Telugu Global
MOVIE REVIEWS

Waltair Veerayya Movie Review: ‘వాల్తేరు వీరయ్య’ రివ్యూ {2.5 /5}

Waltair Veerayya Movie Review: చిరంజీవి, రవితేజల కాంబోలో ‘వాల్తేరు వీరయ్య’ పూనకాలు లోడింగ్ అంటూ, వింటేజ్ చిరంజీవి అంటూ చాలా మాస్ మేనియా క్రియేట్ అయింది.

Waltair Veerayya Movie Review: ‘వాల్తేరు వీరయ్య’ రివ్యూ
X

Waltair Veerayya Movie Review: ‘వాల్తేరు వీరయ్య’ రివ్యూ {2.5 /5}

చిత్రం: వాల్తేరు వీరయ్య

రచన -దర్శకత్వం : కె. బాబ్జీ

తారాగణం : చిరంజీవి, రవితేజ, శృతీ హాసన్, కేథరిన్ ట్రెసా, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్ బాబీ సింహా, నాజర్, సత్యరాజ్, వెన్నెల కిషోర్, శ్రీనివాస రెడ్డి, సప్తగిరి, షకలక శంకర్,ప్రదీప్ రావత్ తదితరులు

సంగీతం : దేవి శ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం : ఆర్థర్ ఎ. విల్సన్

బ్యానర్ : మైత్రీ మూవీ మేకర్స్

నిర్మాతలు : నవీన్ యెర్నేని, వై. రవిశంకర్

విడుదల : జనవరి 13, 2023

రేటింగ్ : 2.5 /5

సంక్రాంతికి నేటితో ముగ్గురు హీరోలు మూడు సినిమాలతో వచ్చినా నిజానికి నల్గురు హీరోల సినిమాలుగా లెక్కించాలి. ‘వాల్తేరు వీరయ్య’ తో చిరంజీవితో బాటు రవితేజ రావడం వల్ల. రేపు ‘వారసుడు’ తో ఇంకో హీరో విజయ్ కూడా వస్తే, మొత్తం కలిపి నాల్గు టికెట్లతో ఐదుగురు హీరోలని చూసే అవకాశం పండగ ప్రేక్షకులకి కలుగుతోంది. ఆనందం ఎంత అనుభవించారనేది వేరే విషయం. హీరోయిన్ విషయంలో ఎక్స్ ట్రా బెనిఫిట్ లేదు. ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ రెండూ ఒకే బ్యానర్ సినిమాలు కావడంతో కాంట్రాక్టు మాట్లాడుకుని నటించినట్టు, రెండిట్లో శృతీ హాసనే కనిపించడంతో ఏ సినిమా చూస్తున్నామనే కన్ఫ్యూజన్ కూడా ఏర్పడొచ్చు. చిరంజీవి, రవితేజల కాంబోలో ‘వాల్తేరు వీరయ్య’ పూనకాలు లోడింగ్ అంటూ, వింటేజ్ చిరంజీవి అంటూ చాలా మాస్ మేనియా క్రియేట్ అయింది. చిరంజీవి ‘ఆచార్య’, ‘గాడ్ ఫాదర్’ అనుభవాలతో రూటుమార్చి పాత చిరంజీవిని రీబూట్ చేసి చూపించే ప్రయత్నం చేశారు. దీని మీద ఆసక్తితో వున్న ప్రేక్షకులకి ఇదెలా వుంటుందో చూద్దాం...

