Telugu Global
MOVIE REVIEWS

Kushi Movie Review | ఖుషీ మూవీ రివ్యూ! {2.75/5}

Kushi Movie Review | గత సంవత్సరం ‘లైగర్’ పానిండియా యాక్షన్ ఈద్పరాజయంతో సందిగ్ధంలో పడ్డ విజయ్ దేవరకొండ, ఫ్యామిలీ ఓరియెంటెడ్ రోమాంటిక్ మూవీ మీదికి దృష్టి మరల్చాడు. ఇలాటి సినిమాలు తీసే (నిన్నుకోరి, మజిలీ, టక్ జగదీష్) దర్శకుడు శివ నిర్వాణ మీద బాధ్యత వుంచాడు.

Kushi Movie Review | ఖుషీ మూవీ రివ్యూ! {2.75/5}
X

Kushi Movie Review | ఖుషీ మూవీ రివ్యూ! {2.75/5}

చిత్రం : ఖుషీ

రచన- దర్శకత్వం : శివ నిర్వాణ

తారాగణం : విజయ్ దేవరకొండ, సమంత, మురళీ శర్మ, సచిన్ ఖెడేకర్, శ్రీకాంత్ అయ్యంగార్, లక్ష్మి, శరణ్య, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు

సంగీతం : హిషామ్ అబ్దుల్ వహాబ్

ఛాయాగ్రహణం : మురళి జి

బ్యాంర్ : మైత్రీ మూవీ మేకర్స్

నిర్మాతలు : నవీన్ యెర్నేని, వై. రవిశంకర్

విడుదల సెప్టెంబర్ 1, 2023

రేటింగ్: 2.75/5

గత సంవత్సరం ‘లైగర్’ పానిండియా యాక్షన్ ఈద్పరాజయంతో సందిగ్ధంలో పడ్డ విజయ్ దేవరకొండ, ఫ్యామిలీ ఓరియెంటెడ్ రోమాంటిక్ మూవీ మీదికి దృష్టి మరల్చాడు. ఇలాటి సినిమాలు తీసే (నిన్నుకోరి, మజిలీ, టక్ జగదీష్) దర్శకుడు శివ నిర్వాణ మీద బాధ్యత వుంచాడు. యూత్ అప్పీల్ కోసం సమంతని హీరోయిన్ గా తీసుకున్నాడు. దీన్ని అయిదు భాషల్లో పానిండియాగా విడుదల చేశారు. హిందీ కోసం కాశ్మీర్ లో సుదీర్ఘంగా షూటింగ్ జరిపారు. పాటలు ఇప్పటికే హిట్టయ్యాయి. 2022 డిసెంబర్ లో విడుదల వాయిదా పడి, ఈవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన దేవరకొండ సినిమా ఎలా వుందో ఓసారి చూద్దాం...

కథ

విప్లవ్ (విజయ్ దేవర్ కొండ) బిఎస్ఎన్ఎల్ లో కాశ్మీర్ లో జాబ్ వేయించుకుని అక్కడికెళ్ళి ఎంజాయ్ చేస్తూంటాడు. ఆరా (సమంత) అనే అమ్మాయి తన ఫ్రెండ్ తో పాకిస్తాన్ నుంచి వచ్చి, తప్పిపోయిన తమ్ముడ్ని వెతుకుతూంటుంది. ఆమెని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడ్డ విప్లవ్, ఆమె తమ్ముడ్ని వెతకడంలో పడతాడు. తమ్ముడు దొరకడు గానీ- ఆమె ఆరా కాదనీ, ఆరాధ్య అనీ తెలిసి పోతుంది. ఆరాధ్య తండ్రి శ్రీనివాస రావు (మురళీ శర్మ) కాకినాడలో ప్రవచనాలు చెప్పే ఆస్తికుడు. విప్లవ్ తండ్రి లెనిన్ సత్యం (సచిన్ ఖెడేకర్) అతడ్ని వ్యతిరేకించే నాస్తికుడు. వీళ్ళిద్దరూ విప్లవ్ ఆరాధ్యల పెళ్ళికి అడ్డుపడతారు. ఇప్పుడు విప్లవ్ ఆరాధ్యలు వీళ్ళని ఎదిరించి ఎలా పెళ్ళి చేసుకున్నారు? తమ పెళ్ళి పెటాకులవదని ఎలా నిరూపించ దల్చుకున్నారు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

