Telugu Global
Cinema & Entertainment

సోషల్ మీడియాతో సినిమా సంగతులు!

క్రీడా,వాణిజ్య, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాలపై సోషల్ మీడియా ప్రభావం ఎంతటిదో అందరూ గమనిస్తూనే వున్నారు. సోషల్ మీడియా ప్రతీ దానినీ సానుకూలంగా లేదా ప్రతికూలంగా ప్రభావితం చేసే అస్త్రమై కూర్చుంది.

సోషల్ మీడియాతో సినిమా సంగతులు!
X

సోషల్ మీడియాతో సినిమా సంగతులు!

దైనందిన జీవితంలో సోషల్ మీడియా ఎంతగా చొచ్చుకు పోయిందో తెలిసిందే. ఇది మన దినచర్యల్ని మార్చడమే కాకుండా, వివిధ రంగాల్ని మార్చే శక్తిని కూడా కలిగి వుందనేది కూడా ఎవరూ కాదనలేని వాస్తవం. క్రీడా,వాణిజ్య, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాలపై సోషల్ మీడియా ప్రభావం ఎంతటిదో అందరూ గమనిస్తూనే వున్నారు. సోషల్ మీడియా ప్రతీ దానినీ సానుకూలంగా లేదా ప్రతికూలంగా ప్రభావితం చేసే అస్త్రమై కూర్చుంది. ఇలాటిది దీన్నుంచి సినిమా రంగం దూరంగా వుండగలదా?

ప్రస్తుతం ఏదైనా కొత్త సినిమా ట్రైలర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో వైరలో, వైరాగ్యమో తెచ్చి పెడుతోంది. కొన్నిసార్లు సోషల్ మీడియా సినిమాని చూడకుండానే విమర్శించేందుకు ప్రేక్షకుల్ని ప్రేరేపిస్తోంది. మౌత్ టాక్ కాస్తా కీబోర్డు టాప్ గా మారింది. ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా చూస్తూనే, ట్విట్టర్లో సినిమా ఎలా వుందో నిమిషానిమిషానికీ అప్డేట్స్ ఇచ్చి, ఇంటర్వెల్ కల్లా ఫ్లాప్ టాక్ ఫైరల్ చేసే అత్యుత్సాహానికి కూడా ప్రేక్షకుల్ని పురిగొల్పుతోంది సోషల్ మీడియా!

ఇదొక వైపు అయితే, నిర్మాతలకి సోషల్ మీడియా మంచి మార్కెటింగ్ అస్త్రంగా మారింది. నిర్మాతలు ఎటువంటి ఆధారాలు లేకుండా తమ సినిమాల్ని మిలియన్ల మంది చూశారని చెప్పుకునే అవకాశం కల్పిస్తోంది. యూట్యూబ్ లో ప్రచార చిత్రాల, పాటల వీడియోలు మిలియన్ల కొద్దీ వ్యూస్ తో వైరల్ అయినప్పుడు, ఇది చూపించి బయ్యర్ల దగ్గర డిమాండ్లు పెంచి వసూలు చేసుకునే చాన్సు కూడా ఇస్తోంది సోషల్ మీడియా.

ఇంటర్నెట్ ప్రారంభం అన్ని రంగాలలోని అమ్మకం దార్లకి ప్రజలతో కమ్యూనికేట్ అవడానికి కొత్త మార్గాన్ని అందించింది. సోషల్ మీడియా వచ్చేసి జనాదరణ పొందినప్పుడు ఇది మరింత విస్తరించింది. సామాజిక ఛానెల్‌లు మార్కెటింగ్ అవకాశాల కోసం తలుపులు బార్లా తెరిచాయి. సోషల్ మీడియా సినిమా నిర్మాతలకి మునుపెన్నడూ లేని విధంగా కొత్త విడుదలల్ని ప్రమోట్ చేసుకునే అవకాశం ధారాళంగా ఇస్తోంది. ఫస్ట్ లుక్ లు, టీజర్లు, ట్రయిలర్లు, ఫస్ట్ సింగిల్సు, తెర వెనుక మేకింగ్ వీడియోలూ, ఒకటేమిటి - అనునిత్యం కొత్త కొత్త మార్కెటింగ్ వ్యూహాలతో పరిణామం చెందుతోంది సోషల్ మీడియా ఆధారిత సినిమా పబ్లిసిటీ. ప్రేక్షకులు ఇంటరాక్ట్ అయ్యే మీడియా వీడియోలతో, లాంచ్ డేకి ముందు ఫాలోయింగ్‌ ని ను రూపొందించుకునే అవకాశాన్ని కూడా ఇస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా ఫ్రాంచైజీల అండర్‌గ్రౌండ్ కల్ట్ లాంటి కొత్త వ్యూహంతో ఫాలోయింగ్స్ ని పొందేందుకు మార్గాన్ని అందిస్తోంది.