కథ

వైజాగ్ పోర్టులో ఐస్ ఫ్యాక్టరీ నడిపే వీరయ్య (చిరంజీవి) సముద్రం మీద పట్టు వున్నవాడు. నేవీ సిబ్బంది ఇబ్బందిలో పడ్డా కాపాడగల ధైర్యసాహసాలు వున్నవాడు. ఒకసారి ‘రా’ విభాగం అధికారులు కరుడుగట్టిన డ్రగ్ మాఫియా సాల్మన్ సీజర్ (బాబీ సింహా) ని తీసుకొస్తున్న విమానం కూలిపోతే అతడ్ని దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో వుంచుతారు. ఆ పోలీస్ స్టేషన్ మీద సాల్మన్ గ్యాంగ్ దాడి చేసి విడిపించుకు పోవడంతో, సీఐ సీతాపతి (రాజేంద్రప్రసాద్) సస్పెండ్ అవుతాడు. ఇతను వీరయ్యని బేరమాడుకుని మలేషియా పారిపోయిన సాల్మన్ ని పట్టుకు వచ్చేందుకు వీరయ్యతో బయల్దేరతాడు.

మలేషియాలో సాల్మన్ ని పట్టుకునే ప్రయత్నంలో వీరయ్యకి అతిధి (శృతీ హాసన్) పరిచయమవుతుంది. ఈమె ‘రా’ కమాండోగా వుంటుంది. వీరయ్య సల్మాన్ ని పట్టుకుని చంపేయడంతో అజ్ఞాతంలో వున్న అతడి అన్న కాలా (ప్రకాష్ రాజ్) బయటికొస్తాడు. వీరయ్యకి కావాల్సింది ఇతనే. ఇతడి మీద పగదీర్చుకోవడం మొదలెడతాడు.

ఏమిటా పగ? గతంలో వీరయ్యకీ, ఏసీపీ విక్రమ్ (రవితేజ) కీ వున్న సంబంధమేమిటి? డాక్టర్ శాలిని (కేథరిన్ ట్రెసా) ఎవరు? విక్రమ్ ఏమయ్యాడు? గతంలో వీరయ్యతో కలిసి వ్యాపారం చేసిన కాలా చేసిన ద్రోహమేమిటి? ఇవి తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాలి.

ఎలావుంది కథ

నిజానికి ఇద్దరు స్టార్ల బాండింగ్ గురించి వున్న ఇలాటి కథ సింపుల్ గా చెప్తేనే బలంగా, హత్తుకునేలా చెప్పడానికి అవకాశముంటుంది. ఆస్కార్ విన్నర్ ‘దేర్ విల్ బి బ్లడ్’ (2007) లో డానియేల్ డే లేవీస్ దగ్గరికి, అతడి సవతి తమ్ముడ్నని చెప్పుకుని వచ్చే కెవిన్ ఓ కానర్ ల మధ్య బ్రదర్ హుడ్ బాండింగ్ ఎంత అందంగా వుంటుంది. ఆ దృశ్యాల్ని మర్చిపోలేం. ఇది ఇద్దరు బిగ్ స్టార్స్ చిరంజీవి - రవితేజల మధ్య మిస్సయ్యింది. ఎంతసేపూ చుట్టూ బోలెడు క్రౌడ్ మధ్య రిలీఫ్ లేని అవే వూర మాస్ కామెడీలు, విలన్లతో పోరాటాలు, సవాళ్ళు ఎదురు సవాళ్లూ, కాల్పులూ నరికివేతలూ ఇవే సరిపోయాయి. ఓ అరగంట వాళ్ళిద్దరిని ప్రైవేటుగా, వొంటరిగా వదిలేసి- వాళ్ళ బాండింగ్ ని ఎస్టాబ్లిష్ చేసే సరదాలు, సముద్రం మీద షికార్లు, హాబీలు, హత్తుకునే, కళ్ళు చెమర్చే సన్నివేశాలూ వంటి సెంటిమెంటల్ బ్యాక్ డ్రాప్ లేకపోవడంతో - ఈ ఫ్లాష్ బ్యాక్ మీదే ఆధారపడ్డ మొత్తం కథ ఎలాటి ఫీల్, ఎమోషన్స్, పాతోస్ లేని ఉత్త హోరులా మారింది.

