కర్స్ ఆఫ్ ది మ్యాన్, హైక్యు ది డంప్‌స్టర్ బ్యాటిల్ వంటి కొత్త విడుదలల్ని చేర్చారు.

అన్ని వయసుల ప్రేక్షకుల్నిథియేటర్‌లకి తీసుకురావడం, ముఖ్యంగా ఈ వేసవి సీజన్‌లో చల్లదనాన్ని అందించడం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యమనీ ఎంఏఐ ప్రెసిడెంట్ కమల్ జియాచందానీ అన్నారు. మల్టీప్లెక్సుల్ని కొత్త వినియోగదారులకి మరింత అందుబాటులోకి తీసుకురావడం కూడా దీని లక్ష్యం. గత సంవత్సరం సినిమా లవర్స్ డే సందర్భంగా సినిమాలు చూడడానికి కుటుంబాలు,ఇతర పెద్ద సమూహాలు రావడంతో 50-70 శాతం రేంజీలో బలమైన ఆక్యుపెన్సీలని చూశామనీ, తిరిగి మే 31న ఇలాంటి పోకడల్నే చూడాలని భావిస్తున్నామనీ ఆయన చెప్పారు.

కోవిడ్ మహమ్మారి అనంతర కాలంలో స్థానిక థియేటర్‌లకి తిరిగి రాని ప్రేక్షకుల్ని ప్రోత్సహించడానికే సినిమా లవర్స్ డే ప్రారంభమైంది. గత సంవత్సరం అక్టోబరులో నిర్వహించిన సినిమా లవర్స్ డేకి 60 లక్షల మంది ప్రేక్షకులు హాజరయ్యారు.

సినిమా ప్రేమికుల దినోత్సవం 2024 కి రూ. 99 టిక్కెట్ ఆఫర్‌ని పొందాలని ప్లాన్ చేసే ప్రేక్షకులకి బుకింగ్ ప్రక్రియ ఇలా వుంటుంది : పీవీఆర్ లేదా ఐనాక్స్ వెబ్సైట్లని ఓపెన్ చేసి సినిమా పేరు, షో టైమ్ ఎంచుకోవాలి. తర్వాత సీట్లు ఎంపిక చేసుకుని పేమెంట్ ట్యాబ్ ని క్లిక్ చేసి పేమెంట్ ప్రక్రియ పూర్తి చేయాలి. టికెట్లు వాట్సాప్ లేదా ఈమెయిల్ కి వచ్చేస్తాయి. లేదా బుక్ మై షో, పేటీఎం వంటి థర్డ్-పార్టీ వెబ్‌సైట్‌ల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.

పై విధంగా ఆన్ లైన్ బుకింగ్ చేసుకుంటే అదనపు ఖర్చులుంటాయి. కన్వీనియన్స్ ఫీజు, జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి వుంటుంది. కేవలం మల్టీప్లెక్సుల్లోనే ఈ ఆఫర్ వుంటుంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఈ ఆఫర్ పరిధిలోకి రావు.

First Published:  30 May 2024 6:31 AM GMT
Next Story