Telugu Global
MOVIE REVIEWS

SWA- A Sound Of Soul Movie Review: ‘స్వ- ఎ సౌండ్ ఆఫ్ సోల్’ – మూవీ రివ్యూ

Swa A Sound Of Soul Movie Review: ‘స్వ- ఎ సౌండ్ ఆఫ్ సోల్’ అనే హార్రర్-రోమాంటిక్ - సస్పెన్స్ థ్రిల్లర్. కొత్త వాళ్ళు చేసిన ప్రయోగం. రచన -దర్శకత్వం మను పీవీ. జిఎంఎస్ గ్యాలరీ ఫిలిమ్స్ బ్యానర్‌పై జిఎం సురేష్ నిర్మాణం. మహేష్ యడ్లపల్లి, స్వాతీ భీమిరెడ్డి, యశ్వంత్ పెండ్యాల, మాణిక్ రెడ్డి, శ్రీనివాస్ భోగిరెడ్డి, సిద్ధార్థ్ గొల్లపూడి నటీనటులు. సంగీతం కరణం శ్రీ రాఘవేంద్ర, ఛాయాగ్రహణం దేవేంద్ర సూరి, కూర్పు శ్రీ వర్కల.

SWA- A Sound Of Soul Movie Review: ‘స్వ- ఎ సౌండ్ ఆఫ్ సోల్’ – మూవీ రివ్యూ
X

SWA- A Sound Of Soul Movie Review: ‘స్వ- ఎ సౌండ్ ఆఫ్ సోల్’ – మూవీ రివ్యూ

కొన్ని విజాతి జానర్లని కలిపి జానర్ బ్లెండర్ గా సినిమాలు తెలుగులో వస్తూంటాయి. అవి చాలా వరకూ క్రాఫ్టు కుదరక విఫలమవుతూ వుంటాయి. కిరణ్ అబ్బవరం నటించిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ అని ఒకటి రాబోతోంది. దీని గురించి చెబుతూ- ‘కాన్సెప్ట్ తో మొదలై లవ్ కామెడీ మిక్స్ అయి, క్రైమ్ నుంచి సస్పెన్స్ నుంచి సాగే ఒక ఇంటెన్స్ డ్రామా అనుకోవచ్చు’ - అని పబ్లిసిటీ ఇచ్చారు. ఇలా చాంతాడంత గందరగోళంగా చెబితే సినిమా ఇంకెంత గందరగోళంగా వుంటుందో అర్ధం జేసుకోవచ్చు. నవరసాల్లో ఏది ఎందుకు మిక్స్ చేస్తున్నారో స్పష్టత లేక ఫ్లాపయిన సినిమాలున్నాయి. పూర్వం ‘హవా’ అనే హిందీలో తల్లి కథగా నడుస్తున్న హార్రర్ కథనం (బీభత్స రసం) కాస్తా, ఆమె కూతురి కథగా మారిపోయి సైకో థ్రిల్లర్ గా (అద్భుత రసం) ముగుస్తుంది. ఇలా విజాతి జానర్ల కలబోత అతుకు

లేసినట్టు వుంటే సినిమా ఎటూ గాకుండా పోతుంది. కలబోత అంటే జానర్ల మద్య కార్యకారణ సంబంధం.

ఈ నేపథ్యంలో వచ్చిందే విజాతి జానర్ల ‘స్వ- ఎ సౌండ్ ఆఫ్ సోల్’ అనే హార్రర్-రోమాంటిక్ - సస్పెన్స్ థ్రిల్లర్. కొత్త వాళ్ళు చేసిన ప్రయోగం. రచన -దర్శకత్వం మను పీవీ. జిఎంఎస్ గ్యాలరీ ఫిలిమ్స్ బ్యానర్‌పై జిఎం సురేష్ నిర్మాణం. మహేష్ యడ్లపల్లి, స్వాతీ భీమిరెడ్డి, యశ్వంత్ పెండ్యాల, మాణిక్ రెడ్డి, శ్రీనివాస్ భోగిరెడ్డి, సిద్ధార్థ్ గొల్లపూడి నటీనటులు. సంగీతం కరణం శ్రీ రాఘవేంద్ర, ఛాయాగ్రహణం దేవేంద్ర సూరి, కూర్పు శ్రీ వర్కల.

భ్రాంతితో దిగ్భ్రాంతులు

అభిషేక్ ఒక ఆర్టిటెక్ట్. నాయనమ్మ చనిపోతే వస్తాడు. మంచం మీద వున్న చనిపోయిన నానమ్మ లేచి మంచి నీళ్ళు తాగి పడుకోవడం చూసి కలవరపతాడు. అంత్యక్రియల తర్వాత కూడా నాయనమ్మ సజీవంగానే కన్పిస్తూ వుంటే దిగ్భ్రాంతి చెందుతాడు. తనది లాజికల్ మైండ్. తనకి కన్పిస్తున్నవి నిజం కాదు, భ్రాంతి అని నమ్ముతాడు. ఈ భ్రాంతితో వుండగానే ఇంకో భ్రాంతికి లోనవుతాడు. తను ప్రేమించిన చనిపోయిన స్వప్న వచ్చి తను నిజం అంటుంది, అబద్ధమంటాడు. ఈ సంఘర్షణతో వుండగానే ఆమె చావు వెనుక రహస్యముందని అనుమానిస్తాడు. ఈ అనుమానంతో ఛేదించుకుంటూ వెళ్తూంటే వూహించని విషయాలు బయటపడుతూంటాయి. ఇదంతా నిజమా? అబద్దమా? అసలు తనకి ఏం జరుగుతోంది? దీన్నుంచి ఎలా బయటపడాలి? కొలీగ్ భాస్కర్, డాక్టర్ జయప్రకాష్, పోలీస్ ఇన్స్ పెక్టర్, మినిస్టర్...వీళ్ళందరికీ వున్న సంబంధమేమిటి? తెలుసుకుంటూంటే అభిషేక్ కి మతి పోతూంటుంది...

