Telugu Global
MOVIE REVIEWS

Urvasivo Rakshasivo Movie Review: 'ఊర్వశివో రాక్షసివో' మూవీ రివ్యూ {2.25/5}

Urvasivo Rakshasivo Movie Review: 2013లో ‘గౌరవం’ తో హీరోగా ప్రవేశించిన అల్లు శిరీష్ ఆ తర్వాత నటించిన 4 సినిమాలూ కలిసిరాలేదు. మార్పు లేకుండా రోమాంటిక్ సినిమాలు నటించడం ఒకటైతే, అల్లు అర్జున్ తమ్ముడిగా అభిమానుల్ని సృష్టించుకోక పోవడం రెండో కారణం.

Urvasivo Rakshasivo Movie Review: ఊర్వశివో రాక్షసివో మూవీ రివ్యూ {2.25/5}
X

చిత్రం : ఊర్వశివో రాక్షసివో

రచన - దర్శకత్వం : రాకేష్ శశి

తారాగణం : అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్, వెన్నెల కిషోర్, సునీల్

కథ : ఏలన్, సంగీతం: అనూప్ రూబెన్స్ (పాటలు),అచ్చు రాజమణి (నేపథ్య సంగీతం); ఛాయాగ్రహణం : తన్వీర్ మీర్

బ్యానర్స్ : శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్, GA2 పిక్చర్స్

సమర్పణ: అల్లు అరవింద్

నిర్మాతలు: ధీరజ్ మొగిలినేని, విజయ్ ఎమ్

విడుదల : నవంబర్ 4, 2022

రేటింగ్ : 2.25/5

2013లో 'గౌరవం' తో హీరోగా ప్రవేశించిన అల్లు శిరీష్ ఆ తర్వాత నటించిన 4 సినిమాలూ కలిసిరాలేదు. మార్పు లేకుండా రోమాంటిక్ సినిమాలు నటించడం ఒకటైతే, అల్లు అర్జున్ తమ్ముడిగా అభిమానుల్ని సృష్టించుకోక పోవడం రెండో కారణం. అయినా తిరిగి 2019 తర్వాత ఇప్పుడు మరో రోమాంటిక్ నటిస్తూ 'ఊర్వశివో రాక్షసివో' తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్ తో కొత్త తరహా యూత్ రోమాన్స్ గా దీన్ని అభివర్ణించాడు దర్శకుడు రాకేష్ శశి. ఇతను 2018 లో చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ తో 'విజేత' అనే సెంటిమెంటల్ తీశాడు. ఇది ఆడకపోయినా నిర్మాత అల్లు అరవింద్ ఇంకో అవకాశమిచ్చారు. దీన్ని దర్శకుడు నిలబెట్టుకున్నాడా? ఈసారి శిరీష్ కి సక్సెస్ దక్కిందా? ఇవి తెలుసుకుందాం...

కథ

మధ్య తరగతికి చెందిన శ్రీకుమార్ (అల్లు శిరీష్) సాఫ్ట్ వేర్ ఇంజనీర్. టైలరింగ్ చేసే తల్లి, ఎలక్ట్రికల్ షాపు నడిపే తండ్రీ వుంటారు. తొందరగా పెళ్ళి చేయాలని తల్లి (ఆమని) ప్రయత్నాల్లో వుంటుంది. కానీ కుమార్ ఆఫీసులో సింధుజ (అనూ ఇమ్మన్యూయెల్) ని వెంటపడి ప్రేమకి ఒప్పిస్తాడు. ఆమె ప్రోత్సాహంతో ఆమెతో ఒక రాత్రి గడిపాక, పెళ్ళంటే ఇష్టం లేదని, పెళ్ళి లేకుండా కలిసి వుండచ్చని చెప్పేస్తుంది. దీంతో హర్ట్ అయిన కుమార్ ఆత్మహత్యాయత్నం చేస్తాడు. తర్వాత ఆమెతో సహ జీవనానికి ఒప్పుకుని ఇంటికి దగ్గర్లోనే ఆమెతో మకాం పెడతాడు.