మాస్ పాత్రలతో చిరంజీవి స్కిల్స్ గురించి ఆల్రెడీ తెలుసు. కనీసం ఫ్లాష్ బ్యాక్ లోనైనా ఛేంజోవరిస్తూ కాస్త సింపుల్ గా, హూందాగా, సున్నిత హాస్యంతో మార్పు చూపించాలని ప్రయత్నం చేయలేదు. మూడు గంటలసేపూ ఒకే క్యారక్టరైజేషన్ తో, ఒకే టైపు వూర మాస్ యాక్టింగ్ తో చాలా ఓవరాక్షన్ చేశారు. అంత అవసరం లేదు. దీనికి అల్లు అర్జున్ చాలు.

కథ, స్క్రీన్ ప్లే నాటుగా లౌడ్ గా వున్నాయి. రొటీన్ మూస ఫార్ములా కథని చాలా హడావిడి చేస్తూ వయొలెన్స్ తో నింపేశారు. చిరంజీవి మలేషియా వెళ్ళడంలో వున్న అసలు ఉద్దేశం ప్రకాష్ రాజ్ ని పట్టుకోవడమైతే, ఇంటర్వెల్లో దీని ఇంపాక్ట్ లేకుండా మలేషియా ఎపిసోడ్ అంతా మాస్ కామెడీ, పట్టుకునేందుకు అదేపనిగా చేసే ప్రయత్నాలతో మొనాటానీని నింపేశారు. ఈ పట్టుకునే ప్రయత్నాల్ని కుదించి ప్రధానంగా హీరోయిన్ తో, అక్కడున్న ఫ్లాష్ బ్యాక్ హీరోయిన్ కేథరిన్ తో, కథలో సస్పెన్స్ ని పెంచే ప్రయత్నం చేయలేదు. కథ కంటే వింటేజ్ చిరంజీవిని చూపించే ఏకధాటి సీన్లతో నింపేశారు. ఇంత చేసినా పూనకాలు లోడింగ్ కాలేదు. ఫ్యాన్స్ కి మాత్రమే ఈ సినిమా పూనకాలు.

సెకండాఫ్ లో రవితేజతో ఫ్లాష్ బ్యాక్ పైన చెప్పుకున్న కారణాలతో కృతకంగా మిగిలింది. చిన్నా చితకా సినిమాలెలాగూ అలాగే వుంటాయి- 140 కోట్లతో తీసే పెద్ద సిని మా అయినా విషయ పరంగా క్వాలిటీతో లేకపోతే ఎలా? ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యాక వూహించేదే జరుగుతుంది - ప్రకాష్ రాజ్ మీద చిరంజీవి పగదీర్చుకునే క్లయిమాక్స్. ఈ క్లయిమాక్స్ యాక్షన్ బీభత్సంగా కొనసాగుతూనే వుంటుంది- ముగింపు అనేది లేనట్టు.

మొత్తం మీద ఎలాగైనా హిట్ కొట్టాలని చిరంజీవిని రీబూట్ చేయడం కాదు, ఓవర్ లోడింగ్ చేశారు. పండగ రోజుల్లో ఓవర్ లోడింగ్ ఈజీగా క్యారీ అయిపోతుంది.

నటనలు- సాంకేతికాలు

యంగ్ చిరంజీవి మళ్ళీ తెరపైకొస్తూ మాస్ యాక్టింగే ఎలివేటయ్యేలా చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకోవచ్చు. ఎన్ని కోణాల్లో ఎన్ని విధాలుగా చిరంజీవిని హైలైట్ చేయాలన్న దానిమీదే దృష్టి పెట్టి దర్శకుడు బాబీ కూడా కృషి చేశాడు. ప్రారంభంలో రాత్రిపూట సముద్రంలో పడవల మీద యాక్షన్ సీను నుంచీ, ఇంటర్వెల్లో యాక్షన్ సీను వరకూ పడ్డ కష్టం ఫలించింది. అయితే యాంగ్రీ యంగ్ మాన్ ఎమోషన్స్ మాత్రం కథని మరుగున పడేయడం వల్ల ఉత్పన్నం కాలేదు. అలాటి క్లోజప్స్ కూడా లేవు. ఇది పెద్ద లోపం.