బలమైన కథ- బిగువైన మలుపులు

నాయనమ్మ మరణంతో హార్రర్ గా ప్రారంభమై, స్వప్న రాకతో ఫ్లాష్ బ్యాక్ లో రోమాన్స్ లోకి తిరగబెట్టి, ఆమె మరణంతో సస్పెన్స్ థ్రిల్లర్లోకి మలుపు తీసుకునే మల్టీపుల్ జానర్స్ కథ. ఈ మూడు జానర్స్ కార్యకారణ సంబంధం (కాజ్ అండ్ ఎఫెక్ట్) తో పరస్పరం కనెక్ట్ అయివుంటాయి. నాయనమ్మ మరణం అభిషేక్ సబ్ కాన్షస్స్ మైండ్ లో ట్రిగర్ పాయింట్ గా పనిచేస్తే, దీంతో చనిపోయిన స్వప్న మైండ్లోకి తిరిగొచ్చింది. తిరిగొచ్చిన స్వప్న ఆమె మరణం వెనుక రహస్యం తెలుసుకునేందుకు దారితీసింది. వీటన్నిటికీ మూలకారణం షిజోఫ్రేనియాతో బాధపడే అభిషేక్ మానసిక స్థితి. విజాతి జానర్లతో కాన్సెప్ట్ పకడ్బందీగా వుంది.

దీని కథనం కామెడీలతో, ఎంటర్టైన్ మెంట్ తో పక్కదారులు పట్టకుండా జానర్స్ మర్యాదలతో సూటిగా, స్పష్టంగా వుంది. సెకండాఫ్ కథనంలో మలుపులు కావాల్సినంత సస్పెన్స్ నీ, థ్రిల్స్ నీ సృష్టిస్తాయి.

దర్శకుడు మనూ ప్రొఫెషనల్ గా కనిపిస్తాడు కథ విషయంలో- సెకండాఫ్ లో లాజికల్ గా కొన్ని లోపాలున్నప్పటికీ. ముగింపు ముగిసిపోయిన కథకి పొడిగింపులా వుంటుంది. 1983 లో హిందీ ‘ధువా’ లో (హాలీవుడ్ ‘టు ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో’- 1958 కి అనుసరణ) క్యారక్టర్లు ఒకటొకటే నిజస్వరూపాలు బయటపెట్టుకుని, ఎంతో దయామ

యురాలిగా కన్పించే రాజమాతని హంతకురాలిగా రివీల్ చేసే షాకింగ్ ముగింపులాంటిది వుండాల్సింది అభిషేక్ పాత్రతో. అభిషేక్ పాత్ర ఏ మానసిక సమస్యతో మొదలైందో అదే మానసిక సమస్యతో క్యారక్టర్ ఆర్క్, ట్విస్టు వంటివి లేకుండా ముగిసింది.

పోతే, అభిషేక్ పాత్రలో మానసిక సంఘర్షణతో వుండే నటనని మహేష్ యడవల్లి మంచి టెంపో తో పోషించాడు. కొత్త వాడులా అన్పించడు. దాదాపు ప్రతీ సీనులో తను వుంటూ కథని బాగా క్యారీ చేశాడు. స్వప్న పాత్రలో స్వాతీ భీమిరెడ్డి సంఘర్షణ కూడా బలంగా పోషించింది. నెగెటివ్ గా కన్పించే భాస్కర్ గా యశ్వంత్ పెండ్యాల యాక్షన్ తో కథ ముందుకు సాగడానికి తోడ్పడ్డాడు. డాక్టర్ గా శ్రీనివాస్ భోగిరెడ్డి, మరో డాక్టర్ గా సిద్ధార్థ్ గొల్లపూడి డ్రామాని పకడ్బందీగా పోషించారు. ఇన్స్ పాత్రలో మాణిక్ రెడ్డి ప్రత్యేక దృష్టినాకర్షిస్తాడు.

సంగీతం, ఛాయాగ్రహణం, కూర్పు మొదలైన విభాగాలు నిర్వహించిన సాంకేతికులు కథతో పోటీపడ్డారు. దర్శకుడు మానూ పీవీ చిన్న సినిమాకి బలమైన కంటెంట్ ముఖ్యమని, దానికి బలమైన టాలెంట్ కూడా అవసరమని ఈ జానర్ బ్లెండదర్ తో తేల్చి చెప్పాడు. దీన్ని clasc యాప్ ని డౌన్ లోడ్ చేసుకుని ఉచితంగా చూడొచ్చు.


First Published:  18 Jan 2023 4:10 PM IST
Next Story