'రంగరంగ వైభవంగా' రివ్యూ!
'ఉప్పెన' బ్లాక్‌బస్టర్ హిట్‌తో తెలుగు తెరపైకి వచ్చిన వైష్ణవ్ తేజ్, ఆ తర్వాత 'కొండపొలం' తో పరాజయాన్ని చవిచూశాడు. ఈ రెండూ వైవిధ్యమున్న సినిమాలే. ఇక మూడో ప్రయత్నంగా 'రంగ రంగ వైభవంగా' అనే ఫ్యామిలీ డ్రామాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు పండగ సందర్భంగా
చిత్రం: రంగ రంగ వైభవంగా
రచన- దర్శకత్వం: గిరీశాయ
నటీనటులు : వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ, తులసి, ప్రగతి, నరేష్, ప్రభు, నవీన్ చంద్ర, సుబ్బరాజు, ఆలీ, ఫిష్ వెంకట్, సత్య, రాజ్ కుమార్ కసిరెడ్డి తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, పాటలు : శ్రీమణి, ఛాయాగ్రహణం : శామ్ దత్
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి
నిర్మాత: బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్
విడుదల : సెప్టెంబర్ 2, 2022
రేటింగ్ 2/5
'ఉప్పెన' బ్లాక్‌బస్టర్ హిట్‌తో తెలుగు తెరపైకి వచ్చిన వైష్ణవ్ తేజ్, ఆ తర్వాత 'కొండపొలం' తో పరాజయాన్ని చవిచూశాడు. ఈ రెండూ వైవిధ్యమున్న సినిమాలే. ఇక మూడో ప్రయత్నంగా 'రంగ రంగ వైభవంగా' అనే ఫ్యామిలీ డ్రామాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు పండగ సందర్భంగా. హీరోయిన్ కేతికా శర్మతో రోమాన్స్ చేశాడు. 'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన గిరీశాయ 'అర్జున్ రెడ్డి' ని తమిళంలో రీమేక్ చేసి దర్శకుడిగా పరిచయమయ్యాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో పాటలూ హిట్టయ్యాయి. తొలిప్రేమ, మిస్టర్ మజ్ను, సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలందించిన బివిఎస్ఎన్ ప్రసాద్ దీనికి నిర్మాత. ఇలా ప్రొఫైల్ చూస్తే ఇంత ఆకర్షణీయంగా వుంది. మరి సినిమా ఎంత వైభవంగా వుంది? ఇది తెలుసుకుందాం..
కథ
వైజాగ్ లో పక్క పక్క ఇళ్ళల్లో వుండే రిషి (వైష్ణవ్ తేజ్), రాధ (కేతికా శర్మ) ఒకే హాస్పిటల్‌లో, ఒకే సమయంలో (1.43 గం. అంటే ఐలవ్యూ) చాదస్తంగా పుడతారు. అన్నప్రాసన రోజున పాక్కుంటూ చేయి చేయీ పట్టుకుంటారు. స్కూల్లో చెట్టపట్టాలేసుకుంటారు. స్కూల్లో జరిగిన ఒక గొడవలో ఇద్దరూ కొట్టుకుని విడిపోతారు. పదేళ్ళ తర్వాత మెడిసిన్ చదువుతుంటారు. అయినప్పటికీ మాట్లాడుకోరు.
రిషికి తల్లి (ప్రగతి), తండ్రి (నరేష్), ఓ అన్నా వుంటారు. రాధకి తల్లి (తులసి), తండ్రి (ప్రభు), అక్కా, ఓ అన్న అర్జున్ (నవీన్ చంద్ర) వుంటారు. ఇద్దరి తండ్రులు చంటి, రాముడులు ప్రాణస్నేహితులు. ఇద్దరి కుటుంబాలు అనుబంధాలకు, ఆత్మీయతలకీ పెట్టని కోట. ఒక సంఘటనలో మాటలు కలుపుకుని ప్రేమించుకోవడం మొదలెడతారు రిషీ రాధా. రాధ అన్న అర్జున్ రాజకీయాల్లో వుంటాడు. ఓ పెద్ద నాయకుడి కొడుకుతో పెద్ద చెల్లెలికి సంబంధం తెస్తాడు. ఆ పెళ్ళి చూపులప్పుడు పెద్ద చెల్లెలు, రిషి అన్నా తానూ ప్రేమించుకుంటున్నామంటుంది. దీంతో అర్జున్ వెళ్ళి రిషి అన్నని కొడతాడు. రిషి వచ్చి అర్జున్ ని కొడతాడు. రెండు కుటుంబాలు అరుచుకుంటాయి, తిట్టుకుంటాయి, ఇక జన్మలో కలిసేది లేదని విడిపోతాయి. రాధ కూడా రిషికి గుడ్ బై చెప్తుంది.
ఇప్పుడేమిటి? రాధ అక్క, రిషి అన్న ల ప్రేమ ఎలా ఫలించింది? రాధా రిషీలు కూడా తిరిగి ఎలా ఏకమయ్యారు. ఏకమై విడిపోయిన రెండు కుటుంబాలని ఎలా కలిపారు? ఇదీ మిగతా కథ.