ఇది పూర్తిగా రోమాంటిక్ కామెడీ కాదు. రోమాంటిక్ కామెడీగా మొదలై, రోమాంటిక్ డ్రామాగా మారే సీరియస్ కథ. ప్రేమికులు- వాళ్ళ జాతకాలు- వాటితో అంగీకారానికి రాని వాళ్ళిద్దరి ఆస్తిక, నాస్తిక తండ్రులూ - వీళ్ళతో కాన్ఫ్లిక్ట్ (సంఘర్షణ) ఈ కథ. అబ్బాయి జాతకం కలవక పోతే హోమం చేయించమంటాడు అమ్మాయి ఆస్తిక తండ్రి. హోమం లేదు గీమం లేదు పొమ్మంటాడు అబ్బాయి నాస్తిక తండ్రి. దీంతో అమ్మాయి తండ్రిని ఎదిరించి అబ్బాయితో వచ్చేస్తుంది.

జాతకాలు కలవని వీళ్ళు సంసారం చేస్తే సమస్యలు వస్తాయని హెచ్చరిస్తాడు అమ్మాయి తండ్రి. తమలాంటి చక్కగా సంసారం చేసే జంట ప్రపంచంలోనే లేదని ప్రూవ్ చేయాలని ఇద్దరూ అనుకుని పెళ్ళి చేసుకుంటారు. ఇక్కడామె సమస్య తన తండ్రితోనే తప్ప అబ్బాయి తండ్రితో కాదని గుర్తించదు. అలా వెళ్ళిపోతూ అబ్బాయి తండ్రితో తన తండ్రిని తక్కువ చేసి అవమానిస్తున్నానని కూడా తెలుసుకోదు. ఇద్దరూ చేయాల్సింది ఇలాటి సందర్భంలో ఇతర ప్రేమికులకి ప్రేరణగా వుండే ఫార్ములాతో, తండ్రులిద్దర్నీ రాజీకుదిర్చి పెళ్ళి చేసుకోవడం. ప్రేమ సినిమాలో ప్రేమికులకి ఆదర్శంగా వుండని భారీ బడ్జెట్ స్టార్ హీరోహీరోయిన్ల ప్రేమ సినిమాలతో యూత్ ఏం తెలుసుకుంటారు?

ఇది ఫస్టాఫ్ కథ. ఇక సెకండాఫ్ కొస్తే, పెళ్ళి చేసుకుని ఏదైతే ప్రూవ్ చేయాలనుకున్నారో అది మర్చిపోయి అపార్ధాలతో తమ మధ్య కొత్త కాన్ఫ్లిక్ట్ కి దారి తీస్తారు. కథకి అసలు కాన్ఫ్లిక్ట్ తండ్రులతో చూపించింది వుండగా, తమ మధ్య వేరే కాన్ఫ్లిక్ట్ సృష్టించుకుని దూరాలు పెంచుకుంటారు. దీంతో సెకండాఫ్ సీరియస్ రోమాంటిక్ డ్రామాగా మారిపోతుంది. ఈ సీరియస్ నెస్ ని మరిపించడానికి వేరే పాత్రల్ని దింపి, కామెడీలు సృష్టించే ప్రయత్నం చేశాడు దర్శకుడు.

ఈ కచ్చా పచ్చాగా వండిన కథకి స్టార్ హీరోయిన్లకున్న యూత్ అప్పీల్ తో, హిట్ పాటలూ కాశ్మీర్ లొకేషన్స్ తో, అగ్ర నిర్మాణ సంస్థ భారీగా ఖర్చు చేసిన ప్రొడక్షన్ విలువ లతో, ప్రేక్షకులు మైమరిచిపోయేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. అయితే నిడివి రెండు గంటలా 50 నిమిషాలు ఓర్చుకోవాలి.

