Telugu Global
MOVIE REVIEWS

The Archies Movie Review | ది ఆర్చీస్ - తెలుగు రివ్యూ {3/5}

The Archies Movie Review | జిందగీ నా మిలే దోబారా, బాంబే టాకీస్, గల్లీ బాయ్స్ మొదలైన 7 సినిమాల దర్శకురాలు జోయా అఖ్తర్ ‘ది ఆర్చీస్’- ఆంగ్లో- ఇండియన్ టీనేజీ మ్యూజికల్ కామెడీతో విచ్చేసింది.

The Archies Movie Review | ది ఆర్చీస్ - తెలుగు రివ్యూ {3/5}
X

చిత్రం: ది ఆర్చీస్ - తెలుగు రివ్యూ

దర్శకత్వం: జోయా అఖ్తర్

తారాగణం : అగస్త్య నందా, సుహానా ఖాన్, ఖుషీ కపూర్, వేదాంగ్ రైనా, మిహిర్ ఆహుజా, అదితీ సైగల్, యువరాజ్ మెండా తదితరులు

బ్యానర్స్ : ఆర్చీ కామిక్ పబ్లికేషన్స్, గ్రాఫిక్ ఇండియా, టైగర్ బేబీ ఫిలింస్

పంపిణీ : నెట్‌ఫ్లిక్స్

విడుదల : డిసెంబర్ 7, 2023

రేటింగ్: 3/5

జిందగీ నా మిలే దోబారా, బాంబే టాకీస్, గల్లీ బాయ్స్ మొదలైన 7 సినిమాల దర్శకురాలు జోయా అఖ్తర్ ‘ది ఆర్చీస్’- ఆంగ్లో- ఇండియన్ టీనేజీ మ్యూజికల్ కామెడీతో విచ్చేసింది. ముగ్గురు నయా వారసులు అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా, షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్, శ్రీదేవి కుమార్తె ఖుషీ కపూర్ లు దీనికి సాధ్యం వహిస్తూ పరిచయమయ్యారు. థియేట్రికల్ విడుదల బదులుగా నెట్ ఫ్లిక్స్ ద్వారా నేరుగా ఓటీటీలో విడుదలైంది. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. రెగ్యులర్ సినిమాలకి భిన్నమైన ఆంగ్లో- ఇండియన్ పాత్రలతో, ప్రసిద్ధ ఆర్చీ కామిక్స్ ఆధారంగా రూపొందిన ఈ టీనేజర్ల లైటర్ వీన్- కమింగ్ ఆఫ్ ఏజ్ జానర్ మూవీ ఎలాటి అనుభూతి నిస్తుందో, పనిలో పనిగా క్రిస్మస్ పండుగకి ఎలాటి మూడ్ ని క్రియేట్ చేస్తుందో చూద్దాం...

కథ

పూర్వం కొందరు బ్రిటిషర్లు భారతీయుల్ని వివాహం చేసుకోవడం ద్వారా ఆంగ్లో- ఇండియన్స్ అనే కొత్త సమాజం ఏర్పడింది. స్వాతంత్ర్యానంతరం అనేక కుటుంబాలు ఇంగ్లండు వెళ్ళిపోయినా, కొన్ని కుటుంబాలు ఇక్కడే స్థిరపడ్డాయి. ఈ నేపథ్యంతో ఈ కల్పిత కథ చూస్తే- 1914 లో సర్ జాన్ రివర్‌డేల్ అనే బ్రిటిష్ ఆఫీసర్ ఆంగ్లో -ఇండియన్ కుటుంబాల కోసం నార్త్ లో ఒక హిల్ టౌన్ నిర్మించాడు. దానికి రివర్ డేల్ అని పేరుపెట్టి తోటలతో అభివృద్ధి చేశాడు. ఇది సంపన్న, శాంతియుత ఆంగ్లో-ఇండియన్ నివాసితులతో స్వాతంత్య్రానంతర భారతదేశానికి ఒక కేరాఫ్ అడ్రసుగా మారింది. ఇక్కడ గ్రీన్ పార్క్ అనే తోటని అభివృద్ధి చేసి పుట్టే ప్రతీ పిల్ల/ పిల్లాడి చేత ఒక మొక్క నాటించే సాంప్రదాయముంటుంది.