ఇప్పుడు తల్లిదండ్రులకి తెలియకుండా సాగిస్తున్న వ్యవహారం ఎలా బయటపడింది? అప్పుడు తల్లిదండ్రులేం చేశారు? తల్లి కోసం కుమార్ సింధుజని పెళ్ళికి ఒప్పించుకోగల్గాడా? పెళ్ళి కంటే పారిస్ లో రెస్టారెంట్ తెరవాలనుకుంటున్న సింధుజ ఏం నిర్ణయం తీసుకుంది? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

2018 లో తమిళంలో వచ్చిన 'ప్యార్ ప్రేమ కాదల్' కి రీమేక్ ఇది. అతను పెళ్ళి అంటాడు, ఆమె పెళ్ళి లేకుండా ప్రేమ అంటుంది. సాధారణంగా ప్రేమించిన హీరోయిన్ తో గడిపి హీరో మోసం చేసే సినిమాలుంటాయి. ఇందులో రివర్స్ చేశారు. హీరోయిన్ తనని ప్రేమిస్తున్న హీరోతో ఓ రాత్రి గడిపి ఇక చాలు పొమ్మనే సినిమా ఇది. సెక్స్ ని క్యాజువల్ గా తీసుకోవాలంటుంది. ఆమె అమెరికాలో పెరిగింది కాబట్టి ప్రేమా గీమా తెలియవనే సంజాయిషీ ఇచ్చుకున్నారు. అయితే ఇంత నెగెటివ్ గా వున్న ఆమెకి వ్యతిరేకంగా, పూర్తిగా పాజిటివ్ గుణాలతో హీరో వుంటేనే కథకి సంవాదం (కాన్ఫ్లిక్ట్) కుదురుతుంది.

అలా హీరో కుమార్ ది అంత దేవదాసు ప్రేమో, అర్జున్ రెడ్డి ప్రేమో కాదు. అతను మ్యాడ్ లవర్ ఏమీ కాదు. ప్రేమలో మోసపోయి ప్రేక్షకుల సానుభూతి పొందగల్గేంత పాత్ర చిత్రణేమీ లేదు. టైటిల్ ప్రకారం సింధుజ వరకూ రాక్షసిగా బాగానే వుంది. కుమారే అమాయక కుమారుడిలా లేదు. సినిమాలో మొదటి నలభై నిమిషాల సేపు ఆమెని ప్రేమలో పడెయ్యడానికి సాఫ్ట్ వేర్ ఆఫీసు అనికూడా లేకుండా చేసే అల్లరి, కామేడీ, పోకిరీతనం అతడ్ని క్లాసిక్ లవర్ గా, తర్వాత ఓ భగ్న ప్రేమికుడిగా మనం ఫీలయ్యే అవకాశాన్ని లేకుండా చేశాయి.

1991 లో కమల్ హాసన్ నటించిన క్లాసిక్ 'గుణ' లో హీరోయిన్ ప్రేమ కోసం పిచ్చివాడై ఆమెని కిడ్నాప్ చేసేదాకా వెళ్ళే భావోద్వేగాలతో భగభగ మండిస్తాడు కమల్. ఇలా కుమార్- సింధుజల మధ్య ఇంటర్వెల్లో కాన్ఫ్లిక్ట్ కి బలం లేకపోయాక, సెకండాఫ్ లో కుమార్ సహజీవనానికి ఒప్పుకునే ప్లేటు ఫిరాయింపుతో, పూర్తిగా కాన్ఫ్లిక్టే లేకుండా చేశారు కథకి. ఇక సెకండాఫ్ లో కాన్ఫ్లిక్ట్ ఏమిటా అంటే, కుమార్ సాగిస్తున్న సహజీవనం తల్లిదండ్రులతో కాన్ఫ్లిక్ట్ గా మారిపోవడం. ముగింపులో ఇక పెళ్ళి తప్పదనే కుమార్ తో సింధుజకి చిన్న తేడా, తర్వాత సుఖాంతం.