నటనలు - సాంకేతికాలు

విజయ్ దేవరకొండ ఫస్టాఫ్ రోమాంటిక్ కామెడీ కాబట్టి ప్రేమని సాధించుకోవడం కోసం యాక్టివ్ పాత్రగా వుంటూ కథని ముందుకు నడిపిస్తాడు. సెకండాఫ్ రోమాంటిక్ డ్రామాగా మారిపోతుంది కాబట్టి, సంసారంలో సమస్యల్ని సృష్టించుకోవడమే తప్ప, పరిష్కరించలేని పాసివ్ పాత్రగా మారిపోయి, కథా నాయకత్వాన్ని ఇతర పాత్రలకి వదిలేస్తాడు. అయితే పాత్ర చిత్రణలో ఈ కొట్టొచ్చినట్టుండే లోపం ప్రేక్షకుల కామన్ సెన్సుకి అందకుండా పాస్ అయిపోతాడు.

కాశ్మీర్ సీన్స్ లో లవర్ బాయ్ గా బాగా యాక్ట్ చేశాడు. సుమారు గంట సేపు సాగే కాశ్మీర్ లొకేషన్స్ లో వెన్నెల కిషోర్ ని కలుపుకుని, సమంత ప్రేమకోసం చేసే సున్నిత కామెడీ సీన్లని, ఒక యాక్షన్ సీనుని, మూడు హిట్ సాంగ్స్ నీ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. కాశ్మీర్ ఎపిసోడ్ ముగించుకుని వచ్చాక మొదలయ్యే సీరియస్ డ్రామాలో గుర్తుండే ఒక్క సీను కూడా దర్శకుడ్ని అడిగి పెట్టించుకోలేక పోయాడు. ముగింపు సీనులో మాత్రం తన లోని నటుడ్ని బయటికి తీసి అభిమానుల గుండె బరువెక్కించాడు. అయితే ఈ డ్రామాకి లాజిక్ లేదనేది వేరే విషయం.

సమంత పాత్ర చిత్రణ లోపాల్ని ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కప్పి పుచ్చే ప్రయత్నం చేసింది. అయితే ఫస్టాఫ్ లో కాస్త అల్లరి పాత్రగా వుంటే యూత్ కి ఇంకా బాగా దగ్గరయ్యేది. సెకండాఫ్ లో గర్భస్రావమనే ట్రాజడీతో ఆమె డీలా పడింది.

ఇంట్రెస్టింగ్, యాక్టివ్ క్యారెక్టర్లు ఎవరంటే, తండ్రుల పాత్రల్లో మురళీ శర్మ, సచిన్ ఖెడేకర్లు. వీళ్ళ విరుద్ధ భావాలతో గొడవపడే సీన్లని చాలా నీటుగా హేండిల్ చేశాడు దర్శకుడు. మెట్రో రైల్లో సంబంధం మాట్లాడుకునే సీను సహా.

విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో శరణ్య, సమంత నానమ్మ పాత్రలో లక్ష్మి, విజయ్ దేవరకొండ పై ఉద్యోగి పాత్రలో రోహిణీ - ఈ ముగ్గురివీ అర్ధవంతమైన పాత్రలు. వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణల కామెడీ ఫర్వాలేదు.

మలయాళ సంగీత దర్శకుడు అబ్దుల్ పాటలతో, నేపథ్య సంగీతంతో ప్రేక్షకుల్ని అలరిస్తే, ఛాయాగ్రహణంతో మురళి సమ్మోహన పరుస్తాడు.

దర్శకుడు తండ్రులతో వున్న కాన్ఫ్లిక్ట్ తోనే సెకండాఫ్ నడిపి, విజయ్- సమంతలు ఏదైతే ప్రూవ్ చేయాలనుకున్నారో, ఆ పాయింటుతో రోమాంటిక్ కామెడీగానే సాగించి వుంటే- పానిండియాకి ఇంకో లెవెల్లో వుండేది. తెలుగు సినిమా కథల పరిధిలోనే వుంటే అది తెలుగు సినిమాయే. విజయ్ దేవరకొండ ఫస్టాఫ్ లో సమంత కోసం పాకిస్తాన్ కి వెళ్ళడానికి కూడా సిద్ధ పడతాడు. నిజానికి సమంతని పాకిస్తానీ అమ్మాయిగానే చూపించి, తీరా పాకిస్తాన్లో ఆమెని హిందూ ఆమ్మాయిగా రివీల్ చేసి వుంటే - ఇది ఇంతవరకూ ఇండియన్ స్క్రీన్ మీద రాని సరికొత్త సీమాంతర ప్రేమ కథ అయ్యేది. పానిండియాకి పాన్ మసాలా అయ్యేది.



First Published:  1 Sept 2023 9:22 AM
Next Story