1964 కి వస్తే- ఆర్చీ(అగస్త్య నందా), వెరోనికా (సుహానా ఖాన్), బెట్టీ (ఖుషీ కపూర్), వీళ్ళ 17 ఏళ్ళ నవతరం టీనేజీ గ్రూపు స్టూడెంట్లుగా వుంటారు. ఎవరి ఆనందాలు, కలలు, కోరికలు వాళ్ళకుంటాయి. ఆర్చీ లండన్‌లో సంగీతం నేర్చుకుని క్లిఫ్ రిచర్డ్ సన్ లాగా మారాలని కోరుకుంటాడు. టౌనులో దాదాపు అన్ని ఈవెంట్స్ లో పాటలు పాడే బ్యాండ్ ‘ది ఆర్చీస్‌’ ని నిర్వహిస్తూ వుంటాడు. అయితే అమ్మాయిలతో అతను అయోమయంలో వుంటాడు. ఇద్దరు అమ్మాయిలు వెరోనికా (సుహానా ఖాన్), బెట్టీ (ఖుషీ కపూర్) లలో ఎవర్ని ఎంచుకోవాలో అర్ధంగాక ఇద్దర్నీ ప్రేమిస్తూంటాడు. అతడి బెస్ట్ ఫ్రెండ్ జగ్‌హెడ్ జోన్స్ (మిహిర్ అహుజా) ఇది వెధవ ఆలోచనరా అని తిడుతూ వుంటాడు.

ఇలా వుండగా, ఒకరోజు రివర్‌డేల్ ఆధునికంగా రూపాంతరం చెందబోతోందని, అందులో భాగంగా గ్రీన్ పార్క్ ని తొలగించి ఒక భారీ హోటల్ నిర్మించబోతున్నారనీ ఆర్చీకి, అతడి గ్రూపుకీ తెలుస్తుంది. ఈ హోటల్ ని వెరోనికా తండ్రి మిస్టర్ లాడ్జ్ (అలీ ఖాన్) నిర్మించబోతున్నాడని తెలుస్తుంది. ఈ పార్కుతో తమకి చాలా సెంటిమెంటుంది. చిన్నప్పుడు తాము నాటిన మొక్కలే ఇలా వృక్షాలయ్యాయి. వీటి నరికివేతని ఏమాత్రం సహించలేక పోతారు. ఇక ఆర్చీ లండన్ వెళ్ళే ఆలోచన మానుకుని పార్కు రక్షణ కోసం నడుం కడతాడు.

పార్కుని రక్షించుకోవడానికి ఆర్చీ గ్రూపు ఏం చేసింది? వెరోనికా తండ్రి దీని వెనుక వున్నాడని తెలిసిన తర్వాత ఆర్చీ ఆమెని ప్రేమించాడా? ఇద్దరి మధ్య సంబంధాలు ఏమయ్యాయి? బెట్టీతో ప్రేమ ఏమయ్యింది? పార్కులో హోటల్ కట్టకుండా ఎలా విజయం సాధించారు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

అమెరికన్ కామిక్స్ పాత్ర ‘ఆర్చీ’ గురించి తెలియని వారుండరు. ప్రపంచ వ్యాప్తంగా దిన, వార పత్రికల్లో పాపులరైంది. 1939 లో పబ్లిషర్ జాన్ గోల్డ్ వాటర్, ఆర్టిస్టు బాబ్ మోంటానాలు దీన్ని సృష్టించారు. దశాబ్దాలుగా పత్రికల్లో, టీవీల్లో ఈ కామిక్స్ కొనసాగుతోంది. అమాయకంగా వుండే టీనేజర్ ఆర్చీ పరిష్కరించే సమస్యలతో నవ్వించే కామిక్స్ సిరీస్ ఇది. 2019 లో మార్వెల్ సంస్థ ఈ కామిక్స్ ని టీవీ- సినిమా వెర్షన్ల ఉత్పత్తికి ఆర్చీ కామిక్స్ స్టూడియోస్ కి బదలాయించింది. 2021 లో దర్శకురాలు జోయా అఖ్తర్ దీని ఇండియన్ వెర్షన్ సినిమా నిర్మాణం చేపట్టింది.

‘ది ఆర్చీస్ ‘ లో పాత్రల పేర్లు మార్చలేదు. పాత్రల నేటివిటీ కోసం ఆంగ్లో- ఇండియన్ సమాజంలో కథ స్థాపించింది. ముంబాయిలో, ఊటీ హిల్ స్టేషన్లో 1960ల నాటి ఆంగ్లో- ఇండియన్ నేపథ్యాన్ని సృష్టించి అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం పూర్తి చేసింది. పైన చెప్పుకున్నట్టు కథ చాలా సింపుల్. ఇప్పటి సినిమా కథ అయితే ల్యాండ్ మాఫియాలు, వాళ్ళతో టీనేజర్ల రక్తపాతాలూ, అవసరమైతే ‘యానిమల్’ లో లాంటి బీభత్స భయాన కాలూ వుండొచ్చు.