ఎలావుంది కథ
గోల్కొండ కోట అంత పురాతన కథ. మన తాతలు చూశారు, తండ్రులు చూశారు, మనం చూశాం, మన పిల్లలూ చూశారు. వాళ్ళ పిల్లల కోసం అడ్వాన్సుగా తీసినట్టుంది. గోల్కొండ కోట భరోసాగా ఎప్పుడూ వుంటుంది. పండగ నాడు కూడా పాత మొగుడేనా అన్నట్టు ఈ సినిమా. 'అర్జున్ రెడ్డి' లాంటి రెబల్ లవ్ స్టోరీ తీసిన దర్శకుడేనా అన్పిస్తుంది. ఇది చిన్నప్పుడు కొట్టుకుని విడిపోయిన ప్రేమికుల కథ అనుకుంటే, కుటుంబాలనే వీడదీసి ఆ కుటుంబాలని కలిపే యూత్ అప్పీల్ లేని కథగా మారిపోయింది. నవీన్ చంద్ర క్యాలెండర్ పేజీ చించేసి ఓ మాట అంటాడు- డేట్ మారింది, మీరు కూడా అప్డేట్ అవండి - అని. అసలు అప్డేట్ అవ్వాల్సింది ఈ కథే!
'కొత్తగా లేదేంటి...' అని లవ్ డ్యూయెట్ వుంది. నిజమే అనిపిస్తుంది. కొత్తగా ఏముందని? 'చుట్టూ తారల్లా చుట్టాలుంటున్నా -భూమి చంద్రుల్లా వీళ్ళే వేరంటా' అని ఇంకో పాటలో వుంటుంది. ఇది ప్రేమ కథని ఎస్టాబ్లిష్ చేసే థీమ్ సాంగ్. కథే మారిపోయి సాంగ్ లో థీమ్ కూడా మర్చిపోతాం.
ప్రారంభం నుంచీ ఏ మాత్రం కొత్తగా లేని అవే పాత సన్నివేశాలు, ప్రేమలు, నటనలు ఫస్టాఫ్ వరకూ సాగినా, సెకండాఫ్ ఈ పాత విషయమే బలంగా వుంటుందేమో, టైటిల్ కి తగ్గట్టు వైభవంగా వుంటుందేమో అనుకుంటే- 'లైగర్' సెకండాఫ్, 'కోబ్రా' సెకండాఫ్ లాగే ఇదీ సహన పరీక్ష, టార్చర్. వరుసగా మూడు సినిమాలిలా పగబట్టి వచ్చినట్టుంది.
నటనలు- సాంకేతికాలు
వైష్ణవ్ తేజ్ సినిమాలో విషయముంటే నిలబెట్టగలడు. ఆ మాటకొస్తే ఏ సినిమాలోనూ ఏ నటీనటులూ నటనలో తీసిపోరు. తగిన పాత్రచిత్రణ లుండాలి. ఇదే వైష్ణవ్ తేజ్ కి మైనస్. 'కొండపొలం' లో లాగే ఏమీ చెయ్యని పాసివ్ పాత్ర. మెడిసిన్ చదువు తున్నా మెచ్యూరిటీ లేని చైల్డిష్ పాత్ర. చిన్నపట్నుంచీ మాట్లాడని హీరోయిన్ ని మచ్చిక చేసుకునే ప్రయత్నమే చేయడు. బయటి కారణాల వల్లే ఆమె దగ్గరవ్వాలి. ఇంటర్వెల్లో మళ్ళీ ఆమె విడిపోయాక, తిరిగి బయటి కారణాల వల్లే దగ్గరవ్వాలి.
ఇంతేగాక, ప్రేమ సన్నివేశాలు, మాటలు, అల్లరీ టీనేజీ పిల్లల లెవెల్లో వున్నాయి. టీనేజీ లవ్ స్టోరీని మెడికోలకి చుట్టబెట్టినట్టుంది. మెడికో అనడానికి మెడలో స్టెతస్కోపు వేసుకుని తిరగడం తప్ప ఏమీ వుండదు. సాంగ్స్ బాగా చేశాడు, ఫైట్స్ బాగా చేశాడు. కేతికా శర్మ కూడా డిటో వైష్ణవ్ తేజ్. టీనేజీ లెవెలే. ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు- పాతికేళ్ళ వయస్సుకి చైల్డిష్ క్యారక్టర్ ఏంటని. పైగా ఇండోర్ లో ఒక గ్లామర్ తో, ఔట్ డోర్ లో ఇంకో గ్లామర్ తో కన్పిస్తుంది. ఆమె స్లిమ్ గా కన్పించేట్టు తీయాలని విఫలయత్నం చేశాడు కెమెరామన్.
