Telugu Global
MOVIE REVIEWS

The Good Nurse Movie Review: 'ది గుడ్ నర్స్' -సండే స్పెషల్ రివ్యూ

The Good Nurse Movie Review: ‘ది గుడ్ నర్స్’ పేరుతో ఈ నెల 21న విడుదలైంది. నెట్ ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోతో అందుబాటులో వుంది. దీని దర్శకుడు డెన్మార్క్ కి చెందిన టోబియాస్ లిండ్హామ్.

The Good Nurse Movie Review: ది గుడ్ నర్స్ -సండే స్పెషల్ రివ్యూ
X

ఇటీవల సీరియల్ కిల్లర్ సినిమాలు పెరిగిపోయాయి. ఈ థ్రిల్లర్స్ కి ప్రేక్షకులు ఎక్కువ వుంటున్నారని, మంచి వ్యాపార సాధనమనీ కుప్పతెప్పలుగా తీసి మార్కెట్లో వదులుతున్నారు. అయితే సీరియల్ కిల్లింగ్స్ అన్నది ప్రపంచవ్యాప్తంగా ఒక సమస్యగా ఎందుకు మారింది, దీన్నెలా అరికట్టాలి, అసలు దీని మూల కారణాలేమిటి తెలియజెప్పే కోణంలో సినిమాలు రావడం లేదు. సీరియల్ కిల్లింగ్స్ కి బలయ్యేది అమాయకులే. హంతకుడితో ఏ సంబంధంలేని అమాయకులు. అమాయకుల్ని బలితీసుకునే టెర్రరిజం, సీరియల్ కిల్లింగ్స్ రెండూ ఒకటే. కానీ టెర్రరిజానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకునే ప్రభుత్వాలు సీరియల్ కిల్లింగ్స్ ని సీరియస్ తీసుకోవడం లేదు. 400 మందిని చంపగల సీరియల్ కిల్లర్స్ ఏ టెర్రరిస్టులకీ తక్కువ కాదు. సీరియల్ కిల్లర్స్- టెర్రరిస్టులు ఇద్దరూ మానసిక రోగులే.

అయితే ఇవేమీ చర్చించకుండా ఇంకో సీరియల్ కిల్లర్ సినిమా రోటీనుగా వచ్చేసింది. 'ది గుడ్ నర్స్' పేరుతో ఈ నెల 21న విడుదలైంది. నెట్ ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోతో అందుబాటులో వుంది. దీని దర్శకుడు డెన్మార్క్ కి చెందిన టోబియాస్ లిండ్హామ్. ఇందులో నర్సు అమీగా జెస్సికా చాస్టెయిన్, సీరియల్ కిల్లర్ చార్లీ కొలెన్ గా ఎడ్డీ రెడ్మాయెన్ నటించారు. పోలీస్ డిటెక్టివ్ డానీగా నామ్డో అసాముగా, ఇంకో పోలీస్ డిటెక్టివ్ టిమ్ గా నోవా ఎమరిచ్ టీమ్ల నటించారు. సంగీతం బయోస్ఫేర్, ఛాయాగ్రహణం జోడీ లీ లైప్స్. ఈ అమెరికన్ సీరియల్ కిల్లర్ మూవీ ఎలా వుందో చూద్దాం...



అమీ పెన్సిల్వేనియాలోని ఒక ఆస్పత్రిలో నర్సు. ఇద్దరు పిల్లలతో సింగిల్ మదర్. అత్యవసరంగా ఆమె గుండె మార్పిడి చికిత్స చేయించుకోక పోతే ప్రాణాపాయం. అయితే ఆమె పని చేసే ఆస్పత్రిలో ఏడాది సర్వీసు పూర్తి కాని పరిస్థితి వల్ల ఆస్పత్రి అందించే ఉచిత బీమా సౌకర్యం ఆమెకి వర్తించదు. ఇంకో మూడు నెలలు గడిస్తే గానీ ఏడాది పూర్తి కాదు. ఇలా ఇబ్బందిపడుతూనే, డ్యూటీలతో వొత్తిడికి లోనవుతూనే నైట్ షిఫ్ట్స్ చేస్తూంటుంది.