ఫస్టాఫ్ లో ప్రేమలో పడెయ్యడానికి నలభై నిమిషాలు కామెడీతో గడిపి సీరియస్ చేసినట్టు, తిరిగి సెకండాఫ్ లో సహజీవనం తో ఇంకో 40 నిమిషాలు కామెడీ నడిపి, తల్లిదండ్రులతో సీరియస్ చేశారు. దీంతో కొసరు కథతో ఎమోషన్ లేకుండా పోయింది. అనేక లిప్ లాక్ సీన్లు, బెడ్రూం సీన్లు, డబుల్ మీనింగు డైలాగులు మాత్రం క్రమం తప్పకుండా వాడారు అమృతాంజన్ లా.

నటనలు - సాంకేతికాలు

ఈసారి నటనాపరంగా, లుక్స్ పరంగా ఇంప్రూవ్ అయ్యాడు హీరో శిరీష్. మంచి కాస్ట్యూమ్స్ తో స్టయిలిష్ లవర్ బాయ్ గా వెండి తెరకి గ్లామర్ తీసుకొచ్చాడు. పాటల్లో మాస్ డాన్సులు, స్టెప్పులు వంటివి లేకుండా చూసుకున్నాడు. ఇక అల్లు శిరీష్ ఇంప్రూవ్ చేసుకోవాల్సింది సినిమాల క్వాలిటీనే. తన క్యారక్టర్స్ కి డెప్త్ తో కూడిన భావోద్వేగాల చిత్రణే. చేసేవి ప్రేమ సినిమాలైనప్పుడు ప్రేమలో బలం చూపించే, కదిలించే సన్నివేశాలే.

హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్ తన మాట నెగ్గించుకునే రాడికల్ పాత్రలో బాగానే వుంది. అయితే తన పుట్టిన రోజు తనకే తెలియకుండా ఎలా చదువుకుంది, ఎలా జాబ్ లో చేరింది? ఇందుకే శిరీష్ ఆమె పుట్టిన రోజు ఆమెకి తెలియజేసే అద్భుత సీనుకి అర్ధం లేకుండా పోయింది. దాంతో ఆమె మారడం కూడా కన్విన్సింగ్ గా వుండదు. శిరీష్ తో లిప్ లాక్స్ కి, మిగతా అడల్ట్ సీన్సుకీ మంచి కెమిస్ట్రీనే చూపించింది.

ఆమె తండ్రి పాత్రలో పృథ్వీ, అతడి తల్లి పాత్రలో ఆమెని కన్పిస్తారు. ఆఫీసులో కొలీగ్ గా వెన్నెల కిషోర్ కామెడీ చేస్తే, మేనమామగా సునీల్ కామెడీ చెయ్యడు. మేనల్లుడికి ప్రేమ సలహాలిస్తాడు.

మళ్ళీ ఈసారి అనూప్ రూబెన్స్ సంగీతంలో హిట్ సాంగ్స్ లేవు. చిత్రీకరణతో మాత్రం పాటలు కనువిందుగా వున్నాయి. 80 నిమిషాలు కామెడీ దృశ్యాలే వుండడంతో అచ్చు రాజమణి నేపథ్య సంగీతం గోలగోలగా వుంది అంత సేపూ. తన్వీర్ మీర్ కెమెరా వర్క్ క్లాస్ గా వుంది. సెట్స్ కి బాగా బడ్జెట్ ధారబోయడంతో విజువల్స్ అంతే రిచ్ గా వచ్చాయి. గత సినిమాలకంటే శిరీష్ కిది ప్రొడక్షన్ పరంగా క్వాలిటీ మూవీ, కంటెంట్ పరంగా సరేలే అనుకునే మూవీ.

First Published:  4 Nov 2022 3:39 PM IST
Next Story