ఈ కథ పాటలతో ఈ మ్యూజికల్ గా వుంటుంది. 16 పాటలున్నాయి. చాలా పాత్రల అంతర్గత సంఘర్షణలు పాటల ద్వారా చెప్పారు. అలాగే కొన్ని ముఖ్యమైన ఘట్టాలనీ, కొన్ని ఆత్మీయ సన్నివేశాలనీ డైలాగులతో కాకుండా హుషారైన పాటల ద్వారా ఫీలయ్యేట్టు చేశారు. హాలీవుడ్‌లో ఇలాంటి సంగీత స్వరాలు కథనంలో ముఖ్యమైన భాగంగా వుంటాయి. మన దగ్గర ఈ కళా ప్రక్రియ అభివృద్ధి చెందలేదు. ఈ మధ్య కాలంలో ఇలాటి కొన్ని సినిమాలు వచ్చినా ఒక్కటి కూడా ప్రేక్షకులకి కనెక్ట్ కాలేకపోయింది. ఈ కోణంలో చూస్తే ఈ సినిమాతో పెద్ద రిస్క్ తీసుకున్నారు. అయితే ఆంగ్లో -ఇండియన్ కథ కావడంతో చెల్లిపోయింది. సౌండ్ ట్రాకుని రెట్రో 1960ల బీట్‌ల ఆధారంగా స్వరకర్తలు శంకర్-ఎహసాన్-లాయ్, అంకుర్ తివారీ, ది ఐలాండర్స్, అదితి సైగల్ లు అద్భుతంగా సృష్టించారు. పాటలకి గణేష్ హెగ్డే చక్కగా కొరియోగ్రఫీ చేశాడు. యువనటీనటులు 60ల నాటి స్టయిల్లో హుషారెత్తే డాన్సులు చేశారు.

అయితే జావేద్ అఖ్తర్, అంకుర్ తివారీ, అదితీ సైగల్ లు రాసిన హిందీ పాటలకి, ఫర్హాన్ అఖ్తర్ రాసిన హిందీ మాటలకీ తెలుగులో రాసిందెవరో ఎక్కడా సమాచారం లేదు. టీనేజర్లకీ, పెద్ద పాత్రలకీ జానర్ మర్యాదకి తగ్గట్టుగా ఆహ్లాదకర మాటలు, పాటలు తెలుగులో రాశారు. ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలకి రైటింగ్, డబ్బింగ్ ఆర్టిస్టు లెవరో తెలియబర్చకపోవడం చా పెద్ద లోపం.

కొత్త వారసులు ఫర్వాలేదా?

ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కొత్తవారసులు చాలా క్యూరియాసిటీ పెంచారు. షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా, శ్రీదేవి కుమార్తె ఖుషీ, అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందాలపై వాళ్ళ వంశపారంపర్యం కారణంగా ఒత్తిడి ఎక్కువే. ఈ ముగ్గురిలో ధనిక అమ్మాయి వెరోనికా పాత్రలో సుహానా ఆత్మవిశ్వాసంతో కన్పిస్తుంది. చాలా స్క్రీన్ ప్రేజెన్స్ తో బాటు, ప్రతి ఫ్రేమ్‌లో నటించగలనన్న ఆత్మ విశ్వాసంతో అప్రయత్నంగా నటించేస్తుంది. ఆర్చీగా అగస్త్య నందా బాగా షైన్ అయ్యాడుగానీ, కొన్ని సన్నివేశాల్లో అసౌకర్యంగా కనిపిస్తాడు. బెట్టీగా ఖుషీ అత్యంత బలహీనురాలు. ప్రతి ఫ్రేమ్‌లో అద్భుతంగా కనిపిస్తుంది కానీ నటనలో స్పార్క్ లేదు.

మరోవైపు చూస్తే యువ నటీ నటులు తమ తమ పాత్రల్లో రాణించారు. వంశం ఒత్తిడి లేకపోవడం వల్లనేమో. ఇక టీనేజర్ల తల్లిదండ్రుల పాత్రల్లో కమల్ సిద్ధు, అలీ ఖాన్, వినయ్ పాఠక్, తారా సలూజా, కోయెల్ పూరీ చాలా ఫెంటాస్టిక్ గా నటించారు

చివరికేమిటి

‘ది ఆర్చీస్‌’ లో దర్శకురాలు 1960ల నాటి ఒక మధురమైన ప్రపంచాన్ని సృష్టించింది. పీరియడ్ లుక్ తో, అద్భుతమైన కెమెరా పనితనంతో భవనాలు, రోడ్లు, ప్రాంతాలు, కాస్ట్యూమ్స్, కళా దర్శకత్వంలతో సంగీత రూపం లాగా సింపుల్ కథ చెప్తూ, రాజకీయాలపై పర్యావరణంపై సందేశాన్ని కూడా అందించింది. ప్రేమ కథ- పార్కు కథ రెంటినీ మిక్స్ చేసి టీనేజర్ల మనస్తత్వాల్ని, స్వల్ప సంఘర్షణల్ని, పరిష్కారాల్నీ చూపించి నాటి కాలానికి ఒక నివాళిగా ముగించింది. క్రిస్మస్ కి కూడా పండగ మూడ్ ని సృష్టిస్తూ, క్రిస్మస్ వేడుకల్ని కూడా చూపిస్తూ, రెండున్నర గంటల మ్యూజికల్ కామెడీని మిఠాయి పొట్లం చుట్టి అందించింది.

First Published:  9 Dec 2023 12:13 PM GMT
Next Story