ఇక మిగిలిన నటీనటులు, వాళ్ళ పాత్రలు రొటీనే. కొత్తగా అలరించరు, కొత్తగా ఏడ్పించరు. తమిళ నటుడు ప్రభు వృధా అయ్యాడు. లేకపోతే ఆయనకి సరైన పాత్ర చిత్రణ చేస్తే వూపేసే వాడు, ఏడ్పించి రిపీట్ ఆడియెన్స్ ని పోగుజేసే వాడు. కుటుంబ సమేతంగా చూసే సినిమా తీయాలని చేసిన ప్రయత్నం కృత్రిమంగా తయారైంది. అలీ, సత్యాల కామెడీకీ ప్రేక్షకులు నవ్వలేదు.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో పాటలు బావున్నాయి. పాటలకి బీట్స్ హుషారెక్కిస్తాయి. సింగర్స్ బావున్నారు. శ్రీమణి సాహిత్యమూ బావుంది- ముచ్చపు హారంలో రాయే రత్నంలా ఎందరిలో వున్నా అస్సలు కలవరుగా/ పగలు రాతిరిలా పక్కనే వుంటున్నా వీళ్ళు కలిసుండే రోజే రాదంటా- అంటూ శంకర్ మహదేవన్ గళంలో పాట సూపర్. శ్రీమణి పాటల్లో ఇంత పాత్ర చిత్రణలు, కథా బలం నింపితే మిగతా సినినిమాలో వీటి వూసే లేదు.
శామ్ దత్ ఛాయాగ్రహణం, ప్రొడక్షన్ విలువలు రిచ్ గా వున్నాయి. టచింగా లేనిది స్క్రిప్టే!
చివరికేమిటి
కాలం చెల్లిపోయిన పాత మూస కథే కావచ్చు. కథనం కూడా చప్పబడింది. కథ నడపాల్సిన హీరోగా వైష్ణ తేజ్ లేకపోవడంతో, పాత్రకి గోల్ కూడా లేకపోవడంతో, పాసివ్ పాత్రతో కథనంలో చైతన్యమే వుండదు. పుట్టుక దగ్గర్నుంచీ చెప్పుకొచ్చిన కథ, పెద్దయ్యాక కూడా గిల్లికజ్జాలు పెట్టుకోవడం, ఒక సంఘటనతో మాటలు కలుపుకోవడం, ప్రేమించుకోవడం జరిగి, నవీన్ చంద్ర క్యారక్టర్ పెద్ద చెల్లెలి పెళ్లి విషయంలో సృష్టించే గలాభాతో కుటుంబాలూ. ప్రేమికులూ విడిపోవడం ఫస్టాఫ్ లో సాగుతుంది.
సెకండాఫ్ విషాదంగా భారంగా సాగుతుంది. హీరో హీరోయిన్లు అరకులో మెడికల్ క్యాంపు కేళ్ళే సుదీర్ఘ కామెడీ ఎపిసోడ్ సాగడం, ఇంకో సంఘటనతో ఇద్దరూ ఒకటవడం, ఇక కుటుంబాల్ని కలపాలనుకోవడం చేస్తారు. ఈ కలిపే కామెడీ ట్రిక్కులు సిల్లీగా వుంటాయి. సెకండాఫ్ కథేమిటో ఇంటర్వెల్లో తెలిసిపోయాక ఇక చూసేదేమీ వుండదు. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ పెద్ద సహన పరీక్ష. ఇదే మొత్తం వ్రతాన్నీ చెడగొట్టింది.
హీరోహీరోయిన్లు మెడికోలన్నాక వాళ్ళని కుటుంబాలు కాబోయే డాక్టర్లుగా గౌరవంగా చూసి, వాళ్ళ కోసం ఏమైనా చేసే దృక్పథంతో వుంటే ప్రేక్షకుల దృష్టిలో హీరోహీరోయిన్లు హైలైట్ అవుతారు. ఆ కలర్ఫుల్ క్యారక్టర్స్ కి కనెక్ట్ అయి చూస్తారు. దర్శకుడు తన ప్రధాన పాత్రల్ని తానే గౌరవించకపోతే ప్రేక్షకులెందుకు కేర్ చేస్తారు...ఇంకోటేమిటంటే, స్క్రీన్ ప్లే అన్నాక కథకో స్ట్రక్చర్, బలమైన కాన్ఫ్లిక్ట్, గోల్ లేకపోతే ఎలా?
- Vaishnav TejKetika SharmaRanga Ranga VaibhavangaRanga Ranga Vaibhavanga ReviewRanga Ranga Vaibhavanga RatingRanga Ranga VaibhavangaRanga Ranga Vaibhavanga ReviewRanga Ranga Vaibhavanga RatingRanga Ranga VaibhavangaRanga Ranga Vaibhavanga ReviewRanga Ranga Vaibhavanga RatingRanga Ranga VaibhavangaRanga Ranga Vaibhavanga RatingRanga Ranga Vaibhavanga ReviewRanga Ranga VaibhavangaRanga Ranga Vaibhavanga RatingRanga Ranga Vaibhavanga Review