అయితే ఇంకోటి కూడా జరుగుతోంది. పబ్లిసిటీ పేరుతో సినిమాని ఎప్పటికప్పుడు ప్రేక్షకుల్లోకి తీసికెళ్లినప్పుడు ఇదే సోషల్ మీడియాలో ఎదురు దెబ్బలు కూడా తగులుతున్నాయి. సినిమా పబ్లిసిటీకి సోషల్ మీడియాలో తలుపులు తెరవడమంటే అవాంఛనీయమైన, ఊహించని విమర్శలకి కూడా తలుపులు తెరవడమే అవుతోంది. ఒకప్పుడు నిర్మాతలు విడుదల చేసిన ఏదైనా లుక్ ప్రేక్షకులకి నచ్చకపోతే, తమ అభిప్రాయాలని తెలియజేయడానికి సినిమా విడుదలై వచ్చేవరకూ వేచి వుండాల్సి వచ్చేది. కొన్నిసార్లు ఆ అభిప్రాయాల్ని స్నేహితులతోనో, కుటుంబ సభ్యులతోనో పంచుకునే పరిధి దాటేది కాదు.

కానీ సోషల్ మీడియా వేదికగా మారేక, వేలాది మంది - కొన్నిసార్లు మిలియన్ల మంది ప్రేక్షకులు తమ అభిప్రాయాల్నీ, విమర్శల్నీ క్షణాల్లో గుప్పించే, ట్రోలింగ్ చేసే, సినిమా ప్రాణాలు తీసే ట్రెండ్ రోజురోజుకీ ఊపందుకుంటోంది. ‘ఆదిపురుష్ ‘తో ఇదే జరిగింది. ‘కల్కి-2898 AD’ తోనూ ఇదే జరిగింది. ఈ రెండు మెగా బడ్జెట్ సినిమాల ఫస్ట్ లుక్స్ కి, టీజర్స్ కీ నెటిజన్ల నుంచి తీవ్ర ఎదురుదాడి మొదలవడంతో, నిర్మాతలు విడుదలలు వాయిదా వేసుకుని గ్రాఫిక్స్ నాణ్యతల్ని పెంచుకునే పనిలో పడక తప్పలేదు.

అంటే ఈ విమర్శలతో సినిమాల్ని నిర్మాణ సమయంలోనే గుణాత్మకంగా మెరుగుపర్చుకునే ఫీడ్ బ్యాక్ సోషల్ మీడియాతో సాధ్యమవుతోంది. ఇలా సినిమా పరిశ్రమని పునర్నిర్మించే శక్తిని సోషల్ మీడియా ప్రేక్షకులకి ఇచ్చేసిందన్న మాట.

ప్రేక్షకులు ఇప్పుడు ఏది చూపిస్తే అది చూసే పరిస్థితుల్లో లేరు. వందల రూపాయలు ఖర్చు పెట్టుకుని సినిమాలు చూస్తున్నప్పుడు క్వాలిటీ ని డిమాండ్ చేస్తున్నారు. ఫస్ట్ లుక్ లు, టీజర్లు చూసి, ట్రోలింగ్ తో ముందే తమక్కావాల్సిన సినిమాని రూపొందింప జేసుకుని థియేటర్లో హాయిగా తిలకించే విశేషాధికారం పొందుతున్నారు.

కాబట్టి ఒక విధంగా సోషల్ మీడియా నుయోగించుకుని ప్రేక్షకులు సినిమా పరిశ్రమపై ఆధిపత్యం చెలాయిస్తున్నారనే చెప్పాలి. సినిమాలపై సోషల్ మీడియా ప్రభావం సానుకూలంగా, ప్రతికూలంగా రెండుగానూ వుంది. అయితే సినిమా నిర్మాణ సమయంలోనే, ముందస్తుగా తప్పులు దిద్దుకునే సానుకూల పనిముట్టుగా మార్చుకుంటే నిర్మాతలకి సోషల్ మీడియా ఒక వరమే!

First Published:  3 Aug 2023 4:32 PM IST
Next Story