రోమాంటిక్ యాంగిల్ కూడా బలి అయ్యింది బోలెడు వయోలెంట్ యాక్షన్, వూర కామెడీలతో. ‘బాస్ పార్టీ’ పాట, రవితేజతో ‘పూనకాలు లోడింగ్’ పాట చిరంజీవిలోని డాన్సర్ ని మరోసారి బయటపెట్టాయి. అయితే చిరంజీవి నటనతో గుర్తుండిపోయే ఒక్క సీను కనీసం వుండాల్సింది. సీను లేకపోయినా ఒక్క క్లోజప్ వుండాల్సింది. సెన్సిబిలిటీస్ ని ఆయన పట్టించుకోలేదు.

ఇక రవితేజ పోలీసు పాత్ర, నటన, పాత్ర ముగింపు ఆయన స్టైల్లో వున్నాయి. చిరంజీవితో బాండింగ్ లేకపోవడం వల్ల పాత్ర ఉపరితలంలోనే వుండిపోయింది. యాక్షన్ సీన్లో మేక పిల్లని కాపాడే మానవీయ హృదయం రవితేజ పాత్ర పట్ల కూడా వుండాల్సింది దర్శకుడికి. కనీసం ఆ మేకపిల్ల పాత్ర ముగింపు దగ్గరైనా రోదించాల్సింది. ఎందుకంటే రవితేజ పాత్ర గురించి దానికే తెలుసు. ఈ బాండింగ్ కూడా లేకపోతే ఎలా?

శృతీ హాసన్ కమాండోగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఆ విషయమే మర్చిపోయింది. డాక్టర్ గా కేథరిన్ ట్రెసాకి మూడు నాల్గు సీన్ల కంటే లేవు. ప్రకాష్ రాజ్ విలనీకి సరైన బేస్ లేదు. బాబీ సింహాది అతడి మార్కు విలనీ. అసలు చెప్పుకోవాల్సిన పాత విలన్ ప్రదీప్ రావత్ వున్నాడు. ఈయన చిరంజీవి కమెడియన్ నేస్తాలు శ్రీనివాస రెడ్డి, సప్తగిరి, షకలక శంకర్ లతో ఒకడిగా వుంటూ ప్రతీ సీనులో బ్యాక్ గ్రౌండ్ లో ఇబ్బంది ఫీలవుతూ, డైలాగుల్లేకుండా బలహీనంగా నవ్వడం, చిరంజీవి వైపు చూడడం చేస్తూంటాడు. ఈ పరిస్థితి ఎందుకొచ్చిందో తెలీదు.

దేవీశ్రీ ప్రసాద్ పైన చెప్పుకున్న రెండు పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోరు ఫర్వాలేదు. విల్సన్ ఛాయాగ్రహణం బావుంది. ఎడిటర్ ఆ క్లయిమాక్స్ ని బాగా ఎడిట్ చేసి వుండాల్సింది. పీటర్ హెయిన్స్, రామ్ లక్ష్మణ్ లు యాక్షన్ కొరియోగ్రఫీతో కొత్తగా ఏమీ చూపించలేదు. ప్రారంభంలో సముద్రం మీద యాక్షన్ సీను గ్రాఫిక్స్ ఇంకా ఉన్నతంగా వుండాలి.

చివరిగా, దర్శకుడు బాబీ చిరంజీవిని ఎలా చూపించాలో అలా చూపించి అభిమానుల్ని అలరించాడు. అభిమానులకి ఇంతకంటే అవసరం లేదు. చిరంజీవిని ఇలా చూడడమే భాగ్యం.

First Published:  13 Jan 2023 8:07 AM GMT
Next Story