Telugu Global
MOVIE REVIEWS

టెనెంట్ - రివ్యూ! {1.5/5}

కమెడియన్ సత్యం రాజేష్ ‘మసూద’, ‘మాఊరి పొలిమేర 2’ వంటి హార్రర్ సినిమాల్లో సీరియస్ పాత్రలు కూడా వేస్తున్నాడు. ఇప్పుడు మరో అలాటి సీరియస్ పాత్ర ‘టెనెంట్’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ లో నటించాడు.

టెనెంట్ - రివ్యూ! {1.5/5}
X

చిత్రం: టెనెంట్

రచన-దర్శకత్వం : వై యుగంధర్‌

తారాగణం : సత్యం రాజేష్‌, మేఘా చౌదరి, ఎస్తర్‌ నోర్హా, భరత్ కాంత్‌, చందన, రమ్య, మేఘనా, తేజ్‌ దిలీప్‌, ఆడుకాలం నరేన్‌ తదితరులు.

సంగీతం : సాహిత్య సాగర్‌, ఛాయాగ్రహణం : జెమిన్‌ జోం అయ్యనీత్‌

నిర్మాత : ఎం. చంద్రశేఖర రెడ్డి

విడుదల : ఏప్రెల్ 2024

రేటింగ్: 1.5/5

కమెడియన్ సత్యం రాజేష్ ‘మసూద’, ‘మాఊరి పొలిమేర 2’ వంటి హార్రర్ సినిమాల్లో సీరియస్ పాత్రలు కూడా వేస్తున్నాడు. ఇప్పుడు మరో అలాటి సీరియస్ పాత్ర ‘టెనెంట్’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ లో నటించాడు. గంటన్నర నిడివిగల ఈ సినిమాకి వై. యుగంధర్ కొత్త దర్శకుడు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ని ఒక సామాజిక సందేశమివ్వాలని తీశారు. మంచి గురించి చెప్తే వినే కాలం పోయింది. ఈ రోజుల్లో సినిమా అంటే చెడుని హైలైట్ చేసి, ఆ చెడిపోయిన పాత్రల్ని గ్లోరిఫై చేసి వదిలేయడమే తప్ప, నీతులు చెప్పి మార్చే ప్రయత్నం చేస్తే టికెట్లు తెగే పరిస్థితి లేదు. మరి ఈ సినిమా ఇలాటి ప్రయత్నమే చేసిందా, లేక మార్కెట్ లో వున్న ట్రెండ్ కి భిన్నంగా, అదే పాత పోకడ పోయిందా తెలుసుకుందాం...

కథ

హైదరాబాద్ లో ఓ రాత్రి పూట గౌతమ్‌ (సత్యం రాజేష్‌) భార్య సంధ్య (మేఘా చౌదరి) శవాన్ని తీసికెళ్ళి కాల్చేస్తాడు. పోలీసులకి పట్టుబడతాడు. కేసుని ఏసీపీ (ఎస్తర్‌ నోర్హా) టేకప్ చేస్తుంది. దర్యాప్తులో ఒక్కో విషయం బయటపడుతుంది. గౌతమ్ కి ఇటీవలే సంధ్యతో పెళ్ళయింది. పెళ్ళైన కొన్ని రోజులకే ఇద్దరి మధ్యా దూరాలేర్పడ్డాయి. మాటల్లేవు. వీళ్ళ పక్క ప్లాట్ లో రిషి అనే అతను ఫ్రెండ్స్ తో కలిసి వుంటాడు. రిషికి గర్ల్ ఫ్రెండ్‌ శ్రావణి (చందన) వుంటుంది. ఈమెకి పెళ్ళి సంబంధాలు చూస్తూంటే రిషి దగ్గరికి వచ్చేస్తుంది. వచ్చాక అపార్ట్ మెంట్ మీంచి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. ఇది చూసి రిషి కూడా దూకేస్తాడు.

వీళ్ళెందుకు దూకేశారు? భార్య సంధ్యని గౌతమే చంపాడా? గౌతమ్ కీ రిషికీ వున్న సంబంధమేమిటి? అసలు ఈ నలుగురి మధ్య ఏం జరిగింది? ఈ మరణాల వెనకున్న కారణాల్ని ఏమని తేల్చింది ఏసీపీ? ... ఇదీ మిగతా కథ

ఎలావుంది కథ

మద్యం, మాదక ద్రవ్యాలు జీవితాల్ని ఎలా నాశనం చేస్తాయో చెప్పదలిచారు. కొత్త వ్యక్తులతో ఆడవాళ్ళు జాగ్రత్తగా వుండాలని కూడా చెప్పదలిచారు. విషయం కొత్తది కాకపోయినా, ఆ విషయాన్ని చెప్పడంలో కూడా కొత్తదనం లేదు. పాత్రలు ఈ కాలం నాటివి కావు. కథ ఈ కాలానిది కాదు. ఈ కాలపు పాత్రల్ని, మోసాల్ని చూపించడానికి అలంకృతా శ్రీవాస్తవ 2016 లో తీసిన ‘లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా’ వుంది. మధ్యతరగతికి చెందిన 16 ఏళ్ళ అమ్మాయి నుంచీ, 60 ఏళ్ళ మేడమ్ వరకూ పోటీ యుగంలో ఏమేం చేస్తారో వాస్తవికంగా చూపించిన సినిమా.