కొత్త నర్సు ఎంట్రీ

ఇప్పుడు చార్లీ కొలెన్ అనే అతను కొత్త నర్సుగా వచ్చి చేరతాడు. అమీ పరిస్థితికి జాలిపడతాడు. ఆస్పత్రిలో మందులు కొట్టేసి ఆమెకిస్తూంటాడు. ఆమె పిల్లలకి దగ్గరవుతాడు. ఆమెకి క్లోజ్ ఫ్రెండ్ అవుతాడు. ఇంతలో ఆస్పత్రిలో ఒక రోగి అవసరం లేని డబుల్ల్ ఇన్సులిన్ ఇంజెక్షన్ తో చనిపోతాడు. ఈ ఇంజెక్షన్ ఎవరిచ్చారో అర్ధంగాదు. ఆస్పత్రి యజమాన్యం కంప్లెయింట్ చేస్తుంది. ఇద్దరు పోలీస్ డిటెక్టివులు డానీ, టిమ్ లు దర్యాప్తు చేపడతారు.

దర్యాప్తు జరుగుతూండగానే మరి కొందరు రోగులు సరికాని ఔషధ మోతాదుల కారణంగా అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోవడం ప్రారంభిస్తారు. డిటెక్టివులు అమీని కఠినంగా ప్రశ్నిస్తారు. కొత్తగా చేరిన చార్లీ నేపథ్యాన్ని ఆరా తీస్తారు. వేరే ఆస్పత్రిలో చార్లీ పనిచేసినప్పుడు ఇలాగే మరణాలు సంభవించాయని, ఆస్పత్రి యాజమాన్యం కంప్లెయింట్ చేయకుండా చార్లీని తొలగించరనీ తెలుసుకుంటారు. చార్లీని ప్రశ్నిస్తే క్లూ ఏమీ దొరకదు. కానీ అమీకి చార్లీమీద అనుమానం బలపడి, అతడ్ని సీరియల్ కిల్లర్ గా పట్టుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తుంది...

చార్లీ ఎవరు?

ఈ సీరియల్ కిల్లర్ కథకి నిజ కేసు ఆధారమని సమాచారమిచ్చారు. చార్లీ కొలెన్ అనే నర్సు వివిధ న్యూజెర్సీ ఆస్పత్రుల్లో 1988-2003 మధ్య 400 మంది రోగుల్ని చంపి పట్టుబడ్డాడు. 2006 లో అతడికి 11 యావజ్జీవ శిక్షలు పడ్డాయి. కానీ ఎందుకు చంపాడో అతను కారణం చెప్పలేదు, పోలీసులు కూడా తెలుసుకోలేక పోయారు. ఈ కేసు తీసుకుని 'ది గుడ్ నర్స్' నిర్మించారు.

అయితే సినిమాతో వచ్చిన సమస్యేమిటంటే, అమీ పాత్ర పరంగా ఆమె దృక్కోణంలో కథ సాగుతుంది. అందుకని చార్లీ చేసే హత్యా దృశ్యాలుండవు. మరణాలే చూపిస్తూంటారు. అంటే యాక్షన్ వుండదు. అతడి మీద అమీ సాక్ష్యాధారాలు సేకరించే దృశ్యాలే వుంటాయి. డిటెక్టివుల ఇంటరాగేషన్లు వుంటాయి. సీరియల్ కిల్లర్ గా చార్లీతో యాక్షన్ దృశ్యాలుండవు. ఈ మూవీ యాక్షన్ తో గాకుండా డైలాగులతోనే నడుస్తుంది- రంగస్థల నాటకం లాగా. అందుకని యాక్షన్ తో వుండే థ్రిల్స్, సస్పెన్స్, టెంపో, టెన్షన్, టెర్రర్ వంటివి అనుభవం కావు. క్లయిమాక్సు, ముగింపు కూడా డైలాగులతోనే వుంటాయి. ఈ కథలో కూడా అతనెందుకు చంపాడో చెప్పలేదు. సీరియల్ కిల్లర్ గా అనుమానితుడిగా కన్పిస్తున్నప్పుడు అతడి నేర మనస్తత్వం మొహంలో కనపడదు.

గుండె జబ్బుతో వున్న అమీకి మరెవ్వరూ రోగులు హత్యకి గురవవకుండా చూసే బాధ్యత, హంతకుడిగా చార్లీని పట్టుకునే కర్తవ్యం కల్పించి ఎంత రెండు గంటల సేపు కథ నడిపినా ఫలితం లేకపోయింది. పైగా లైటింగ్ తో సమస్య వుంది. లో-కీ లైటింగ్ తో దృశ్యాలు షూట్ చేశారు. దీంతో దృశ్యాలు, మొహాలు సరిగ్గా కనిపించని పరిస్థితి. హార్రర్ ఫీలింగ్ ని క్రియేట్ చేయడానికి ఇలా చేసి వుండొచ్చు, కానీ కథలోనే హార్రర్ లేనప్పుడు చిత్రీకరణతో వస్తుందా?

First Published:  30 Oct 2022 12:46 PM IST
Next Story