మద్యం, మాదక ద్రవ్యాలతో మగాళ్ళు, వీళ్ళతో అమాయక ఆడవాళ్ళు - చివరికి ఫలితం. ఇంతే కథ. దీన్ని ఒక హత్య కేసు దర్యాప్తుతో సస్పెన్స్ థ్రిల్లర్ గా చూపిస్తూ అసలు విషయం విప్పితే నిలబడుతుందను కున్నారేమో, అదీ కుదర్లేదు. ఎందుకంటే, సినిమా మొదలెట్టినప్పట్నుంచీ ముగించేవరకూ ఒకటే నీరసంగా- సీరియల్ కంటే అన్యాయంగా సాగుతుంది. పాత్రలన్నీ విషాదంగానే వుంటాయి. ఇక హత్య కేసు దర్యాప్తు అంటే నిందితుడ్ని కూర్చోబెట్టి అడగడమే. అతను చెప్పే ఫ్లాష్ బ్యాకులు వినడమే.

ఫస్టాఫ్ రెండు ట్రాకుల్లో కథ నడుస్తుంది- గౌతమ్, సంధ్య; రిషి, శ్రావణి ట్రాకులు. ఈ రెండు ట్రాకులు గౌతమే ఏసీపీకి చెప్పుకొస్తూంటాడు! కన్ఫ్యూజింగ్ గా వుంటుంది. ఇలా ఫస్టాఫ్ ప్రశ్నలే రేకెత్తించి, సెకండాఫ్ సమాధానాలు విప్పుకుంటూ వెళ్ళారు. మద్యంతో, మాదక ద్రవ్యాలతో క్రైమ్ ఇన్వాల్వ్ అయివుంటే, ఆ సస్పెన్సు. థ్రిల్స్, టెంపో, ట్విస్టులూ వగైరా మెయింటెయిన్ చేయకుండా, పరమ నీరసంగా సీన్లు పేర్చుకుంటూ పోయారు. ఈ సీన్లకి సంగీత పరికరాలే కొరవడినట్టు పేలవంగా నేపథ్య సంగీతం.

సినిమా గంటన్నరే అయినా యుగాలు గడుస్తున్నట్టు వుంటుంది. ఇదొక పాత సామాజిక కథ, దీన్ని సస్పెన్స్ థ్రిల్లర్ గా తీయడమే కలిసి రాలేదు. స్లీపింగ్ పిల్స్ తో ఆడవాళ్ళని మోసం చేసే కథలతో సినిమాలెన్నో వచ్చాయి. అలాటి ఒక కథ ఇది.

నటనలు –సాంకేతికాలు

సత్యం రాజేష్ సహా నటీనటులందరూ విషాదంగానే కనిపిస్తారు. వేరే ఎమోషన్స్ లేవు. హీరోయిన్ మేఘా చౌదరి, ఏసీపీగా వేసిన ఎస్తర్‌ నోర్హాలనైతే అస్సలు చూడలేం. చెప్పే డైలాగులు వినలేం. మేఘా చౌదరి ఒక ఫ్లాష్ బ్యాక్ పాటలో మాత్రం సత్యం రాజేష్ తో రోమాంటిక్ గా కనిపిస్తుంది. ఏసీపీగా ఎస్తర్‌ కి పోలీసు అధికారి షేపే లేక ఇబ్బందిగా వుంటుంది. హాస్పిటల్లో నర్సులా కన్పిస్తుంది. వర్కవుట్స్ చేసి బరువు తగ్గాలేమో. ఇక సత్యం రాజేష్ కున్న అతి తక్కువ డైలాగులు డబ్బింగ్ ఖర్చుని బాగా తగ్గించినట్టుంది.

ఇక డ్రగ్స్ బ్యాచీ, రిషీ శ్రావణి పాత్రధారులూ సినిమా స్క్రీన్ కి సరిపోరు. వెబ్ సిరీస్ కి సరిపోతారు. దర్శకుడు యుగంధర్ సామాజిక సమస్యగా భావించి ఆడవాళ్ళని హెచ్చరిస్తూ సినిమా తీస్తే, చూసేందుకు ఆడవాళ్ళు వస్తారా? తప్పక వస్తారు- అమితాబ్ బచ్చన్ తో ‘పింక్’ (2016) తీసినట్టు తీస్తే. అప్పట్లో ‘పింక్’ హిందీ సినిమాని తెలుగు యువతులు కూడా విరగబడి చూశారు హైదరాబాద్ లో. అదొక అపూర్వ దృశ్యం. అదే శ్రీదేవితో ‘మామ్’ తీస్తే దేశవ్యాప్తంగానే రెస్పాన్స్ రాలేదు. ఎందుకంటే, కూతురి భద్రత గురించి శ్రీదేవి పాత్ర ఆషామాషీగా వుంది.

First Published:  21 April 2024 5:32 PM IST
Next Story